logo

కొలతలు తీసుకోక.. దుస్తులు సరిపోక!

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఏటా ఉచితంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అయితే వీటిని కుట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొలతలు తీసుకోకుండానే సరఫరా చేస్తున్నారు. వాటిని ధరిస్తున్న విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు.

Published : 18 May 2024 02:15 IST

విద్యార్థుల ఇబ్బందులు, అధికారులు దృష్టి సారిస్తే మేలు
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఏటా ఉచితంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అయితే వీటిని కుట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొలతలు తీసుకోకుండానే సరఫరా చేస్తున్నారు. వాటిని ధరిస్తున్న విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఏడాదిపాటు మన్నాల్సిన దుస్తులు మూడు నెలలకే చిరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్య పేద, ధనిక, కుల, మత తారతమ్యాలు లేకుండా అందరు సమానమన్న భావన కల్పించే ఉద్దేశంతో ఏటా ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులను అందిస్తున్నారు. అందుకు అవసరమైన వస్త్రాన్ని టెస్కో ద్వారా జిల్లాలోని ఇరవై మండలాల ఎమ్మార్సీలకు చేరవేస్తున్నారు.

మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పినా: యూడైస్‌లో పేర్కొన్న విద్యార్థుల సంఖ్య ప్రకారం నేరుగా పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల ద్వారా తరలిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎమ్‌సీ కమిటీలు వస్త్రాన్ని స్థానిక దర్జీలకు లేదా స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించి రెండు జతల దుస్తులను కుట్టించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తరగతుల వారీగా విద్యార్థుల కొలతలు సేకరించి వాటి ప్రకారం దుస్తులు కుట్టాలని సూచించింది. ఇందుకు రూ.100 చొప్పున కూలి చెల్లించేందుకు ఖరారు చేసింది. అయితే  ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా హైదరాబాద్‌, జహీరాబాద్‌, సంగారెడ్డిలోని బడా దర్జీ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఆయా సంస్థల వారు నేరుగా బడులకు వెళ్లి వస్త్రాన్ని తీసుకెళ్లి రెండుమూడు నెలలకు దుస్తులు అప్పగిస్తున్నారు.

తల్లిదండ్రులపై అదనపు భారం: కొలతలు లేకుండా దుస్తులు కుడుతుండగా కొందరు విద్యార్థులకు సరిపోలడం లేదు. చొక్కా, నిక్కరు వదులుగా మారడం, మరికొందరికి బిగుతుగా అవ్వడంతో వాటిని ధరించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు తిరిగి సరిచేయించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. కుట్లు సరిగ్గా లేకపోవడంతో పంపిణీ చేసిన రెండుమూడు నెలలకే దుస్తులు చిరిగి పోతున్నాయి. గత్యంతరంలేక  వాటిని వాటిని ధరించే బడికి వస్తుండగా మరికొందరు ఇతర దుస్తులతో హాజరవుతున్నారు. సర్కారు వస్త్రాన్ని, కుట్టు కూలిని అందించినప్పటికి పేద విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోందని వాపోతున్నారు. నిబంధనల ప్రకారం స్థానిక దర్జీలకు అప్పగిస్తే కొలత తీసుకునే వీలుంటుంది. సరిగా కుట్టకుంటే ప్రశ్నించేందుకు వీలుంటుంది. జూన్‌ 12న బడులు తెరుచుకోనుండగా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులను పంపిణీ చేసేందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

జిల్లాలో ఇలా

ప్రాథమిక బడులు: 764
ప్రాథమికోన్నత: 116  
ఉన్నత : 174
విద్యార్థులు: 84,374

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని