logo

ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం

జిల్లాలో పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి.

Updated : 19 May 2024 10:07 IST

ఏం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని కొంతమంది పోలీసుల మథనం

జిల్లాలో అల్లర్లపై వందల కేసులు.. వీడియోలు, చిత్రాల ఆధారంగా గుర్తింపు

ఈనాడు, నరసరావుపేట: జిల్లాలో పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. ప్రశాంతత నెలకొనడంతో పోలీసులు దాడులకు బాధ్యులైన వారిని గుర్తించి వారిపై కేసులు పెడుతున్నారు. మరోవైపు పోలింగ్‌రోజు శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమైన పోలీసులు, పోలింగ్‌ అనంతరం హింసను అరికట్టలేకపోవడానికి కారణాలు, పోలీసుశాఖలో అధికార పార్టీకి సహకరిస్తూ దాడులను ప్రోత్సహించిన ఇంటి దొంగలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) శనివారం మధ్యాహ్నం నుంచి విచారణ  మొదలెట్టింది. దీంతో పల్నాడు జిల్లాలో అటు పోలీసుశాఖలోనూ,  ఇటు కేసుల్లో ఉన్న బాధ్యుల్లోనూ అలజడి మొదలైంది.


సిట్‌ విచారణలో ఎవరిరెవరు దోషులుగా తేలుతారో అన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుశాఖలో ఏ ఇద్దరు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. సిట్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన పోలీసు అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులపై ఎన్నికల సంఘం చర్య తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సిట్‌ విచారణ అత్యంత కీలకంగా మారింది. అధికార పార్టీతో అంటకాగి నిఘా సమాచారాన్ని చేరవేసి ఇతోధికంగా సాయమందించిన పోలీసులు ఇప్పుడు అంతర్గత విచారణతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం ఇంతదాకా వస్తుందని అనుకోలేదని, అత్యుత్సాహంతో వివాదాల్లో చిక్కుకున్నామని కొందరు పోలీసులు అంతర్మథనం చెందుతున్నారు. సిట్‌ విచారణలో బాధ్యులుగా తేలితే ఎన్నికల సంఘం చర్యలతోపాటు శాఖాపరమైన విచారణ ఎదుర్కొవాల్సి ఉంది.

నూజండ్ల మండలం ఉప్పలపాడులో పోలీసుల తనిఖీలు 

అల్లర్లకు బాధ్యులైన వారిపై కేసులు

పల్నాడు జిల్లాలో అల్లర్లకు బాధ్యులైన వారిని గుర్తించి వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో ఘర్షణల్లో పాల్గొన్న వారిని గుర్తించి బాధ్యులపై కేసులు పెడుతున్నారు. పోలింగ్‌ ముగిసి ఐదు రోజులైనా ఇప్పటి వరకు కేసుల నమోదుపై పెద్దగా దృష్టిసారించని యంత్రాంగం ఇప్పుడు జూలు విదుల్చుతోంది. ఘటన జరిగిన రోజు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు, పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలు, వివిధ వర్గాల వారు ఘటనలు జరిగే సమయంలో చరవాణిలో తీసిన వీడియోలు, చిత్రాలు సేకరించి వాటి ఆధారంగా బాధ్యులను గుర్తిస్తున్నారు. తెదేపా, వైకాపా, జనసేన పార్టీలకు చెందినవారిని గుర్తించి వారిని బాధ్యులుగా చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే పిన్నెల్లి సోదరులు అరెస్టు చేస్తారన్న భయంతో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. దీంతో మాచర్ల నియోజకవర్గంలో వైకాపాలో కీలక నేతలు అందరూ గ్రామాలు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఘర్షణల సందర్భంగా గ్రామాల్లో ఉన్నవారు అందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. అరెస్టులు ప్రారంభమైన విషయం తెలుసుకున్నవారు వివిధ మార్గాల్లో జిల్లా వదిలి వెళ్లిపోయారు. ఓట్ల లెక్కింపు వరకు తప్పించుకుంటే ఆ తర్వాత పరిస్థితులను అనుసరించి లొంగిపోవాలనే యోచనలో ఎక్కువమంది ఉన్నారు. కేసులు నమోదు చేసిన పోలీసులు గ్రామాలను జల్లెడ పడుతూ బాధ్యులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. దీంతో పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. ఘర్షణల సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా గ్రామస్థులు కొందరు వీడియోల్లో రికార్డు కావడంతో వారు కూడా తమను బాధ్యులను చేస్తారని భయపడుతున్నారు. ఏదీఏమైనా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసి ఆరు రోజులు అవుతున్నా పల్నాడులో ఇంకా పాత పరిస్థితులు నెలకొనలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని