logo

అయిదేళ్లుగా ఆగుతూ.. సాగుతూ..

వర్షాకాలంలో ప్రజలను ముంపు బాధ నుంచి తప్పించి ప్రయాణం సాఫీగా సాగేందుకు సర్కారు వంతెన మంజూరు చేసింది.

Published : 25 May 2024 02:53 IST

ప్రజలకు తప్పని తిప్పలు

బిజ్వార్‌ వద్ద నదిని దాటాల్సిందే..

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: వర్షాకాలంలో ప్రజలను ముంపు బాధ నుంచి తప్పించి ప్రయాణం సాఫీగా సాగేందుకు సర్కారు వంతెన మంజూరు చేసింది. దానికి అనుసంధానంగా రహదారి నిర్మించాలని సంకల్పించింది. ఇందుకోసం నిధులు విడుదల చేసింది. అయిదేళ్లు గడిచినా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏడాదిగా ఎక్కడికక్కడే అన్నట్లుగా ఉండడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు.

అసంపూర్తిగా వదిలేసి: తాండూరు మండలం గోనూరు వద్ద కాగ్నా నది వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు నది దాటుకుని రాకపోకలు సాగించేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. వరద ప్రవాహం అధికంగా ఉంటే ప్రయాణం మానుకోవాలి, లేదంటే యాలాల మండలం అగ్గనూరు, లక్ష్మీనారాయణ్‌పూర్‌ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. అత్యవసర సమయంలో వైద్యం పొందేందుకు వీళ్లేక అవస్థలు ఎదుర్కొవాల్సిన దుస్థితి. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వంతెన, రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.62 కోట్లు మంజూరు చేసింది. వాటితో పనులు చేపట్టిన గుత్తేదారు కాగ్నా నదిలో వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెనకు అనుసంధానంగా రెండు వైపులా కి.మీ.పొడవునా సిమెంటు రహదారి నిర్మించాల్సి ఉండగా పనులు మధ్యలో వదిలేశారు. ఏడాదిన్నరగా పనులు చేపట్టడం లేదు. వర్షాకాలంలో వరద ప్రవాహం కొనసాగడంతో గత్యంతరంలేక గ్రామస్థులు వంతెనకు రెండువైపులా నాపరాయి వ్యర్థాలు, ఇసుక, ఎర్రమట్టి మొరం కుమ్మరించి తాత్కాలిక రహదారిగా చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలకు వరద పెరిగితే నాపరాయి వ్యర్థాల దారి తుడిచిపెట్టుకుపోయే ఆస్కారముంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామస్థులకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అసంపూర్తి పనులు పూర్తి చేయించాల్సి ఉంది. వంతెనకు ఇరువైపులా సిమెంటు రోడ్డు నిర్మించి అందుబాటులోకి తేవాలని గోనూరు, వీర్‌శెట్టిపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.

పనులు పూర్తి కాకపోవడంతో ఇలా..

రూ.3.50 కోట్లు మంజూరు చేసినా.. : బిజ్వార్‌ అనుబంధ గ్రామమైన బొంకూరుకు వెళ్లాలంటే నది దాటాల్సిందే. నదిలోంచి ప్రయాణం సాగిస్తేనే బొంకూరు చేరే వీలుంది. వర్షాకాలంలో వరద ప్రవాహం పెరిగితే గ్రామస్థులు ఇళ్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సెలవు పెట్టాల్సిందే. నది దాటలేక సకాలంలో వైద్యం అందక ఏడాది కిందట ఆరో తరగతి విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండేందుకు కాగ్నా నదిలో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది రూ.3.50కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు పనులు మొదలు కాలేదు. టెండరు ప్రక్రియ పూర్తి చేసి వంతెన నిర్మిస్తే బొంకూరు గ్రామస్థులు వానా కాలంలోనూ ప్రయాణం సాగించే వీలుంటుంది. అధికారులు దృష్టిసారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని