logo

పింఛన్లు మీరే ఇప్పించండి

గ్రామ సర్పంచిలు, గ్రామ స్థాయిలో పార్టీ బాధ్యతలు చూస్తున్న నాయకులు కచ్చితంగా అమలు చేసి తీరాల్సిన పని ఇది. పంచాయతీలు, సచివాలయాల్లో ఏ క్లస్టర్లలో ఎప్పుడు పింఛను ఇస్తున్నారనే విషయం సంబంధిత కార్యదర్శులను అడిగి తెలుసుకోవాలి

Published : 03 Apr 2024 04:59 IST

పార్టీ నాయకులు, వాలంటీర్లకు మాజీ మంత్రి పేర్ని ఆదేశాలు

 మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: గ్రామ సర్పంచిలు, గ్రామ స్థాయిలో పార్టీ బాధ్యతలు చూస్తున్న నాయకులు కచ్చితంగా అమలు చేసి తీరాల్సిన పని ఇది. పంచాయతీలు, సచివాలయాల్లో ఏ క్లస్టర్లలో ఎప్పుడు పింఛను ఇస్తున్నారనే విషయం సంబంధిత కార్యదర్శులను అడిగి తెలుసుకోవాలి. రాజీనామా చేసిన వాలంటీర్లు, నాయకులు పింఛనుదారులను ఆటోల్లో ఎక్కించుకుని వారికి పింఛను ఇప్పించాక తిరిగి ఇంటివద్ద దింపాలి. పింఛనుదారులకు మంచినీరు, ఇతరత్రా అవసరాలు సమకూర్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇందుకు అయ్యే ఖర్చు మనం మనం చూసుకుందాం. రాజీనామాలు చేసిన వాలంటీర్లు, పార్టీ నాయకులు ఈ పనిని బాధ్యతగా తప్పనిసరిగా చేయాలి.

 వాట్సాప్‌ గ్రూపు ద్వారా వాలంటీర్లు, పార్టీ నాయకులకు మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) పై విధంగా ఇచ్చిన ఆదేశం ఇది.
సామాజిక మాధ్యమాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇది హల్‌చల్‌ చేస్తోంది. అధికార పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రకరకాల కుయుక్తులు  పన్నుతున్నారు. ఇప్పటికే పింఛన్ల పంపిణీ చేయకుండా తెలుగుదేశం అడ్డుకుందని అసత్య ప్రచారాలు చేస్తున్న వీరు ఇప్పుడు మరో వ్యూహం పన్నారు. వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలన్న లక్ష్యంతో సోమవారం నుంచి అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర జిల్లాలు, నియోజకవర్గాలతో పోలిస్తే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు 1000 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు రాజీనామా పత్రాలు అందజేశారు. వీరి రాజీనామాలపై అధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం వెల్లడించని నేపథ్యంలో రాజీనామా పత్రాలు ఇచ్చిన వారు విధుల్లో ఉన్నట్టా.. లేనట్టా అన్న విషయంలోనూ స్పష్టత లేదు. రాజీనామాలను సంబంధిత అధికారులు ఆమోదించినట్లు ప్రకటించే వరకూ వారు వాలంటీర్‌ బాధ్యతల్లో ఉన్నట్టే. ఈ పరిస్థితుల్లో పేర్ని ఆదేశాలను శిరసావహిస్తూ ఎవరైనా వాలంటీర్‌ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ఉల్లంఘనగా గుర్తించి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని