logo

అంగన్‌వాడీల నిరసన గళం

వేతనాలు పెంచుతామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చలో విజయవాడకు బయలుదేరిన అంగన్‌వాడీ సిబ్బందిని పోలీసులు

Published : 21 Mar 2023 05:37 IST

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం.. అడ్డుకుంటున్న పోలీసులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వేతనాలు పెంచుతామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చలో విజయవాడకు బయలుదేరిన అంగన్‌వాడీ సిబ్బందిని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించి, అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ.. కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించారు. స్థానిక జడ్పీ కూడలి నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా బారికేడ్లు, రోప్‌ పార్టీలు, ఏఎన్‌ఎస్‌ బలగాలతో పోలీసులు నిలువరించారు. దీంతో వందల సంఖ్యలో వచ్చిన అంగన్‌వాడీ సిబ్బంది బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నాయకులు దువ్వ శేషబాబ్జీ, సీహెచ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తకు    రూ.13,550 వేతనం చెల్లిస్తుంటే.. ఆంధప్రదేశ్‌లో మాత్రం 11,500 మాత్రమే ఇస్తున్నారన్నారు. తెలంగాణ కంటే రూ.2 వేలు అధికంగా ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌రెడ్డి ఇచ్చిన హామీ నాలుగేళ్లవుతున్నా అమలు చేయలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గ్రాట్యూటీని ఇక్కడా వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. మినీ వర్కర్లకు మొయిన్‌ వర్కర్లుగా మార్చి వేతనం చెల్లించాలన్నారు. ముఖ హాజరు విధానం రద్దు చేయాలని, బిల్లులు సక్రమంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలపై దుర్భాషలాడిన సామర్లకోట సీఐ దుర్గాప్రసాద్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులతో ఒకటో పట్టణ సీఐ కృష్ణ చర్చలు జరిపి, నిరసన విరమించాలని కోరడంతో అంతా వెళ్లిపోయారు. కార్యక్రమంలో మలకా వెంకటరమణ, ఎంకే జ్యోతి, దీప్తి, రాధ, సత్యవేణి, నాగమణి, సుప్రియ, ప్రేమజ్యోతి, వెంకటలక్ష్మి, రాణి  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని