logo

మీరు తెదేపాలోకి వెళితే నేను పోటీ చేయను!

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో గురువారం విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. మార్టూరుకు చెందిన పలువురు కీలక వైకాపా నాయకులు తెదేపాలో చేరుతున్నారనే విషయం తెలుసుకుని పర్చూరు వైకాపా అభ్యర్థి యడం బాలాజీ ఆగమేఘాలమీద గురువారం మార్టూరులోని పాండురంగస్వామి గుడి వద్దకు చేరుకున్నారు.

Updated : 07 Apr 2024 07:23 IST

వైకాపా నాయకులతో పర్చూరు అభ్యర్థి యడం బాలాజీ
ససేమిరా అంటూ పార్టీని వీడారు

నేతలను పార్టీ వీడొద్దని కోరుతున్న అభ్యర్థి బాలాజీ

ఈనాడు-బాపట్ల,  న్యూస్‌టుడే, మార్టూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో గురువారం విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. మార్టూరుకు చెందిన పలువురు కీలక వైకాపా నాయకులు తెదేపాలో చేరుతున్నారనే విషయం తెలుసుకుని పర్చూరు వైకాపా అభ్యర్థి యడం బాలాజీ ఆగమేఘాలమీద గురువారం మార్టూరులోని పాండురంగస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బాలాజీ సామాజికవర్గానికి చెందిన వారున్నారు. నాకు పార్టీ టిక్కెట్‌ ఇస్తే సొంత సామాజిక వర్గీయులైన మీరే కూటమిలో చేరితే నా పరిస్థితి ఏమిటి? మీరు ఎట్టి పరిస్థితుల్లో తెదేపాలో చేరొద్దని నాయకులను వారించారు. అయితే వారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపాలో ఉండలేం.  పార్టీలో తమకు గౌరవం లేదు. తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ కూటమిలో ఉన్నారు. తెదేపాలో ఇప్పటికే తమ సామాజిక వర్గీయులకు ఎమ్మెల్యే సాంబశివరావు పార్టీ పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఆ పరిస్థితి వైకాపాలో లేదు. ఇక పార్టీలో ఉండలేం. వీడతామని ఖరాకండిగా చెప్పినా వినిపించుకోకుండా చేరే వారిని బయటకు వెళ్లనీయకుండా బాలాజీ తన వర్గీయులతో గుడి వద్దే నాలుగు గంటలపాటు ఉన్నారు. చివరకు వారు తాము పార్టీని వీడేదేనంటూ సుమారు వంద మంది ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కార్యాలయానికి బయలుదేరటంతో చేసేది లేక అప్పుడు బాలాజీ అక్కడి నుంచి వెనుదిరిగారు. మార్టూరు బలరాం కాలనీ ప్రాంతంలో కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్నారు. ఆపై వీరు పార్టీలో చాలా కీలకమైన నాయకులు కావటం ఎన్నికల వేళ వైకాపాను వీడి తెదేపాలో చేరితే ఇక నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగైతే తాను  పోటీ చేయలేనని బాలాజీ అన్నట్లు తెలిసింది. మీరు కూడా తమతో వస్తే పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో కూటమిలో చేరదామని అన్నట్లు  వినికిడి. తెదేపాలో చేరిన వారిలో సకల ఆంజనేయులు, ముప్పవరపు హనుమంతరావు, పెôట్యాల బుల్లయ్య, పవన్‌ తదితరులు ఉన్నారు. మూడురోజుల క్రితం ఇదే మండలం వలపర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా ఆ ఊళ్లో పార్టీకి చెందిన ఓ వర్గం నేతలు అందులో పాల్గొనలేదు. తమకు సమాచారమివ్వలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారి వద్దకు వెళ్లి మీరు తన వెంట రాకపోతే తాను పోటీ చేయబోనని బాలాజీ అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తంగా పర్చూరు నియోజకవర్గం నుంచి నానాటికీ తెదేపాలో చేరికలు ఎక్కువగా ఉండటంతో వైకాపా అభ్యర్థి ఆందోళన చెందుతున్నారు. చేరికలను నిలువరించటానికి  నేను పోటీ చేయననని అంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని