logo

తెదేపాతో క్రీడా వికాసం.. వైకాపాతో వినాశనం

గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యం వెలికితీసి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలన్న ఉన్నత లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ క్రీడా వికాస పథకం ప్రవేశపెట్టింది.

Published : 13 Apr 2024 05:29 IST

ఇండోర్‌ స్టేడియాల నిర్మాణానికి మంగళం
ఉమ్మడి జిల్లాలో ఆటలు అటకెక్కించిన జగన్‌

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యం వెలికితీసి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలన్న ఉన్నత లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ క్రీడా వికాస పథకం ప్రవేశపెట్టింది. కొత్త క్రీడా విధానాన్ని రూపొందించి నియోజకవర్గానికి ఒక ఇండోర్‌ స్టేడియం, ఆటస్థలాలు అభివృద్ధి చేయాలన్నదే ఆ పథకం ముఖ్య లక్ష్యం. ఈ మేరకు ఇండోర్‌ స్టేడియాల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించింది. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆటలను అటకెక్కించింది. క్రీడాభివృద్ధిని గాలికొదిలేసింది. నిర్మాణాలను ఎక్కడికక్కడే వదిలేసింది. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క స్టేడియం కూడా నిర్మించిన పాపానపోలేదు. క్రీడా వికాస పథకం ఉద్దేశం ఘనంగా ఉన్నా.. తెదేపా ప్రభుత్వంపై కసితో ఆ పథకాన్ని మూలనపడేసి పైశాచిక ఆనందం పొందింది.

బిల్లులు చెల్లించకపోవడంతోనే..

స్టేడియాల నిర్మాణం ఆలస్యం కావడానికి అసలు కారణం బిల్లులదే. పనులు జరిగిన దశ వరకు కూడా బిల్లులు చెల్లించలేదు. పనులు 25 శాతం దాటకపోతే ఆపేయాలని అప్పట్లో ప్రభుత్వమే ఆదేశించింది. ఓ గుత్తేదారు న్యాయస్థానానికి వెళ్లడంతో కొంత మేరకు బిల్లులు చెల్లించారు. అనంతపురం, శింగనమల, ఆత్మకూరులో ప్రతిపాదనలు దశలోనే ఆగాయి.


ఎక్కడి పనులు అక్కడే...

క్రీడావికాస పథకం కింద 2018లో అనంతపురం జిల్లాలో మొత్తం ఐదు ఇండోర్‌ స్టేడియాల నిర్మాణం ప్రారంభించారు. గుంతకల్లు, కల్లూరు, తాడిపత్రి, రాయదుర్గం, ఉరవకొండ పట్టణాల్లో నిర్మాణం చేపట్టారు. ఒక్కో స్టేడియానికి రూ.2 కోట్ల అంచనాతో పనులు మొదలెట్టారు. వీటి నిర్మాణం జరిగితే షటిల్‌ బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో, జూడో, కుస్తీ తదితర క్రీడాంశాలు సాధన చేసుకోవచ్చు. గుంతకల్లులో రూప్‌స్థాయి వరకు నిర్మించారు. ఉరవకొండ, కల్లూరు, తాడిపత్రి, రాయదుర్గంలో పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురం, మడకశిరలో 80 శాతం వరకు పూర్తయ్యాయి. వీటిని కూడా పూర్తి చేయకుండా ప్రభుత్వం కుంటిసాకులు వెతికింది. సీకేపల్లి, కనగానపల్లి, కొత్తచెరువు మండలాల్లో పునాదుల దశలోనే ఆగిపోయాయి. ఇందులో పిచ్చిమొక్కలు మొలవడంతో నిర్మాణ ఆనవాళ్లూ కనిపించలేదు. కదిరిలో అసలు నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు.


శిలాఫలకమే సాక్షి..

ముదిగుబ్బ: తెదేపా హయాంలో ముదిగుబ్బలో ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రానికి రూ.1.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. అత్యాధునిక హంగులతో సుమారు 2.23 ఎకరాల్లో స్టేడియం నిర్మించేందుకు స్థలం ఏర్పాటు చేసింది. వైకాపా అధికారం చేపట్టాక అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఆ స్థలం ఆక్రమణకు బరితెగించారు. రహదారిని కబ్జా చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు.


పడకేసిన నిర్మాణం

రాయదుర్గం: ఆదర్శ పాఠశాల ఆవరణలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇండోర్‌ స్టేడియం పనులు ఐదేళ్లుగా పడకేశాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో 2018లో దాదాపు రూ.10 లక్షల పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. కంపచెట్లు, పిచ్చి మొక్కలు వృక్షాలుగా మారాయి.


ఒక్క ఇటుకనూ పేర్చలేదు

ఉరవకొండ: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడటంతో స్టేడియం నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ ఐదేళ్లల్లో ఒక్క ఇటుకను కూడా ఈ ప్రభుత్వం నిర్మాణం కోసం పేర్చలేదు. నిర్మాణం పూర్తయి ఉంటే కళాశాలలో 700 మంది విద్యార్థులకు ఉపయోగంగా ఉండేది.


న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో..

కొత్తచెరువు: నియోజకవర్గ స్థాయి ఇండోర్‌ స్టేడియాన్ని కొత్తచెరువుకు మంజూరు చేశారు. పనులు కూడా ప్రారంభించడంతో త్వరలో అందుబాటులోకి వస్తుందని క్రీడాకారులు కలలు కన్నారు. గుత్తేదారులు బాబు, అంకాళ్‌రెడ్డిలు రూ.50 లక్షలు వెచ్చించి పనులు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక బిల్లుల మంజూరులో జాప్యం జరగడంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇటీవల రూ.15 లక్షలు బిల్లు మాత్రం మంజూరైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని