logo

వరదతో కలిసి.. మురుగు తిష్ఠవేసి

నగరంలో వర్షం మొదలైందంటే చాలు.. మురుగు రోడ్లను ముంచెత్తుతోంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు  మ్యాన్‌హోళ్ల నుంచి వరద పోటెత్తుతోంది.

Published : 21 May 2024 01:40 IST

నగరంలో అస్తవ్యస్తంగా మ్యాన్‌హోళ్లు
కనిపించని జలమండలి కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో వర్షం మొదలైందంటే చాలు.. మురుగు రోడ్లను ముంచెత్తుతోంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు  మ్యాన్‌హోళ్ల నుంచి వరద పోటెత్తుతోంది. రోడ్లపై మురుగు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా మూడు లక్షలకు పైనే మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. వీటి నిర్వహణను జలమండలి పర్యవేక్షిస్తోంది. కొంతకాలంగా పర్యవేక్షణ లేకపోవడంతో వాటిలో గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. వీటిపైన మూతలు విరిగిపోయి మురుగంతా బయటకు తన్నుకొస్తోంది. వాన ఆగిన తర్వాత రోడ్లపై ఎక్కడకక్కడ మురుగు నీరు కట్టలు తెగినట్లు పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

నిర్వహణ పేరుతో చేతివాటం..

జలమండలిలో మ్యాన్‌హోళ్ల నిర్వహణకు సుమారు 3,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 170 వరకు ఎయిర్‌టెక్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా మురుగు వ్యవస్థపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మురుగు నిర్వహణ పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌టెక్‌ యంత్రాలను సక్రమంగా వాడటం లేదు. వానాకాలానికి ముందే అన్ని మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఒక్కో ఎయిర్‌టెక్‌ యంత్రం (పెద్దవి) రోజూ 500 రన్నింగ్‌ మీటర్ల మేరకు మ్యాన్‌హోళ్లలో చెత్త తీయాల్సి ఉంది. అయితే చాలా వరకు లాగ్‌బుక్కుల్లో తప్పుడు రాతలు రాసి నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణం. ఎయిర్‌టెక్‌ యంత్రాల్లో చాలా వరకు రాజకీయ నేతల బినామీలవి కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అంతిమంగా దీని ప్రభావం నగర మురుగు నిర్వహణపై పడుతోంది. ఒక్కో ఎయిర్‌టెక్‌ యంత్రానికి నెలకు అద్దె, డ్రైవర్ల జీతభత్యాలు, డీజిల్‌ ఖర్చుల కింద రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మ్యాన్‌హోళ్ల నిర్వహణపై జలమండలి దృష్టి సారించాల్సిన అవసరముంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని