logo

పల్లె పోరుకు కసరత్తు

స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 20 May 2024 04:08 IST

 

న్యూస్‌టుడే, వికారాబాద్‌: స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు గతంలోనే ఏర్పాట్లు ఆరంభించినా, లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది డిసెంబరులోనే సర్పంచి ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారులు, ప్రిసైడింగ్, పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 200 మంది ఓటర్లకు ప్రిసైడింగ్‌ అధికారితో పాటు పోలింగ్‌ అధికారి ఉంటారు. 201- 400 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401- 650 వరకు ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులు, 650 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు రావడంతో, జూన్‌ ఆఖరు నాటికి ఎన్నికలు నిర్వహించనున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

పాత విధానమేనా..?: జిల్లాలోని 20 మండలాల్లో 566 పంచాయతీలకు 2019 జనవరిలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. గత ఫిబ్రవరి 1 నుంచి పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్‌ విధానం ఉండేలా గత ఎన్నికల్లోనే నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాత విధానాన్నే కొనసాగిస్తారా? ఏవైనా మార్పులు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పాత విధానమే అమలు చేస్తే మరోమారు గతంలో ఉన్న సర్పంచులు బరిలో నిలువనున్నారు. బీసీ ఓటర్ల సంఖ్య పెరగడంతో రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 18 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీ స్థానాలున్నాయి. జులై 4న పదవీకాలం ముగియనుంది. వీటికి కూడా సర్పంచులకు మాదిరిగానే రెండు పర్యాయాలు రిజర్వేషన్‌ అమల్లో ఉంది. రెండు మాసాల వ్యవధిలో సర్పంచి, ప్రాదేశిక ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ఇప్పటికే ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. 

సిద్ధంగా ఉన్నాం..: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ చెపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్, లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల అధికారుల నియామకం తదితర ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నామన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని