logo

Crime News: ఆవేశంతో అంతం చేసి.. తప్పించుకునేలా పథకం వేసి

చిన్న వివాదం నేపథ్యంలో భార్యను కత్తితో దారుణంగా హతమార్చాడు.

Updated : 25 May 2024 11:31 IST

భార్యను పొడిచి చంపి.. ఆత్మహత్యాయత్నం డ్రామా

భరద్వాజ్‌ మధులత దంపతులు

నిజాంపేట, న్యూస్‌టుడే: చిన్న వివాదం నేపథ్యంలో భార్యను కత్తితో దారుణంగా హతమార్చాడు. ఆపై  మృతదేహాన్ని ముక్కలుగా కోయాలకున్నాడు. కుదరక ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్లను లీక్‌ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆత్మహత్యా యత్నం డ్రామా ఆడాడు. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘటన. మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా కొనకనిమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన మధులత (29)కు అదే జిల్లాలో దర్శి పరిధి పుట్టబజారుకు చెందిన వరకాల నాగేంద్ర భరద్వాజ్‌(31)తో 2020లో వివాహం జరిగింది. వారికి కుమారుడు శ్రీజయ్‌(ఏడాదిన్నర) ఉన్నాడు. బాచుపల్లి సాయి అనురాగ్‌కాలనీలోని ఎంఎస్‌ఆర్‌ ప్లాజా (ఏబ్లాక్‌-101)లో  ఉంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వివాహం జరిగినప్పటి నుంచి భరద్వాజ్‌ భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. కుమారుడు పుట్టిన ఏడాది వరకు బాబును చూడటానికి భరద్వాజ్‌ వెళ్లలేదు. పెద్దలు  రాజీ కుదిర్చి ఫిబ్రవరి15న కాపురానికి పంపారు. ఈ నెల 4న రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. ఆవేశానికిలోనైన భరద్వాజ్‌ కత్తితో భార్యను మెడతో పాటు పలుచోట్ల పొడిచి హత్యచేశాడు.

ముక్కలు చేయాలని.. 

మృతదేహాన్ని ముక్కలు చేసి పడేయాలని అనుకున్నా ఫలించలేదు. హత్య చేసిన గదిలో ఒక సిలిండరును ఉంచి.. మరో సిలిండర్‌ను కిచెన్‌లో పెట్టాడు.గ్యాస్‌ లీకయ్యేలా చేసి.. కరెంట్‌ తీగలను ప్లగ్‌లో పెట్టి వైర్లను సిలిండర్‌ వద్ద ఉంచి గ్యాస్‌ ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. అనంతరం ఇంటికి తాళం వేసి కుమారుడితో సహా చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లాడు. విషయాన్ని అతనికి చెప్పి కత్తితో ఛాతీపై పొడుచుకున్నాడు. స్నేహితుడు డయల్‌ 100కు సమాచారం అందించాడు. పోలీసుల సహాయంతో భరద్వాజ్‌ను ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మధులత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మరుసటి రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై బాచుపల్లి సీఐ జె.ఉపేందర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. నిందితుడిపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి ఈ నెల 6న కోర్టులో హాజరుపరచినట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని