logo

అదే నిర్లిప్తత!

కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు.

Published : 18 May 2024 03:22 IST

ఈ ఎన్నికల్లో ఓటేయనివారు 8.78 లక్షల మంది

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద పరిమిత సంఖ్యలో ఓటర్లు

ఈనాడు, కాకినాడ: కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. మునుపటి ఎన్నికలతో పోలిస్తే ఈ సార్వత్రిక సమరంలో భారీ స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదవ్వడానికి కారణం ఇదే. ఓటరులో వెల్లివిరిసిన చైతన్యంపై అంతటా చర్చసాగుతోంది. ఇదే సమయంలో కీలక ఎన్నికల్లో విలువైన అస్త్రాన్ని వినియోగించుకోవడంలో కొందరు నిర్లిప్తత ప్రదర్శించారు. కాకినాడ, తూర్పు గోదావరి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఏకంగా 8.78 లక్షల మంది ఓటేయలేదు. ఎన్నికల పండగకు దేశ, విదేశాల నుంచి రెక్కలు కట్టుకువచ్చి మరీ ఓటేస్తే.. వీరిలో మాత్రం ఎందుకింత నిస్తేజం.. పాలకులను ప్రశ్నించే, సమర్థ నాయకులను గద్దెను ఎక్కించే ఓటు వినియోగంలో ఎందుకింత నిర్లక్ష్యమనే అభిప్రాయం వినిపిస్తోంది.

  • అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.84 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అమలాపురం లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్లు 15.31 లక్షల మంది ఉంటే.. 12.84 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16.16 శాతం మంది చేజార్చారు.
  • తూర్పుగోదావరి జిల్లాలో 80.93 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో 16.23 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 13.13 లక్షల మంది ఓటేశారు. ఇక్కడ ఓటు వేయనివారు 19.07 శాతం.
  • కాకినాడ జిల్లా/ లోక్‌సభ పరిధిలో 16.34 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 13.12 లక్షల మంది ఓటేేశారు. ఇక్కడ వినియోగించుకున్నవారి శాతం 80.30 ఉంటే.. ముందుకురానివారు 19.70 శాతం.  
  • ఇతర ఓటర్ల హక్కు వినియోగం కోనసీమలో 52.38 శాతం ఉంటే.. కాకినాడ జిల్లాలో 54.84, తూర్పులో 59.79 శాతం ఉంది. పిఠాపురం, రాజానగరం, రామచంద్రపురం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో ఇతరులు శతశాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని