logo

AP Elections: వీరిలో కట్టప్పలు ఎవరు?

అంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఆశించిన అభ్యర్థులందరికీ టికెట్లు సాధ్యం కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే జరిగింది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు. కొందరైతే అదును చూసుకుని దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నారు.

Updated : 24 Mar 2024 08:35 IST

అభ్యర్థులను వెంటాడు తున్న అసంతృప్తుల గుబులు
అగ్రనేతల హామీలు.. బుజ్జగింపుల పర్వం
ఈనాడు, కాకినాడ

అంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఆశించిన అభ్యర్థులందరికీ టికెట్లు సాధ్యం కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే జరిగింది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు. కొందరైతే అదును చూసుకుని దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నారు. ఎంతగా సర్దిచెబుతున్నా ఎన్నికల్లో వీరు ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకం. కట్టప్పలు ఎవరో తేలక మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్‌కు నెలన్నరపైనే గడువు ఉండడంతో అసంతృప్తితో రగిలిపోతున్నవారిని ఓ వైపు బుజ్జగించే చర్యలు ముమ్మరమయ్యాయి.

ఉమ్మడి జిల్లాలోని మూడు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో విజయబావుటా ఎగరవేయాలనే తలంపుతో అన్ని పార్టీలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతికూలతలు వెంటాడుతున్నాయి. అధికార పార్టీకి ప్రజావ్యతిరేకత, అంతర్గత పోరు సవాలుగా మారింది. ఇప్పటికే వైకాపా నేతలు తాయిలాలతో  ఓటర్లను, కీలక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తెదేపా- జనసేన- భాజపా కూటమి అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకోవడంతో ఇంటిపోరు చక్కదిద్దుకుని ఓటర్ల ప్రసన్నానికి క్షేత్ర స్థాయిలోకి కదిలేందుకు దృష్టిసారించారు.  


ఇంటి‘పోరు’.. ఇంతింత కాదయా!

  • పిఠాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. కాకినాడ ఎంపీ వంగా గీతను వైకాపా అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. అప్పట్నుంచి అంటీముట్టనట్లు పెండెం వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీలో ఉండడంతో ఫ్యాను పార్టీలో ఆందోళన మొదలైంది. దీంతో వైకాపా అధ్యక్షుడు జగన్‌.. దొరబాబును పిలిపించుకుని భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. తనకే పొగపెడతారా అని లోలోన రగిలిపోతున్న ఈయన ఏమేరకు సహకరిస్తారో చూడాల్సిందేనన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. తెదేపా పిఠాపురం ఇన్‌ఛార్జి వర్మ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించినా.. అనూహ్యంగా జనసేనాని తెరమీదికి వచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు వర్మను పిలిపించి తొలి జాబితాలోనే ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు భవిష్యత్తుకూ భరోసా ఇవ్వడంతో  పవన్‌ విజయానికి కృషిచేస్తానని ప్రకటించారు.
  • కాకినాడ గ్రామీణంలో వైకాపా టికెట్‌ పితాని అన్నవరం ఆశించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో అధిష్ఠానం  పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను ఓడించడమే లక్ష్యంగా అదే పార్టీకి చెందిన మరోనేత పావులు కదుపుతున్నారు. ఈయనే రానున్న ఎన్నికల్లో పితానికి తెరవెనుక ఊతమిస్తారనే చర్చ నడుస్తోంది. ఇక్కడ తెదేపా టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్తకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యత అప్పగించి అధిష్ఠానం అసంతృప్తికి తెరదించింది. దీంతో జనసేన అభ్యర్థి పంతం నానాజీతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.
  • రాజోలు అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే రాపాక వర్గానికి, టికెట్‌ దక్కిన గొల్లపల్లి వర్గానికి పొసగడంలేదు. రాపాకను అమలాపురం లోక్‌సభకు పంపి.. రాజోలులో గొల్లపల్లి సూర్యారావును అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది. రాపాక జనసేన నుంచి నెగ్గాక పవన్‌కు హ్యాండిచ్చి వైకాపాతో జత కట్టారు. ఈ పరిస్థితి మింగుడుపడని జనసైనికులు ఇప్పుడు లోక్‌సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రాపాకకు దీటైన సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
  • ప్రత్తిపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, వైకాపా అభ్యర్థి వరుపుల సుబ్బారావు మధ్య పూడ్చలేని దూరం పెరిగింది.

జగ్గంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించిన అధిష్ఠానం మాజీ ఎంపీ తోట నరసింహంను అభ్యర్థిగా దింపింది. సమన్వయకర్తగా నియమించిన అనంతరం తోట తీరుపై బాహాటంగానే విమర్శించిన చంటిబాబు..ఈ ఎన్నికల్లో చెక్‌పెట్టే వ్యూహంలో ఉన్నారు. చంటిబాబు వ్యతిరేకంగా పనిచేస్తే.. రానున్న ఎన్నికల్లో వైకాపాకు కష్టకాలమే అనే వాదన వినిపిస్తోంది.


కాకినాడ నగరంలో అధికార పార్టీ నేతలకు కబ్జాలు, దౌర్జన్యాలు మచ్చగా మారాయి. ప్రచారం ప్రారంభం రోజే నిలదీత శ్రేణులకు మింగుడు పడడంలేదు. గత ఎన్నికల్లో తెదేపా కోటకు వ్యూహాత్మకంగా బీటలు వేసిన వైకాపా నేతలు.. ఇప్పుడూ అదే ప్రణాళికలో ఉన్నారు. తెదేపాలోని అసంతృప్తులను దరిచేర్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వైకాపా ఉచ్చులో పడవద్దని పలువురు వీరికి సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని