logo

అధికారం హద్దులు దాటేస్తోంది!

కాకినాడ జిల్లాలో ఓ నియోజకవర్గానికి నియమితులైన వైకాపా సమయన్వయకర్త రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని కేడర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను పక్కనపెట్టి పట్టుకోసం.. అక్రమాలకు పచ్చజెండా ఊపారు

Updated : 28 Feb 2024 06:43 IST

జగ్గంపేటలో ఇటీవల స్వయం సహాయక సంఘాలకు ఆసరా చెక్కు అందజేస్తున్న వైకాపా సమన్వయకర్త తోట నరసింహం



తవ్వుకోండి..నే చూసుకుంటా..

 కాకినాడ జిల్లాలో ఓ నియోజకవర్గానికి నియమితులైన వైకాపా సమయన్వయకర్త రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని కేడర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను పక్కనపెట్టి పట్టుకోసం.. అక్రమాలకు పచ్చజెండా ఊపారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పంచుకోండి ఏమైనా నేను చూసుకుంటానని పార్టీ నాయకులకు భరోసా ఇచ్చారు. తీరంలో బొండు ఇసుక తవ్వకాలకు ఏ అడ్డంకీ ఉండదని స్పష్టత ఇచ్చేశారు.


సొంత ప్రచారానికి ఆ శాఖనా?

తూర్పుగోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గానికి పొరుగు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సమన్వయకర్తగా వెళ్లారు. కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన ఆ శాఖను తన సొంత ప్రచారానికి వాడేస్తున్నారు. ఈయన రోజువారీ కార్యక్రమాల కోసమే ఆ శాఖ ఉందన్నట్లు వ్యవహారం తయారైంది.


అయితేనేం..దర్జాగా వాలిపోతారు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఓ నియోజకవర్గానికి ఇటీవల సమన్వయకర్తను మార్చారు. ఈయనకు ప్రభుత్వపరంగా ఎలాంటి హోదా లేదు. అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం నిర్వహించిన వాలంటీర్లకు వందనంలోనూ ఈయన కనిపించారు.


ఈనాడు, కాకినాడ: వైకాపా నుంచి సమన్వయకర్తలుగా నియమితులైన కొందరు నేతలు ప్రభుత్వ ప్రతినిధుల్లా వ్యవహరిస్తూ దర్జాగా ప్రారంభోత్సవాలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. కీలక శాఖల అధికారులతో సమీక్షలూ నిర్వహించేస్తున్నారు. నియోజకవర్గానికి రాజైనా, మంత్రయినా నేనే.. ఏం జరిగినా నాకు తెలియాలంటూ హుకుం జారీచేస్తున్నారు. వీరి కథ ఇలా ఉంటే.. నియోజకవర్గాలు మారిన మరికొందరు ప్రజాప్రతినిధులు తమకున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సందట్లో సడేమియాలా ప్రచారాలూ చేసుకుంటున్నారు.

అంతా అడ్డగోలు..అడిగేదెవరు..

* గోపాలపురం సమన్వయకర్తగా హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు నుంచి పంపారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం..జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావును పి.గన్నవరం సమన్వయకర్తలుగా నియమించారు. వీరు అధికారిక హోదాల్లో సమీక్షలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటుండడంతో ఆక్షేపించలేని పరిస్థితి నెలకొంది. మిగిలినవారికి ఎలాంటి హోదా లేకున్నా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ధీటుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్‌చల్‌ చేస్తున్నారు.
* ప్రత్తిపాడు సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును వైకాపా నియమించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఉన్నా.. ఆయనను కాదని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సుబ్బారావు చురుగ్గా పాల్గొంటున్నారు. ఆసరా చెక్కుల పంపిణీ, వాలంటీర్లకు వందనం నిర్వహించి తెగ భరోసా ఇచ్చేస్తున్నారు. అధికారులకూ లోపాయికారీగా దిశానిర్దేశం చేసేస్తున్నారు.
* జగ్గంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కాదని.. వైకాపా సమన్వయకర్త బాధ్యతలు మాజీ ఎంపీ తోట నరసింహంకు అధిష్ఠానం అప్పగించింది. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఆసరా, చేయూత, వాలంటీర్లకు వందనం.. తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో తోట పాల్గొంటున్నారు. నియోజకవర్గ పరిస్థితిపై సమీక్షిస్తుండటంతో శాఖలు తలలు ఊపుతున్నాయి.  
* రాజమహేంద్రవరం పార్లమెంటు సమన్వయకర్త గూడురు శ్రీనివాసరావుకు ప్రభుత్వ పరంగా అధికారిక హోదాలేదు. సిటీలో డివిజన్ల వారీగా డ్వాక్రా మహిళల ఆసరా కార్యక్రమాలతోపాటు.. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈయన పాల్గొనడం చర్చనీయాంశమైంది.
* రామచంద్రపురం సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్‌ వాలంటీర్లకు వందనం, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తండ్రి సుభాష్‌చంద్రబోస్‌తో హాజరవుతున్నారు.
* పెద్దాపురంలో సామూహిక గృహప్రవేశాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నీటిపథకాలు, ఇతరత్రా ప్రారంభోత్సవాలు గత కొన్నేళ్లుగా జరిగాయి. తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప లేకుండానే ఇవి సాగిపోయాయి. ఇక్కడి సమన్వయకర్త దవులూరి దొరబాబుకు ఇన్నాళ్లు హౌసింగ్‌ బోర్డు ఛైర్మన్‌ హోదా ఉండేది.. ఇప్పుడదీ లేదు. కానీ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు ఈయన సారథ్యంలోనే మరి.
* గోపాలపురం నుంచి కొవ్వూరు సమన్వయకర్తగా ఎమ్మెల్యే తలారి వెంకటరావు నియమితులయ్యారు. పొరుగు నియోజకవర్గంలో చేసే పెత్తనం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అంశంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
రామచంద్రపురం ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం గ్రామీణ సమన్వయకర్తగా.. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ను సిటీ సమన్వయకర్తగా అధిష్ఠానం నియమించింది. వీరు అధికారిక హోదాలోనే కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి, వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారు. స్థానికంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవానీ ఉన్నా.. వారు తెదేపాకు చెందినవారు కావడంతో విస్మరిస్తున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం వారికి గౌరవం కూడా ఇవ్వలేదన్న విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని