logo

ద్విచక్ర వాహనం నుంచి పడి గృహిణి మృతి

స్పీడ్‌బ్రేకర్‌ వద్ద భర్త ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సెక్రటేరియట్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. బేగంపేట్‌ రసూల్‌పురాలో నివాసం ఉంటున్న ఫాతిమా (30), ఫయాజ్‌లు భార్యాభర్తలు.

Published : 22 May 2024 02:38 IST

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: స్పీడ్‌బ్రేకర్‌ వద్ద భర్త ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సెక్రటేరియట్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. బేగంపేట్‌ రసూల్‌పురాలో నివాసం ఉంటున్న ఫాతిమా (30), ఫయాజ్‌లు భార్యాభర్తలు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం మధ్యాహ్నం నక్లెస్‌రోడ్డుకు వచ్చారు. అదే రోడ్డులో వెళ్తుండగా.. స్పీడ్‌బ్రేకర్‌ వద్ద ద్విచక్రవాహనం ఒక్కసారిగా ఎగరడంతో ఆమె ఆదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో గాయపడిన ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు చెప్పారు.  మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని  కుటుంబ సభ్యులకు అప్పగించారు. 


నాలుగో అంతస్తు నుంచి కిందపడి కార్మికుడి దుర్మరణం

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: భవన నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు నాలుగో అంతస్తునుంచి కింద పడి దుర్మరణం పాలైన సంఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బిర్‌భూమి జిల్లా బెలేవరి గ్రామానికి చెందిన అరుణ్‌లెట్‌(22) అమీన్‌పూర్‌ పురపాలక పరిధి పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీలో తేజ్‌రామ్‌ అనే బిల్డర్‌ వద్ద కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం బహుళ అంతస్తుల భవన నిర్మాణంలో భాగంగా నాలుగో అంతస్తుకు ఇటుకలు మోస్తుండగా కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బిల్డర్‌ తేజ్‌రామ్‌ భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ బంధువు రంజన్‌ మహల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


టిప్పర్‌ ఢీకొని ఒకరికి గాయాలు  

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: టిప్పర్‌ ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం సర్వీస్‌ రహదారి పోచారం కూడలి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న కొండాపూర్‌ మండలం ఉత్తరపల్లికి చెందిన మహేందర్‌ను సోమవారం రాత్రి టిప్పర్‌ బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది శ్రీశాంత్‌ తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


ఆభరణాలు ఎత్తుకెళ్లారని భార్య, అత్తమామలపై ఫిర్యాదు

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: తన భార్య, అత్తమామలు కలిసి కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని భర్త జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణ పటేల్‌ గుజరాత్‌కు చెందిన వైష్ణవిని 2020లో వివాహం చేసుకొని కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 70లో నివసిస్తున్నాడు. పెళ్లైన కొద్ది వారాలకే భార్య ఖరీదైన బట్టలు, ఆభరణాలు, కారు కావాలంటూ గొడవ చేసింది. ఈ క్రమంలో విభేధాలు రావడంతో  రామకృష్ణ వేరే ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నాడు. భార్యభర్తల పేరుతో జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో లాకర్‌ ఉండగా అందులో ఆభరణాలను పెట్టారు. 2022లో భార్య లాకర్‌లో పెట్టిన దాదాపు రూ.కోటిన్నర విలువైన ఆభరణాలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. రామకృష్ణ కోర్టును ఆశ్రయించడంతో 17వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. 


ప్రయాణికులతో దురుసు ప్రవర్తన.. ట్రావెల్స్‌ యజమానిపై కేసు 

రామచంద్రాపురంరూరల్, న్యూస్‌టుడే: ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్లు, ట్రావెల్స్‌ యజమానిపై కేసు నమోదైంది. రామచంద్రాపురం ఎస్‌ఐ శశికాంత్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. నగరానికి చెందిన హేమంత్, అతడి స్నేహితుడు ప్రవీణ్‌లు గోవా వెళ్లేందుకు సోమవారం ఓ యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. మియాపూర్‌లో రాత్రి 10గంటలకు, బుక్‌ చేసుకున్న బస్సుకు బదులుగా శ్రీట్రావెల్స్‌కు చెందిన మరో బస్సులో తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులతో ఎక్కారు. తరువాత దుర్వాసన వస్తోందని డ్రైవర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో డ్రైవర్‌ మధు, సహాయ డ్రైవర్‌ రాములు ప్రయాణికులతో దురుసుగా మాట్లాడారు. ఈ విషయం బస్‌ యజమాని సునీల్‌కు ఫోన్‌లో చెప్పినా పట్టించుకోలేదు. బాధితులు అశోక్‌నగర్‌ వద్ద బస్సు ఆపి 100 నంబరుకు ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురం పోలీసులు వచ్చేలోపే ఇద్దరు డ్రైవర్లు బస్‌ వదిలి పరారయ్యారు. ఈ మేరకు ఇద్దరు డ్రైవర్లు, బస్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని