logo

ఒక మైదానం.. 10 క్రికెట్‌ జట్లు

నగరమంతా ఐపీఎల్‌ క్రికెట్‌ ఫీవర్‌ నెలకొంది. ఇక చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. అందుకే ఎక్కడ చూసినా చిన్నారులు క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తున్నారు. ఒకరు ఫోరు కొడితే.. ఇంకొకరు సిక్సు బాదేస్తున్నారు.

Published : 27 May 2024 04:01 IST

ప్రమాదకరంగా  చిన్నారుల క్రీడలు 
ఈనాడు, హైదరాబాద్‌

  • ఒకే క్రీడా మైదానం.. అందులో 10 జట్లు వేర్వేరుగా క్రికెట్‌ ఆడుతుంటాయి. 
  • ఒక జట్టేమో క్వార్క్‌ బాల్‌తో ఆడుతుంది.
  • మరో జట్టు గట్టిగా ఉన్న రబ్బరు బాలుతో ఆడుతుంటుంది.
  • ఇలా ఎవరి బంతి ఎవరికి తగులుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి.
  • సేఫ్టీగార్డ్స్, హెల్మెట్లు ధరించినా ఒక్కోసారి ఊహించని ప్రమాదం.
  • 2001 నుంచి 2016 మధ్య కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని జరుగుతున్న క్రికెట్‌ పోటీలో 83 మంది చనిపోగా..వీధులు, బీచ్‌లు, పాఠశాలల్లో క్రికెట్‌ ఆడుతూ 91 మంది చనిపోయారని ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్‌ జర్నల్‌ వివరించంది. 

నగరమంతా ఐపీఎల్‌ క్రికెట్‌ ఫీవర్‌ నెలకొంది. ఇక చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. అందుకే ఎక్కడ చూసినా చిన్నారులు క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తున్నారు. ఒకరు ఫోరు కొడితే.. ఇంకొకరు సిక్సు బాదేస్తున్నారు. ఔటైనా అంతే కేరింతలు.. ఆ చిన్న క్రీడా మైదానం సందడితో ఊగిపోతుంది. క్రీడా మైదానంలో పిల్లలు ఆడుతుంటే ఆ కేరింతలు చూసి తరించాల్సిందే. కానీ అలా అయిదు నిమిషాలు వారి ఆటను చూస్తే.. ఎంత ప్రమాదకరమో ఇట్టే అర్థమైపోతుంది. ఎవరి క్రికెట్‌ బాల్‌ ఎవరికి తగులుతుందో తెలియని గందరగోళం. సేఫ్టీ గార్డులుండవు.. హెల్మెట్లు పెట్టుకోరు..  వారికి ఉన్న ఒకే ఒక్క కసి.. బౌలింగ్‌ చేసినప్పుడు బాల్‌ను గట్టిగా విసరడం.. బ్యాటర్‌ దానిని బలంగా బాదడం.. ఏ ఒక్కరూ తగ్గేదే లే అనేట్లు ఆడేస్తున్నారు. క్రికెట్‌ మైదానంలో ఇద్దరు బ్యాటర్లు, ఒక బౌలర్, ఒక కీపర్, 8 మంది ఫీల్డర్లు ఉంటే కొంతవరకు ఫర్వాలేదు. కానీ 1000 నుంచి 1500 మీటర్ల వైశాల్యంలో ఉన్న క్రీడా మైదానంలో ఏకంగా 10 జట్లు ఎవరికి వారు ఆడితే ఎంత ప్రమాదమో ఊహించవచ్చు.  

నగరంలో క్రీడా మైదానాల కొరత..

625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న జీహెచ్‌ఎంసీలో 521 క్రిడా మైదానాలు ఉన్నాయి. ఎల్‌బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం.. ఇలా వీటిని పరిగణనలోకి తీసుకోకుండా మిగిలినవి 521 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయో..ఎన్ని కుంచించుకుపోయాయో తెలియని పరిస్థితి. మణికొండలోని మర్రిచెట్టు వద్ద ఉన్న క్రీడామైదానం, పరేడ్‌ మైదానంలో ఆదివారం వస్తే క్రికెట్‌ క్రీడాకారులతో కిటకిటలాడతాయి. వేసవి సెలవులు చివరికి రావడంతో పాటు కాస్త వాతావరణం చల్లగా మారడంతో చిన్నారులు క్రికెట్‌ ఆడుతూ గడుపుతున్నారు. ప్రతి కాలనీకి కాకపోయినా.. 5 కిలోమీటర్లకు ఒక క్రీడామైదానం ఉంటే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పుడు 15 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉండడం, అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నగరంలో చిన్నారుల క్రీడలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. 

నైపుణ్యం మెరుగయ్యేదెలా..?

కోటి దాటిన నగర జనాభాలో జాతీయ జట్టులో తగిన ప్రాధాన్యం ఉండడం లేదు. వీధుల్లో,  దగ్గర్లోని ఖాళీ ప్రదేశాల్లో క్రికెట్‌ ఆడుతూ చిన్నారులు క్రీడానైపుణ్యం ప్రదర్శించలేకపోతున్నారు. పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీకి నగరపౌరులకు అన్ని సౌకర్యాలూ కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరీ ముఖ్యంగా చిన్నారుల క్రీడా జీవితాన్ని జీహెచ్‌ఎంసీ దెబ్బతిస్తోంది. వేసవి శిబిరాల పేరిట తూతూ మంత్రంగా క్రీడలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటోంది. పిల్లల ఆటలకు అనువైన వాతావరణం నగర వ్యాప్తంగా కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని