logo

మాకు మీరు.. మీకు మేము

ఆ భార్యల ఔదార్యం.. తమ భర్తలకు కొత్త జీవితానిచ్చింది. రెండు కుటుంబాలను నిలబెట్టింది. అరుదైన ఈ స్వాప్‌(పెయిర్డ్‌) కిడ్నీ మార్పిడి బంజారాహిల్స్‌ స్టార్‌ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తిచేశారు.

Published : 23 Feb 2024 02:51 IST

భర్తలను బతికించిన భార్యల ఔదార్యం
పరస్పర అంగీకారంతో మూత్రపిండాల మార్పిడి

ఈనాడు, హైదరాబాద్‌: ఆ భార్యల ఔదార్యం.. తమ భర్తలకు కొత్త జీవితానిచ్చింది. రెండు కుటుంబాలను నిలబెట్టింది. అరుదైన ఈ స్వాప్‌(పెయిర్డ్‌) కిడ్నీ మార్పిడి బంజారాహిల్స్‌ స్టార్‌ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, మీనా, సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రఘనాథ్‌రెడ్డి, రమణమ్మ దంపతులదీ గాథ. గురువారం ఆసుపత్రిలో సీనియర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజీ, ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్లు డా.గంధే శ్రీధర్‌, డా.జోత్స్న గుత్తికొండ వివరాలను వెల్లడించారు. మహేశ్వర్‌రెడ్డి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, రఘనాథ్‌రెడ్డి పెట్రోల్‌ బంకులో విధులు నిర్వహిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహంతో ఇరువురికి గతంలో మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. నాలుగైదేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. కిడ్నీల దాతల కోసం జీవన్‌దాన్‌లో నమోదుచేసుకొని స్టార్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మహేశ్వర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి భార్యలు మీనా, రమణమ్మ కిడ్నీలను దానం చేసేందుకు సిద్ధంగాఉన్నా వారి బ్లడ్‌గ్రూపులు సహకరించలేదు. మహేశ్వర్‌రెడ్డి బ్లడ్‌గ్రూపు ఎ+ కాగా అతని భార్య మీనాది బి+. రఘనాథ్‌రెడ్డి బ్లడ్‌గ్రూపు బి+ కాగా అతని భార్య రమణమ్మది ఎ+. దీంతో సంక్షిష్టత ఏర్పడింది. వైద్యులు ఇరువురి కుటుంబాలకు పరిస్థితి వివరించి ఒకరి భార్య కిడ్నీని మరొకరి భర్తకు ఇవ్వొచ్చని సూచించారు. రెండు కుటుంబాలు అంగీకరిస్తే స్వాప్‌కిడ్నీ మార్పిడితో ఇద్దరి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. వారు అంగీకరించడంతో డిసెంబరు 18న విజయవంతంగా ఒకేసారి కిడ్నీల మార్పిడి చేశారు. ప్రస్తుతం ఇరువురు పూర్తిగా కోలుకొని వారి వృత్తులను చేసుకుంటున్నారు. స్టార్‌ ఆసుపత్రి ఎండీ డా.మన్నం గోపిచంద్‌ మాట్లాడుతూ.. తమ ఆసుపత్రి రూపొందించిన కిడ్నీ పెయిడ్‌ డొనేషన్‌ సంబంధిత వెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మూత్రపిండాల వ్యాధి బాధితులు ఉచితంగా రిజిస్ట్రేషన్‌, పెయిడ్‌ డొనేషన్‌తో మార్పిడి చేసుకోవచ్చన్నారు. జీవన్‌దాన్‌ ట్రస్టు సమన్వయరక్త డా.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు