logo

Hyderabad: హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏం జరుగుతోంది!

ఎన్నో సంచలన కేసులను ఛేదించిన నగర సీసీఎస్‌ వివాదాల కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

Updated : 27 May 2024 07:01 IST

సాహితీ బాధితుల ఆందోళనతో ఉన్నతాధికారులు అప్రమత్తం
ఆరోపణలకు గురైన పోలీసు సిబ్బందిపై  అంతర్గత విచారణ
ఈనాడు, హైదరాబాద్‌ 

న్నో సంచలన కేసులను ఛేదించిన నగర సీసీఎస్‌ వివాదాల కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిష్ఠ దెబ్బతినకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీసీఎస్‌ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రీ లాంచింగ్‌ ముసుగులో పలు రియల్‌ సంస్థలు పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాయి. వాటిలో సాహితీ ఇన్‌ఫ్రా సాగించిన మోసాల చిట్టాలో వేలాది మంది బాధితులున్నారు. నాలుగేళ్ల కిందట మొదలైన సాహితీ మోసాలపై 2022లో నగర సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవధిలో నగరంలో ముగ్గురు పోలీసు కమిషనర్లు మారారు. సీసీఎస్‌లో ముగ్గురు డీసీపీలు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ప్రతి సీపీ, డీసీపీ సాహితీ కేసు పురోగతిని సమీక్షించారు. వీలైనంత త్వరితగతిన బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. అంత కీలకమైన కేసులో ఏసీపీ వెనుక ఉన్న పోలీసు అధికారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో పురోగతి లేదని గుర్తించిన ఒకరు దర్యాప్తు అధికారి.. ఉమామహేశ్వరరావును మార్చాలని సిఫార్సు చేశారు. సాహితీ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలంటూ వచ్చిన ప్రతిపాదనను సీసీఎస్‌ సమీక్ష సమావేశంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా తీసుకున్న నిర్ణయంలా పైకి కనిపించినా, దీని వెనుక దాగిన అంతరార్థం గుర్తించి.. ఆ ప్రతిపాదన అమలు చేయకుండా ఆదేశాలు జారీచేశారు. ఇదే తరహాలో ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఆర్ధిక నేరస్తులను కాపాడేందుకు చేసిన చీకటి వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. మోసగాళ్ల బారినపడి రూ.కోట్లు నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరుగా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు సమయంలో తమను వేధింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సమాచారం. అక్కడినుంచి వచ్చిన నివేదిక ఆధారంగా సీసీఎస్‌లో ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకూ బదిలీలు తప్పవని తెలుస్తోంది. 


గ్రేటర్‌ మెట్రోజోన్‌ లైన్స్‌ డివిజన్ల పునర్విభజన కమిటీ నియామకం

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: గ్రేటర్‌ మెట్రోజోన్‌ పరిధిలోని లైన్స్‌ విభాగం నిర్వహణతో పాటు సమస్యలను వేగవంతంగా గుర్తించి పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు కన్‌స్ట్రక్షన్‌ కమిటీని నియమిస్తూ టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ యుషారఫ్‌ ఫరూకి శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మెట్రోజోన్‌ సీజీఎం కె.నర్సింహ స్వామి, రంగారెడ్డి జోన్‌ సీజీఎం పి.ఆనంద్, మేడ్చల్‌ జోన్‌ సీజీఎం సాయిబాబా, స్కాడా ఎస్‌ఈ, సైబర్‌ సిటీ ఎస్‌ఈ వెంకన్న ఉన్నారు. వీరు జూన్‌ 3వ తేదీ నాటికి అధ్యయనం పూర్తిచేసి నివేదికను దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ సీజీఎండీకి అందజేయాల్సి ఉంది. సబ్‌ ఇంజినీర్లు, సెక్షన్‌ అధికారుల విధులు, బాధ్యతల్లో మార్పులు తేచ్చే అవకాశాలపై ఆపరేషన్‌ , మెయింటేనెన్స్‌ (ఓఅండ్‌ఎం) కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ కమిటీని నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా కమర్షియల్, ఓఅండ్‌ఎం, పర్చేజెస్‌ అండ్‌ మెటల్‌ మేనేజ్‌మెంట్‌ (పీఅండ్‌ఎంఎం), ఫైనాన్స్‌ డైరెక్టర్లు, బంజారాహిల్స్, సైబర్‌సిటీ ఎస్‌ఈలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్‌ ఇంజినీర్లు సాంకేతిక పరమైన సమస్యల పరిష్కారంలో మార్పులు తీసుకురానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని