logo

గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త

కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. భార్య గొంతుపై కాలుతో తొక్కి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బ్యాంకుకాలనీలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం..

Published : 22 May 2024 03:15 IST

కమల, రమేష్‌ 

ఉప్పల్, న్యూస్‌టుడే: కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. భార్య గొంతుపై కాలుతో తొక్కి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బ్యాంకుకాలనీలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం.. జనగామ జిల్లాలోని లింగంపల్లికి చెందిన భూక్య రమేష్‌కు 2016లో సిద్దిపేటకు చెందిన కమల(29)తో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు రిషిక(7), రోహిత్‌(4) ఉన్నారు. కొన్నేళ్లుగా వారు ఉప్పల్‌లోని బ్యాంకు కాలనీలో నివాసం ఉంటూ హెర్బల్‌ లైఫ్‌ న్యూట్రిషన్‌లో పని చేస్తున్నారు.

భర్తపై అనుమానంతో గొడవలు

రమేష్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు వేసవి సెలవులకు జనగామలోని వారి నాన్నమ్మ ఇంటికి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం కమల, రమేష్‌ల నడుమ గొడవ జరిగింది. ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. మరోసారి వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా కమలపై రమేష్‌ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దాంతో అతడు ఆమె గొంతుపై కాలును బలంగా తొక్కిపెట్టి ప్రాణం పోయేంత వరకు అలాగే ఉంచాడు. కమల చనిపోయాక అర్ధరాత్రి ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలి బంధువుల ఆందోళన..

కమల హత్యలో రమేష్‌తో పాటు అతడి తల్లిదండ్రులు, వదిన ప్రమేయం కూడా ఉందని మృతురాలి బంధువులు ఆరోపించారు. వారందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఉదయం ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. అందరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని