logo

ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్‌

ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

Updated : 25 Apr 2024 07:36 IST

ఎర్రబాలెంలో మాట్లాడుతున్న నారా లోకేశ్‌

ఎర్రబాలెం(మంగళగిరి), న్యూస్‌టుడే: ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన ‘రచ్చబండ’ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటు కాళ్లతో తన్నారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. పరదాల మాటున జగన్‌ సచివాలయానికి వెళుతున్నారని, అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఆ దుస్థితి తలెత్తేదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని  సీఎం రాజధాని రైతులను ఓట్లు అడుగుతారంటూ నిలదీశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన అయిదు శాతం రాజధాని పనులు పూర్తిచేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. అమరావతి ప్రాంతంలో ఇసుక, కంకర, మట్టితోసహా దోచుకెళ్లారన్నారు. పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులు, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కౌలు వెంటనే చెల్లించే చర్యలు చేపడతానన్నారు. రాజధాని పనులు కొనసాగించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. పేదలకు పక్కాఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. 

హాజరైన జనం

కక్షగట్టి పింఛన్‌ తీసేశారు..

రాజధానికి భూములిచ్చామని కక్ష కట్టి పెన్షన్లు తీసేశారని ఎర్రబాలెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అసైన్డ్‌ భూముల్లో నివసించే వారికి పట్టాలివ్వాలని కోరారు. ల్యాండ్‌ పూలింగ్‌కు సహకరించిన రైతుల పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాలు కల్పించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలపై స్పందించిన లోకేశ్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఎలాంటి కోత లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తామన్నారు. కొండ పోరంబోకు, ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి ఉన్నచోటనే పట్టాలిప్పిస్తామని భరోసా ఇచ్చారు.

క్రైస్తవులను గుండెల్లో పెట్టుకుంటాం

కూటమి ప్రభుత్వం వస్తే క్రైస్తవులను ఇబ్బంది పెడుతుందని వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని నారా లోకేశ్‌ సూచించారు. మంగళగిరి మండలం చిన్నకాకాని ‘రచ్చబండ’లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భాజపాతో పొత్తుపెట్టుకున్నామని, క్రైస్తవ సోదరులను గుండెల్లో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. 2014లో భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎటువంటి సమస్యలు తలెత్తలేదన్నారు. క్రిస్మస్‌ కానుకలు, పాస్టర్లకు గౌరవ వేతనం, చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చామన్నారు. తెదేపాపై విషం చిమ్ముతున్న కాపు ముసుగు నేతలు రిజర్వేషన్లపై జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గతంలో తెదేపా ఇచ్చిన నిధుల్లో పది శాతం కూడా ఆ సామాజికవర్గానికి ఇవ్వలేదన్నారు. మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానని, పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం తనకు లేదన్నారు. అధికారంలో లేకపోయినా సొంత డబ్బుతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని