logo

దీక్షలు.. నిరసన జ్వాలలు

ఓ వైపు తెదేపా నేతల నిర్బంధాలు, అరెస్టులు.. మరోవైపు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల నిరాహార దీక్షలు.. రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు.. ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కనిపించిన పరిస్థితి ఇది.

Updated : 11 Sep 2023 05:21 IST

పలుచోట్ల భగ్నం చేసేందుకు విఫలయత్నం
చంద్రబాబుకు రిమాండ్‌తో రాజమహేంద్రవరంలో భారీ భద్రత  
అర్ధరాత్రి చేరుకున్న తెదేపా అధినేత
నేడు జిల్లాల బంద్‌కు పార్టీ పిలుపుతో అప్రమత్తం

నల్లజర్ల వద్ద అభిమానులకు చంద్రబాబు అభివాదం

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ- న్యూస్‌టుడే బృందం: ఓ వైపు తెదేపా నేతల నిర్బంధాలు, అరెస్టులు.. మరోవైపు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల నిరాహార దీక్షలు.. రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు.. ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కనిపించిన పరిస్థితి ఇది. తెదేపా అధినేత చంద్రబాబుకు అనిశా న్యాయస్థానం రిమాండ్‌ విధించిన నేపథ్యంలో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీసు యాక్ట్‌ను కూడా అధికారులు తెరమీదికి తీసుకొచ్చారు. ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి అర్ధరాత్రి 1.16 గంటలకు తీసుకురావడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ పరిసరాలతో పాటు జాతీయ రహదారి, నగర కీలక మార్గాల్లో  పోలీసుశాఖ విస్తృతంగా బలగాలను మోహరించింది. తెదేపా అధిష్ఠానం సోమవారం బంద్‌కు పిలుపు ఇవ్వడంతో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటుచేశారు.

బొమ్మూరులో నిరసన చేపడుతున్న తెదేపా నాయకులు

సామూహిక దీక్షలతో ...

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణులు సామూహిక ఆందోళనలకు దిగారు. ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు చేపట్టి అధినేతకు సంఘీభావం తెలిపారు. పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబుపై నమోదుచేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని.. తక్షణమే విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. అధినేతను అక్రమంగా కేసులో ఇరికించి.. జగన్‌ వికృతానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలుచోట్ల దీక్షలను భగ్నం చేసిన పోలీసులు.. నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

ఎక్కడికక్కడ కట్టడి..

రెండు రోజులుగా కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రాలతోపాటు.. ప్రధాన పట్టణాలు, కీలక నేతలున్న ప్రాంతాల్లో పోలీసులు, ప్రత్యేక బలగాలు మోహరించాయి. ఆదివారం వేకువ జాము నుంచీ అదే పరిస్థితి. వాహనాల తనిఖీలు చేపట్టారు. తెదేపా నాయకుల నివాసాల వద్ద మోహరించారు. 144 సెక్షన్‌, 30 పోలీసు చట్టం అమల్లో ఉన్నందున ముఖ్య నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయవద్దని నోటీసులు ఇచ్చారు. ముఖ్య నాయకులను రెండోరోజూ గృహనిర్బంధంలో ఉంచారు. నల్లజర్ల నుంచి రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారిపై బారికేడ్లు అడ్డు పెట్టి ట్రాఫిక్‌ను మళ్లించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం, లాలాచెరువు కూడలి, వై కూడలి ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

జగన్‌ వైఖరిపై నిరసన సెగలు..

  • ముఖ్యమంత్రి జగన్‌ వైఖరిని నిరసిస్తూ తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మేకా ఆనందసాగర్‌ పి.గన్నవరంలో శిరోముండనం చేయించుకున్నారు.
  • కాకినాడ జడ్పీ కూడలిలో నల్లచొక్కాలు ధరించి తెదేపా నాయకులు నిరసన తెలిపారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
  • రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సాగిన నిరసన దీక్షలో మేమంతా చంద్రబాబుతో ఉన్నామంటూ ప్లకార్డులతో మద్దతు తెలిపారు.
  • ఏలేశ్వరంలో తెదేపా జిల్లా అధికార ప్రతినిధి పైలా సుభాష్‌చంద్రబోస్‌, ఇతర నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
  • అమలాపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, తెదేపా నాయకుడు మెట్ల రమణ తదితరులు అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు.

రెండు రోజులుగా గృహనిర్బంధంలోనే..

  • కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును వాడపాలెం గ్రామంలోని నివాసంలో రెండు రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచారు.
  • ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గృహ నిర్బంధం రెండోరోజూ కొనసాగింది. ఇంట్లోనే ఆయన దీక్ష చేపట్టారు.
  • అనపర్తి మండలంలో తెదేపా నేతలకు నోటీసులిచ్చి పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

  • నిడదవోలులో తెదేపా సామూహిక నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాయకులను అదుపులోకి తీసుకుని తరలించారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
  • కడియంలో తెదేపా నాయకులు సామూహిక దీక్షలు చేపట్టారు.
  • కొవ్వూరులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
  • దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.
  • అనపర్తి మండలం రామవరంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్ల దుస్తులు ధరించి దీక్షలో పాల్గొన్నారు.  ఇంట్లోకి వచ్చి కాపలా కాసే అధికారం మీకు ఎక్కడిదని, అనుమతి ఎవరిచ్చారంటూ ఆయన సీఐను ప్రశ్నించారు. మరుగుదొడ్ల వద్ద కూడా పోలీసులను ఉంచడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
  • రాజానగరంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా నాయకులు సామూహిక దీక్షలో పాల్గొన్నారు.
  • కోరుకొండ బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద రిలే దీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
  • తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామం వద్ద ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది.
  • గోపాలపురం జాతీయ రహదారిపై చెక్‌పోస్టు వద్ద తెదేపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపారు.

రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ

రాష్ట్రంలో పోలీసులు అప్రకటిత కర్ఫ్యూ విధించారు. తెదేపా అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేసేందుకు సైతం అనుమతి ఇవ్వడంలేదు. దీక్షలు భగ్నం చేస్తున్నారు. మతిస్థితిమితం లేని వ్యక్తి పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం జగన్‌ మానసిక స్థితి పరిశీలించాలి. నన్ను గృహనిర్బంధమని చెప్పి రాజానగరం పోలీస్‌ష్టేషన్‌కు తరలించి రాత్రి వరకు వదల్లేదు. 78 ఏళ్ల వయసులో ఇబ్బందిపెట్టారు. పోలీసులపై హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేస్తానని హెచ్చరిస్తే ఇంటికి తరలించి ఆదివారం ఉదయం నుంచి మళ్లీ బయటకు వెళ్లనీయకుండా 40 మందిని కాపలా పెట్టారు. హత్యలు చేసిన వ్యక్తులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ, అవినీతి మచ్చలేని చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది. సీఐడీ జగన్‌ వ్యక్తిగత సంస్థగా మారింది. ప్ర£తిపక్షాలపై ఉసిగొల్పేందుకు ప్రభుత్వం సీఐడీని వాడుకుంటోంది. సాధారణ కేసుల్లోనూ హత్యాయత్నం, అట్రాసిటీ తదితర సెక్షన్లు వేసి బెయిల్‌ రాకుండా చేస్తున్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు.

గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం గ్రామీణం

ప్రజాదరణ జీర్ణించుకోలేకే కుట్రలు..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 2021లో నమోదైన కేసుకు సంబంధించి కుట్రపూరితంగా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చంద్రబాబు, లోకేశ్‌కు విశేష ప్రజాదరణ చూసి జగన్‌ జీర్ణించుకోలేక ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారు. తుగ్లక్‌ తరహా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్‌ ప్రజల ముందు దోషిగా నిలిబడే పరిస్థితి దగ్గరకొచ్చింది.

నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే పెద్దాపురం

రాష్ట్రంలో దారుణ పరిస్థితులు..

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాచరిక పాలనను తలపించేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తూ హిట్లర్‌ను గుర్తుకు తెస్తున్నారు. నాలుగున్నర నెలలుగా కక్షపూరిత పాలన సాగిస్తూ, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. నాయకులను మాట్లాడనీయకుండా నిలువరిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. బయటకు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తూ నాకు 149 నోటీసు ఇచ్చారు. నా భర్తను శుక్రవారం నుంచి కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం నగరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని