logo

Hyderabad: ‘అదంతా నిజమని నమ్మా.. ప్రేమించి మోసపోయా’.. 14 పేజీల లేఖరాసి ఆత్మహత్య

‘ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డడు.

Updated : 30 May 2024 15:38 IST

అఖిల

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ‘ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డడు. ఇదంతా నిజమని నమ్మా. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేది’ అని ఓ యువతి 14 పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. జీడిమెట్ల ఎస్సై ముంత అంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. ఠాణా పరిధిలోని ఎన్‌ఎల్‌బీనగర్‌లో నివాసముండే బాలబోయిన అఖిల(22) ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేవారు.  షాపూర్‌నగర్‌కి చెందిన అఖిల్‌ సాయిగౌడ్‌ గత కొన్నెళ్లుగా ప్రేమ పేరుతో అఖిలను వేధించేవాడు. ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో   అతని ప్రేమను ఒప్పుకున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాఫీగా సాగింది. గత మూడు, నాలుగు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. చిన్నచిన్న విషయాలకు రోడ్డుపైనే అఖిలను కొడుతుండేవాడు.  దీనికితోడు అతను పెళ్లికి నిరాకరించడంతో తన కుమార్తె మంగళవారం 14 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


వయసు 31... చోరీలు 81
ఇద్దరు దొంగల అరెస్టు..రూ.6.70 లక్షల సొత్తు స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌: బాల్యంలోనే నేరాల బాటపట్టాడు. పలుమార్లు జైలుకెళ్లొచ్చినా.. పీడీయాక్ట్‌ విధించినా చోరీలను మాత్రం వీడలేదు. పోలీసులకు సవాల్‌ విసిరిన ఘరానాదొంగ రత్తావత్‌ శంకర్‌నాయక్‌(31), రిసీవర్‌ బి.రాకేష్‌(21)ను బుధవారం అరెస్ట్‌చేసినట్టు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ తెలిపారు. రూ.6.70లక్షల విలువైన చోరీ సొత్తు బంగారు, స్వాధీనం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగర్లబండతండాకు చెందిన శంకర్‌నాయక్‌ తెలుగు రాష్ట్రాల్లో 81 చోరీలకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి. 2012లో హత్యాయత్నం కేసులో జైలుకెళ్లిన ఇతడు విడుదలయ్యాక.. మద్యం, గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసై డబ్బు కోసం దొంగతనాలు వృత్తిగా ఎంచుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో వరుస చోరీలతో హల్‌చల్‌ చేశాడు. రాత్రిళ్లు బైక్‌పై తిరుగుతూ తాళంవేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవాడు. కొట్టేసిన సొత్తు విక్రయించేందుకు వనస్థలిపురంలో ఉంటున్న రాకేష్‌కు ఇచ్చేవాడు. ఇతడిపై 26 చోరీ కేసులున్నాయి. బండ్లు కొట్టేసి విక్రయించడం ఇతడి ప్రత్యేకత. ఇటీవల జైలునుంచి బయటకొచ్చిన ఇతడు శంకర్‌నాయక్‌తో జతకట్టాడు. కొంతకాలంగా నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వీరిద్దరిపై నిఘా ఉంచిన సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రామకృష్ణ, ఎస్సై డి.శ్రీకాంత్‌గౌడ్‌ బృందం నిందితులను అరెస్ట్‌ చేశారు.


చెరువులో జారిపడి డిగ్రీ విద్యార్థి మృతి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వద్ద చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ మైబెల్లి కథనం ప్రకారం.. మంచాల మండలం ఆగాపల్లి గ్రామానికి చెందిన పూజారి రాజు కుమారుడు భరత్‌చంద్ర (22) ఇబ్రహీంపట్నంలోని డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడడంతో ఈత రాకపోవడంతో మునిగిపోయి మృతి చెందాడు. పోలీసులు, అగ్నిమాపక, మున్సిపాలిటీ సిబ్బంది చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


కిటికీలోంచి పడి బాలుడి దుర్మరణం 

ఐఎస్‌ సదన్, న్యూస్‌టుడే: అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులోంచి పడి బాలుడు దుర్మరణం చెందిన ఘటన పాతబస్తీ ఐఎస్‌ సదన్‌ ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. ఎస్సై బ్రహ్మచారి తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కాలనీలోని అర్ఫాద్‌ ఎస్టేట్‌ అపార్ట్‌మెంట్‌లో సయ్యద్‌ షోహెబ్‌ హుస్సేన్‌ నివసిస్తున్నారు. ఆయన కుమారుడు సయ్యద్‌ అహ్మద్‌ హుస్సేన్‌(8) మదర్సాలో చదువుకుంటున్నాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని తన ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఇంటి కిటికీకి గ్రిల్‌ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. అపార్ట్‌మెంట్‌ ప్రధాన గేటు ఇనుప చువ్వపై పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


నెల శిశువు అపహరణ

శంషాబాద్, న్యూస్‌టుడే: అమ్మ పొత్తిళ్లలో ఆదమరిచి నిద్రిస్తున్న నెల వయసు శిశువు  ఆపహరణకు గురైన సంఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో బుధవారం జరిగింది. ఆర్జీఐఏ పోలీసుల కథనం కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌కు చెందిన పి.చిన్నా దినసరి కార్మికుడు. శంషాబాద్‌ పై వంతెన కింద నివాసం ఉంటూ దంపతులు ప్లాస్టిక్, కాగితాలను ఏరుకుంటూ జీవిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ రాత్రి భార్య, ఐదేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు నిద్రకు ఉపక్రమించారు. వేకువజామున చూసేసరికి భార్య ఒడిలో నిద్రించిన కుమార్తె (నెల వయసు) కనిపించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఎంత పని చేసింది.. డబ్బు ఆశ
తొలిసారి చోరీ చేసి దొరికిపోయిన యువకులు

ఘట్‌కేసర్, న్యూస్‌టుడే: ఇద్దరు యువకులు తమ సమస్యలను తొలగించుకోవడానికి చోరీ మార్గమనుకున్నారు..ఒకరు కుటుంబ వివాదం పరిష్కరించుకోవడానికి... ఇంజినీరింగ్‌ చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మరో యువకుడు దొంగతనాలు చేయాలనుకున్నారు.. తెగించారు..చోరీ చేశారు.. పోలీసులకు చిక్కారు. పోచారం ఐటీ కారిడార్‌ సీఐ బి.రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామానికి చెందిన చెనుమల్ల ప్రశాంత్‌(32)అదే ఊరికి చెందిన దండిగన్‌ సాయి కమల్‌(32) ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు ప్రశాంత్‌ హైదరాబాద్‌లోని నాగోల్‌కు వచ్చి వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సాయి కమల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు. ఉద్యోగం కోసం పీర్జాదిగూడకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రశాంత్‌కు భార్యతో గొడవలు ఉండటంతో పరిష్కారానికి డబ్బులు అవసరం వచ్చాయి. ఇదే విషయం స్నేహితుడు సాయికమల్‌తో చెప్పాడు. అతనికి కూడా డబ్బులు కావాల్సి రావడంతో గొలుసు చోరీలు చేయాలని అనుకున్నారు. ఈనెల 23న సాయంత్రం వరంగల్‌ జాతీయ రహదారి  అన్నోజిగూడ వంతెనపై ద్విచక్ర వాహనంపై తల్లి కుమార్తె సునీత, శ్రీజ వెళ్తున్న సమయంలో ఇద్దరు వెనుక నుంచి బైక్‌పై వచ్చి శ్రీజ మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఈ సంఘటనలో బైక్‌ అదుపు తప్పి కిందపడి పోవడంతో సునీతకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి.. ఆధారాలకు సుమారు 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈనెల 24న బోడుప్పల్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఉన్న సీసీ కెమెరాలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తున్న దృశ్యం నమోదు కావడంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీ చేయడానికి కారణాలు పోలీసులకు వివరించారు. చోరీ చేసిన 10గ్రాముల బంగారం, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ పేర్కొన్నారు.


రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల మృతి

దామెర, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ శివారులో బుధవారం చోటుచేసుకుంది. దామెర ఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ కాపుగడ్డకు చెందిన జన్‌రాస్‌పల్లి లక్ష్మీ(68) తమ అక్కలు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొండాపూర్‌కు చెందిన గూళ్ల చెన్నమ్మ(78), నవాబ్‌పేట మండలం కరూరి గ్రామానికి చెందిన ఊరడి అనంతమ్మ, తన కుమార్తె కల్లూరి రాణితో కలిసి మేడారం సమ్మక్క, సారలమ్మల దైవదర్శనానికి శంషాబాద్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన సాదుల ప్రభు ఆటోలో మంగళవారం రాత్రి శంషాబాద్‌ నుంచి బయలుదేరారు. తిరిగి వస్తుండగా బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఊరుగొండ శివారులో ఆటో బోల్తా పడింది. జన్‌రాస్‌పల్లి లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన గూళ్ల చెన్నమ్మను, ఊరడి అనంతమ్మ, కుమారై కల్లూరి రాణి, ఆటోడ్రైవర్‌ ప్రభులను  వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గూళ్ల చెన్నమ్మ మృతి చెందారు. 


బాలికతో అసభ్యంగా ప్రవర్తన.. హోంగార్డు అరెస్ట్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: రైలులో ప్రయాణిస్తున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం, నగరానికి చెందిన భార్యాభర్తలు తమ కుమార్తె(15)తో కలిసి మంగళవారం తిరుపతి నుంచి కాచిగూడకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఎస్‌-3 బోగీలోని ఓ అప్పర్‌బెర్త్‌లో బాలిక.. ఆమె తల్లి లోయర్‌ బెర్త్‌లో నిద్రించారు. గద్వాల్‌ స్టేషన్‌ వద్ద ఒక వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన బాలిక కిందకు దిగి విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె సదరు వ్యక్తిని నిలదీయడంతోపాటు రైల్వే హెల్ప్‌లైన్‌ నంబరు 139కు ఫిర్యాదు చేశారు. అనంతరం అదే రైలులోని పెట్రోలింగ్‌ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం కాచిగూడ రైల్వే పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు ఏపీలోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే హోంగార్డు టి.ప్రతాప్‌(43)గా గుర్తించారు. టికెట్‌ లేకుండానే అతడు రైలులో ప్రయాణిస్తున్నట్లు వెల్లడైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ప్రతాప్‌పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.


షేర్లు అమ్మించి రూ.1.23 కోట్ల కాజేత

ఈనాడు, హైదరాబాద్‌: డ్రగ్‌ పార్సిల్‌ వచ్చిందని కస్టమ్స్‌ అధికారుల్లా మాట్లాడుతూ ఓ వ్యాపారిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు రూ.1.23కోట్లు కాజేశారు. అతని పేరిట ఉన్న షేర్లు అమ్మించి.. ఇతరుల దగ్గర అప్పు చేయించి మరీ డబ్బు వసూలు చేశారు. మోసపోయానని తెలుసుకున్న వ్యాపారి సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌కు చెందిన వ్యాపారికి ఈనెల 9న వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. ముంబయి కస్టమ్స్‌ విభాగం నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుతో వచ్చిన ఫెడెక్స్‌ పార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని తెలిపారు. బాధితుడిని నమ్మించేందుకు పోలీసు దుస్తుల్లో ఉన్న నకిలీ గుర్తింపు కార్డులు పంపాడు.  అలా అతడి వద్ద డబ్బు వసూలు చేశారు. వ్యాపారి తన పేరిట ఉన్న షేర్లు కూడా అమ్మి రూ.లక్షలు పంపాడు.  ఇలా మే 9 నుంచి 27 వరకు రూ.1.23 కోట్లు బదిలీ చేశాడు.   


పనిచేసే బ్యాంకుకే అధికారి బురిడీ

ఈనాడు, హైదరాబాద్‌: అతడో ప్రముఖ బ్యాంకు ఉన్నతాధికారి.  అడ్డదారిలో ఖాతాదారుల పేర్లతో రుణాలు తీసుకొని బ్యాంకులకే బురిడీ కొట్టించాడు. నేరస్థుడు ఎస్‌కే సైదులును బుధవారం నగర సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామంతాపూర్‌లోని ఓ బ్యాంకు కార్పొరేట్‌ రుణాల విభాగానికి సైదులు ఇన్‌ఛార్జి. వ్యక్తిగత రుణాల కోసం వచ్చిన 26 మంది దరఖాస్తులను అనువుగా మలచుకున్నాడు. ఆయా ఖాతాదారుల పేరిట రామంతాపూర్, మహేంద్రహిల్స్‌లోని బ్యాంకుల నుంచి రూ.3.88 కోట్ల రుణాలు తీసుకున్నాడు. ఆ సొమ్మును భార్య సుష్మ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. పసిగట్టిన బ్యాంకు అధికారులు నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గతంలోనే అతడి భార్య సుష్మను అరెస్ట్‌ చేశారు.  సైదులును తాజాగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని