logo

జై బోలో మట్టి గణపతికీ!

వినాయక చవితి పండగ వచ్చేస్తోంది.. మరో 10 రోజుల్లో నవరాత్రుల సంరంభం ప్రారంభం కానుంది.. విగ్రహాల విక్రయాలు జరిపే ధూల్‌పేట్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, వనస్థలిపురం, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో అప్పుడే సందడి కనిపిస్తోంది.

Updated : 11 Sep 2023 06:23 IST

 చెరువుల్లో పూడిక పెరుగుతుందనడం అపోహే
 పీవోపీ విగ్రహాలతో జీవ వైవిధ్యానికి ముప్పు

వినాయక చవితి పండగ వచ్చేస్తోంది.. మరో 10 రోజుల్లో నవరాత్రుల సంరంభం ప్రారంభం కానుంది.. విగ్రహాల విక్రయాలు జరిపే ధూల్‌పేట్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, వనస్థలిపురం, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో అప్పుడే సందడి కనిపిస్తోంది. మట్టి విగ్రహం కొనుగోలు చేయాలా.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపీ) విగ్రహం కొనుగోలు చేయాలా.. అని వినాయక మండపాల నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. మట్టి విగ్రహాల్లో దృఢత్వం ఉండదని, వాటి నిమజ్జనంతో జలాశయాలు, చెరువుల్లో పూడిక పెరుగుతుందని వారు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పీవోపీతో జలాశయాల్లో జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు.

 ఈనాడు, హైదరాబాద్‌


పీవోపీతో నష్టమిదే.. : గతేడాది గ్రేటర్‌ పరిధిలో పీవోపీ విగ్రహాలతో 80వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తయ్యాయి. పీవోపీ, విగ్రహాలపై వేసిన రంగులు, రసాయనాలు నీటిలో కరగడంతో హానికర లోహాల పరిమాణం పెరుగుతోందని, ఇది జలచరాలకు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ శాతం పడిపోవడంతో జలచరాలకు ఊపిరాడటం లేదని నివేదికల ద్వారా స్పష్టమవుతోంది
శాస్త్రీయత ఉంది: చెరువుల్లో లభించే మట్టి, బంకమట్టితో చేసే విగ్రహాలను పూజించడంలో కొంత శాస్త్రీయత ఉందని పెద్దలు చెబుతున్నారు. వర్షాకాలానికి ముందు జలాశయాల్లో నీరు లేకపోవడంతో పూడిక తీసేవారు. ఆ మట్టితోనే విగ్రహాలు తయారుచేసేవారు. తర్వాత వర్షాకాలంలో జలాశయాలు నిండిన తర్వాత ఆ విగ్రహాలను అందులో నిమజ్జనం చేయడంతో ఆ మట్టి అడుగు భాగానికి వెళ్లి నీళ్లు త్వరగా ఇంకకుండా చేస్తుందని చెబుతున్నారు.  
ఉచితంగా ప్రతిమల పంపిణీ: మట్టి గణేశ్‌పై అవగాహన ప్రచారంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ).. ప్రతి పారిశ్రామికవాడలో మట్టి విగ్రహాల పంపిణీ చేపడుతోంది. పీవోపీకి బదులుగా మట్టి ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి జిల్లా పరిధిలో 1.2లక్షలకు పైగా విగ్రహాలు పంపిణీ చేయనుంది. జీహెచ్‌ఎంసీ 3.8లక్షలు, హెచ్‌ఎండీఏ వారు లక్ష విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.


బరువు తక్కువ.. దృఢత్వం ఎక్కువ

మేము 15 ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారుచేస్తున్నాం. 70మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ముందుగా చెరువు మట్టిని తీసుకొచ్చి నానబెట్టి, ఫిల్టర్‌ చేసి పొడిలా మారుస్తాము.. కుంకుమ తరహాలో వచ్చేలా జల్లెడ, యంత్రాలు వాడుతాము. దృఢత్వం కోసం జనపనార ఉపయోగిస్తాం. మరింత గట్టిదనం కోసం పేపర్‌ పౌడర్‌ కలుపుతాం. దీంతో బరువు తక్కువగా, దృఢత్వం ఎక్కువగా ఉంటుంది.

స్వామి, మట్టి విగ్రహాల తయారీదారు


చాలా మందికి ఉపాధి

మట్టి విగ్రహాలతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది... మట్టితో చేసిన విగ్రహాలను పూజించి మళ్లీ వాటిలోనే నిమజ్జనం చేయడంతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. గతంలో చెరువులు కులవృత్తులకు ఆదరువుగా ఉండేవి. సీజన్‌ను బట్టి చెరువుల నుంచి మట్టి, చేపలు ఇతరత్రా వనరులను పొందేవారు. మట్టి విగ్రహాల తయారీతో పూడిక తీసేవారికి, విగ్రహాలు తయారుచేసే వారికి, వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. పీవోపీతో జల కాలుష్యం పెరుగుతుంది.

దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని