logo

HYD News: కారుకు మహా కుదుపు.. కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి?

రాజధానిలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ శుక్రవారం స్వయంగా మేయర్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 23 Mar 2024 07:24 IST

ఆమెతోపాటు పదిమంది భారాస కార్పొరేటర్లు సైతం!
ఎన్నికల నోటిఫికేషన్‌లోపు మరికొందరు..

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ శుక్రవారం స్వయంగా మేయర్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని మేయర్‌ పదవికి భరోసా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మేయర్‌ చేరికతోపాటు మరో పది మంది కార్పొరేటర్లు కూడా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. నోటిఫికేషన్‌ నాటికి మరికొందరు కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో భారాసలో అలజడి నెలకొంది.


అవిశ్వాసం పెట్టినా.. వ్యూహరచన..

మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే భారాస పార్టీ అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉందని, దీని నుంచి బయటపడడానికి కూడా కాంగ్రెస్‌ వ్యూహరచన చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2020లో జరిగిన బల్దియా పాలకవర్గ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను భారాస 56, భాజపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మొన్నటి ఎన్నికల తరువాత పలువురు భారాస కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 10కి పెరిగింది. భారాస బలం 46కు తగ్గింది. తాజాగా మరో పది మందిని పార్టీలో చేర్చుకోనున్నారు. నోటిఫికేషన్‌ వచ్చేలోగా మరో 15 మందిని ఆకర్షించాలని సంబంధిత కార్పొరేటర్లతో మాట్లాడుతున్నారు. భాజపా నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్లను చేర్చుకోవాలని భావిస్తున్నారు.  భారాస అవిశ్వాసం పెడితే ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉంది. ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే.. మేయర్‌ విజయలక్ష్మి హస్తం పార్టీలో చేరినా.. ఆమె పదవికి ఢోకా ఉండదని పార్టీ వర్గాల అంచనా.


బల్దియాపై కాంగ్రెస్‌ దృష్టి..

గ్రేటర్‌ పరిధిలో నాలుగు జిల్లాల్లోని 29 శాసనసభా నియోజకవర్గాల్లో మూడింటిలో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలంటే నగరానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని చేర్చుకుని అదే లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయిస్తోంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను చేర్చుకుని సికింద్రాబాద్‌ నుంచి, వికారాబాద్‌ జడ్పీఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో నిలిపింది. ఈ చేరికలు సరిపోవన్న ఉద్దేశంతో బల్దియా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించింది. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌ శ్రీలతా రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మేయర్‌తోపాటు మరికొందరు కార్పొరేటర్ల చేరికకు అంతా సిద్ధమైందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని