logo

సబ్బండ సంక్షేమం..అభివృద్ధి ఆవిష్కరణం

వేతనజీవులకు ఊరట కలిగిస్తూ.. ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తూ.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ.. విద్యకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ.. ఆవిష్కరణలకు అందలమేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ నగరంలోని మెజార్టీ వర్గాలను ఆకట్టుకుంది.

Updated : 02 Feb 2023 09:44 IST

కేంద్ర పద్దులో గ్రేటర్‌ వాసులకు ఊరటనిచ్చే అంశాలెన్నో..

- ఈనాడు, హైదరాబాద్‌

వేతనజీవులకు ఊరట కలిగిస్తూ.. ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తూ.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ.. విద్యకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ.. ఆవిష్కరణలకు అందలమేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ నగరంలోని మెజార్టీ వర్గాలను ఆకట్టుకుంది. ప్రత్యేకంగా నగరానికి కేటాయింపుల వివరాలు వెల్లడి కాకపోయినా వివిధ శాఖలకు సంబంధించి ప్రతిపాదించిన నిధులను అధిక మొత్తంలో రాబట్టడంలో సఫలమైతే రాజధాని నగరం అభివృద్ధి దిశగా మరిన్ని మైళ్లు ముందుకు దూసుకెళ్లొచ్చు. పద్దులో వివిధ విభాగాలకు కేటాయింపులు అవి భాగ్యనగరానికి ఏ మేరకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..


కలిసి కడితే అందరికీ ఇళ్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడిస్తే నగరంలో ఇళ్లు లేని అందరికీ కట్టి ఇవ్వవచ్చు. బడ్జెట్‌లో ప్రధానమంత్రి మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద భారీగా నిధులను రూ.79,590 కోట్లు ప్రతిపాదించారు. సిటీలో సద్వినియోగం చేసుకుంటే రూ.1,500 కోట్లు గృహ నిర్మాణానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రం వాటా కింద రూ.7వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో నగరంలో మిగిలిన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చు.

నగరంలో అల్పాదాయ వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు లక్ష వరకు నిర్మిస్తోంది. చాలా నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడంతోపాటు గ్రేటర్‌లో మరో లక్ష ఇళ్లను పేదల కోసం నిర్మించి ఇవ్వాలనేది సర్కారు ఆలోచన. కేంద్రం కూడా అందరికి ఇళ్లు పేరుతో అల్పాదాయ వర్గాల కోసం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రం కట్టిన ఒక్కో ఇంటికి గతంలో ఏడున్నర లక్షలు వ్యయం కాగా.. కేంద్రం వాటా లక్షన్నరగా ఉంది. గతంలో ఈ పథకం కింద సిటీలో లక్ష ఇళ్లకు రూ.1,596 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

మధ్యతరగతి వర్గాలకు..

ప్రభుత్వమే కాదు స్థిరాస్తి సంస్థలు పీఎంఏవై కింద నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌’ కింద చేపట్టే ఇళ్లకు పీఎంఏవై కింద నిధుల తోడ్పాటు అందిస్తోంది. 60 చదరపు మీటర్ల విస్తీర్ణం లోపల నిర్మించే అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు పీఎంఏవై వర్తిస్తుంది. వీటిని కొనుగోలు చేసినవారికి నేరుగా రూ.2.67 లక్షల సొమ్మును వారి ఖాతాలో కేంద్రం జమ చేస్తోంది. ఈ తరహా చిన్న ఇళ్లను కట్టే బిల్డర్లకు ఆదాయ పన్నులో పూర్తి మినహాయింపు ఇస్తోంది. ఇళ్లపై జీఎస్‌టీ 1 శాతమే వేస్తోంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని బాచుపల్లి, ఆదిభట్ల, సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణ ప్రాజెక్టులు వచ్చాయి.  


చిరుధాన్యాల వినియోగం పెరిగేలా..

ఐక్యరాజ్య సమితి 2023ను మిల్లెట్‌ల ఏడాదిగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమూ ప్రజలతో చిరుధాన్యాల వంటలు తినిపించే పనిలో పడింది. అందుకే బడ్జెట్‌లో ‘శ్రీఅన్న’ పథకానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ఇండియన్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సహకారంతో ఈ పథకాన్ని విస్తరించడానికి చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల నగరంలో వీటి వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. చిరుధాన్యాలతో చేసే ఆహార ఉత్పత్తులను నగరంలో అనేక సంస్థలు విక్రయిస్తున్నాయి. మిల్లెట్‌ బ్యాంక్‌ అయితే రైతులు పండించే పంటలను నేరుగా కొని.. నగరంలో వివిధ రూపాల్లో అమ్ముతున్నారు.

తేలనున్న ‘తుక్కు’ లెక్క

గ్రేటర్‌లో తుక్కు వాహనాల లెక్క తేలనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త తుక్కు పాలసీ అమల్లోకి రానుంది. గతేడాది వివిధ శాఖల వద్ద 874 గడువు తీరిన వాహనాలు గుర్తించిన ఆర్టీఏ వాటిని తుక్కు కింద మార్చింది. ఇదే తరహాలో అనేక వాహనాలు ఉన్నప్పటికీ.. ఎన్ని రోడ్లపై తిరుగుతున్నాయనే విషయంలో లెక్కలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోని వాహనాల లెక్కలను చెప్పాలని ఇటీవల ఆర్టీఏ వివిధ శాఖలకు లేఖలు పంపింది. ప్రైవేటులో 15 ఏళ్లు దాటిన వాహనాలు 10 లక్షల వరకు ఉండొచ్చని ఆర్టీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీ ప్రకారం తుక్కు కింద మార్చిన వాహనాల స్థానంలో వాహనదారులకు రాయితీలు ఇస్తారు. ఈ విధానం అమలులోకి వస్తే నగరంలో ఉన్న 2,850 బస్సులు సంఖ్య కాస్త 2 వేలకు పడిపోనుంది.


పేద ఖైదీలకు ఊరట

బడ్జెట్‌ నేపథ్యంలో నిరుపేద ఖైదీలకు ఊరట కలిగించే ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. పెనాల్టీలు కట్టలేక, బెయిల్‌ పొందడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. చర్లపల్లి, చంచల్‌గూడ కారాగారాల్లో సుమారు 1500 మంది ఖైదీలు ఉన్నారు. ఇప్పటికే నగరంలో మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (న్యాయసేవాధికార సంస్థ) నిరుపేదలకు న్యాయసహాయం చేస్తోంది. ప్రస్తుతం ఇందులో న్యాయసేవాధికార సంస్థ పరిధిలో నగరంలో 50 మందికి పైగా ప్యానెల్‌ న్యాయవాదులున్నారు. రోజుకు నిరుపేదల నుంచి 10 నుంచి 15 దరఖాస్తులు వస్తుండగా.. నిబంధనల మేరకు ఎంపిక చేస్తున్నారు.


చిరుద్యోగుల జేబులకు కత్తెర పడకుండా..

నగరంలో అత్యధికులు వేతనజీవులే. పెరిగిన ఖర్చులతో వచ్చిన ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదని మధ్యతరగతి వాసులు వాపోతున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొస్తుంటే.. వేతనాల్లోంచి ఆదాయ పన్ను కోతలతో నెలనెలా వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. ఈ క్రమంలో ఆదాయ పన్ను మినహాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.7 లక్షలకు పెంచడం నగరంలోని చిరుద్యోగులకు పెద్ద ఊరటే.


33.17 లక్షల మంది..

2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్ర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 1.03 కోట్ల మంది జనాభా ఉన్నారు. నాలుగు జిల్లాల్లో 33.17 లక్షల మంది ప్రధాన శ్రామికులుగా ఉన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల మధ్య ఆర్జించేవారే ఉంటారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని పెంచడం ద్వారా ఆర్జించిన ప్రతి పైసాని కుటుంబానికి వెచ్చించే వెసులుబాటు కలగనుండడంతో అల్పాదాయ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అధికాదాయ వర్గాల పన్నుల శ్లాబుల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంకు గతంలో ఉన్న రూ.15 లక్షల పరిమితిని రెట్టింపు చేయడంతో పింఛనర్లకు పెద్ద ఊరట లభించింది. ఒక్క జీపీవోలోనే ఈ పొదుపు ఖాతాదారులు 13 వేల మంది వరకూ ఉన్నారు. నగరవ్యాప్తంగా60 వేల మంది ఉండవచ్చనితపాలాశాఖ అధికారులు చెబుతున్నారు.

పథకం తోడుగా.. తరుణిలకు అండగా

నగరంలో అటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.. సంఘటిత, అసంఘటిత రంగాల్లోనూ మహిళలదీ కీలక పాత్ర. తాజాగా బడ్జెట్‌లో మహిళల కోసం ప్రకటించిన సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే కొత్త పథకం గ్రేటర్‌లోని ఎంతోమందికి ఉపయోగపడనుంది. రెండేళ్ల కాలానికి 7.5 శాతం స్థిరవడ్డీ రానుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇందులో పొదుపు చేసుకునే అవకాశం ఉంది.
* తెలంగాణ సమగ్రసర్వేలో భాగంగా మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను గుర్తించింది. అంతేకాక వివిధ బ్యాంకు, పోస్టు ఆఫీసులు ఖాతాలను గుర్తించింది. ఇందులో మహిళా ఉద్యోగులు, బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో మహిళల పేరుతో ఉన్న ఖాతాలు ప్రత్యేకంగా పేర్కొననప్పటికీ వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


మొత్తం ఖాతాలు...


జిల్లా బ్యాంకు తపాలా
హైదరాబాద్‌ 3,54,957 3,257
రంగారెడ్డి   10,09,235 20,614


పరిశ్రమ వర్గాల హర్షం

ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు కేంద్రం అండగా నిలవడంపై పరిశ్రమల వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ అమలుకు కార్పస్‌ఫండ్‌, తక్కువ వడ్డీకే రుణాలు వంటి పథకాల ప్రకటనతో ఎంఎస్‌ఎంఈ రంగానికి ఊతమిచ్చినట్టయ్యింది. హైదరాబాద్‌లో 65,114, రంగారెడ్డిలో 37,818, మేడ్చల్‌లో 34,035 పరిశ్రమల్లో 18 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

కోరినంత సమాచారం

చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయం, 80శాఖా గ్రంథాలయాలు, అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంతో కలిపి నగరంలో సుమారు 2లక్షల మంది పాఠక సభ్యులున్నారు. ప్రతి నెలా 3వేల మంది గ్రంథాలయాల నుంచి పుస్తకాలను ఇంటికి పట్టుకెళ్లి చదువుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం యువత, చిన్నారుల కోసం ప్రత్యేక నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో మరింత అధీకృత సమాచారం అంతర్జాలంలో లభించే అవకాశం కలిగింది.  

పర్యాటక భాగ్యం..

కేంద్రం ప్రకటించిన కొత్త పర్యాటక పాలసీతో హైదరాబాద్‌(నాంపల్లి) రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి అవకాశం ఏర్పడనుంది. దేశవ్యాప్తంగా 50 పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దాలని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.  నేరుగా ఆ కేంద్రాలను అనుసంధానం చేయడం, మంచి ఆహారం, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించి దేశీయ, విదేశీ యాత్రికులను ఆకట్టుకోవడం ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశం. ‘దేఖో అప్నా దేశ్‌’ పేరిట సామాన్య, మధ్యతరగతి వారికి కూడా దేశీయ పర్యాటక యాత్రలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది కేంద్రం. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అవకాశం దక్కితే.. పర్యాటక హబ్‌గా తీర్చిదిద్ది వివిధ రాష్ట్రాల, దేశాలకు చెందిన పర్యాటక కార్యాలయాలు ప్రారంభించే అవకాశం ఉంది.  


విద్యకు ఊతం..రియల్‌కు రిక్తహస్తం
బడ్జెట్‌పై నిపుణుల స్పందన

ఈనాడు, హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీ, : కేంద్ర బడ్జెట్‌పై నగర ప్రముఖుల నుంచి మిశ్రమ అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని రంగాలకు కేటాయింపులు పెంచిన కేంద్రం.. మరికొన్నింటిని పూర్తిగా విస్మరించడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బడ్జెట్‌కు సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తే తప్ప కచ్చితమైన అభిప్రాయానికి రాలేమని చెబుతున్నారు.  


రియల్‌ఎస్టేట్‌కు ఏం లేదు..
జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న స్థిరాస్తి రంగ ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించడంతో.. రహదారులు, మురుగు, తాగునీటి వసతుల కల్పనకు దోహదం చేస్తుంది.


విద్యపై కేటాయింపులు పెంచారు
గుస్తి నోరియా, అధ్యక్షుడు, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ సొసైటీ

విద్యపై జాతీయ స్థాయిలో 8 శాతం కేటాయింపులు పెంచడం మంచి ముందడుగుగా భావిస్తున్నాను. కృత్రిమ మేథ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయడం, మెరుగైన బోధన, నాణ్యమైన విద్యను పెంపొందించడం కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం స్వాగతించాల్సిన విషయం.


అంకురాలకు నిధులు స్వాగతించాల్సిన అంశం
జి.హరిప్రసాద్‌, పీఆర్‌ ఎగ్జిక్యూటివ్‌, మెహిదీపట్నం

రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు చిరుద్యోగులు, పింఛనర్లకు గొప్ప ఉపశమనం. వ్యవసాయ ఆధారిత అంకురాల కోసం నిధులు పెంచడం, ప్రత్యామ్నాయ ఎరువులు ప్రోత్సహించడం, ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీల పన్ను తగ్గించడం స్వాగతించాల్సిన విషయం.


వాతావరణ పరిరక్షణ, గ్రీన్‌ ఎనర్జీపై దృష్టి
ప్రొ.గడ్డం నరేష్‌రెడ్డి

భారత్‌ను 2070లోగా కాలుష్యరహిత దేశంగా మార్చేందుకు కేటాయింపులు చేశారు. గ్రీన్‌ అగ్రికల్చర్‌, గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. వ్యవసాయ, ఆహార ఉత్పత్తి పెంచేందుకు కేటాయింపులు పెంచారు. నూతన ఆవిష్కరణలకు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేలా కేటాయింపులున్నాయి.


విత్తలోటు ఆందోళనకరంగా ఉంది
చౌటి ప్రభాకర్‌, పరిశోధక విద్యార్థి, సివిల్‌ సర్వీస్‌ ఫ్యాకల్టీ

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ తయారు చేశారు. రైల్వే కేటాయింపులలో తీవ్ర నిరాశ మిగిలింది. అప్పులను నియంత్రించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో విత్తలోటు పెరుగుతుంది. భవిష్యత్‌లో అభివృద్ధిపై జరిగే వ్యయం తగ్గి వడ్డీ చెల్లింపు కోసమే నిధులు కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు