logo

సహకార బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ సెలవుపై అనుమానాలు

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చీఫ్‌ మేనేజరు అనిల్‌ కుమార్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్యాంకులో పేరుకే చీఫ్‌ మేనేజరు ఉద్యోగం.. నిత్యం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెంట తిరిగేవారు.

Published : 25 May 2024 04:30 IST

తాడిపత్రి గొడవల్లో ఆయన పాత్రపై ఆరా

సమావేశానికి హాజరైన తెదేపా నేతలు కాలవ, సాంబశివుడు, నరసానాయుడు, ఖమర్‌ బేగం తదితరులు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చీఫ్‌ మేనేజరు అనిల్‌ కుమార్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్యాంకులో పేరుకే చీఫ్‌ మేనేజరు ఉద్యోగం.. నిత్యం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెంట తిరిగేవారు. రెండు శాఖలకు నోడల్‌ అధికారి ఈయనే అయినా విధులను పక్కన బెట్టి నిరంతరం రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. రాజకీయ పలుకుబడి ఉన్నందున అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో అతనిపై అనేక కేసులు కూడా ఉన్నాయి. అయినా అతనికి చీఫ్‌ మేనేజరుగా పదోన్నతి కల్పించి అందలం ఎక్కించారు. గతంలో గొడవలు, పాతకక్షలతో ప్రాణభయం కారణంగా ఏ పోస్టులో ఉన్నా అతను విధులకు హాజరు కావడం అరుదే. బ్యాంకుకు చుట్టపు చూపుగా వచ్చి అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. ఇలాంటి అధికారికి వైకాపాలో ప్రాధాన్యం ఉన్నందున పాలకవర్గం, ఉన్నతాధికారులు కూడా మాటమాత్రమైనా దండించడానికి భయపడుతున్నారు. ఎన్నికల పోలింగ్‌ అనంతరం తాడిపత్రిలో దాడులు, ప్రతి దాడులు జరిగాయి. ఎంతోమంది తాడిపత్రి వదిలి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. బ్యాంకు చీఫ్‌ మేనేజరు అనిల్‌ కుమార్‌రెడ్డి కూడా తాడిపత్రిలో లేరని తెలిసింది. ఇతని పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆరోగ్యం బాగాలేదని సాకు చెప్పి ఆయన నెలరోజులపాటు మెడికల్‌ లీవు పెట్టారు. బ్యాంకు ప్రధాన కార్యాలయానికి సెలవు చీటిని పంపారని అధికారులు ధ్రువీకరించారు. ఆరోగ్యం నిజంగా బాగా లేదా? లేకుంటే తాడిపత్రి గొడవల్లో పాత్ర ఉందా? అన్నదానిపై చర్చ సాగుతోంది.

 బ్యాంకు సీఈఓ రాంప్రసాద్‌ మాట్లాడుతూ.. చీఫ్‌ మేనేజరు అనిల్‌ కుమార్‌రెడ్డి మెడికల్‌ లీవు పెట్టింది వాస్తవమేనన్నారు. తాడిపత్రిలో జరిగిన గొడవలకు సంబంధించి అతని పాత్ర ఉందన్న విషయం తెలియదన్నారు. పోలీసుల నుంచి ఏదైనా ఆధారం దొరికితే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని