logo

అనుమతిపోతోంది..

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి.

Updated : 26 Feb 2024 07:44 IST

బస్తీవాసులకు గుదిబండలా మారిన ఎల్‌ఆర్‌ఎస్‌
అనుమతికి వెళ్తే 100 గజాలకు రూ.10లక్షల రుసుము
‘ఓపెన్‌ స్పేస్‌’ ఛార్జీల పేరుతో ఆర్థిక భారం

ఈనాడు, హైదరాబాద్‌: అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి. సాధారణ ప్రజలు అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించుకునే పరిస్థితి లేదు. 150 గజాల స్థలానికి ఇంటి నిర్మాణ అనుమతి కావాలంటే రూ.10లక్షల రుసుము చెల్లించాల్సి వస్తోంది. వంద గజాల స్థలమైనా సరే.. కనిష్ఠంగా రూ.5లక్షల ఛార్జీ పడుతోంది. జీ+1 భవనానికి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల మేర చెల్లించాలంటే పేదలు హడలెత్తిపోతున్నారు. ఆ భయంతో 99 శాతం మంది బస్తీవాసులు అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. కిక్కిరిసిపోయిన బస్తీల్లో, పాత కాలం ఊళ్లలో చేపట్టే నిర్మాణాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము వసూలు చేయడమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఖాళీ స్థలాలను అభివృద్ధి చేస్తామంటూ.. ప్రభుత్వం వసూలు చేస్తోన్న ‘ఓపెన్‌ ల్యాండ్‌ ఛార్జెస్‌’ నిధులను ఇప్పటి వరకు ఎక్కడా ఖర్చు చేయలేదని, ఆ పేరుతో పేదలపై ఆర్థిక భారం మోపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నరకం చూస్తోన్న పేదలు.. ఫిల్మ్‌నగర్‌ బస్తీకి చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన 166గజాల స్థలంలో ఇల్లు కట్టుకుందామని జీహెచ్‌ఎంసీని ఆశ్రయించగా.. రూ.8లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము కట్టమన్నారు. పాత యజమాని 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నందున రుసుము తక్కువ పడిందని.. లేదంటే రూ.12 లక్షల ఛార్జీ ఉండేదని అధికారులు చెప్పడంతో.. ఇంటి నిర్మాణ అనుమతి ఆలోచన విరమించుకోవడం గమనార్హం. ఇలా ఎంతోమంది కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలంలో ఇంటిని కట్టుకోలేకపోతున్నారు. మరికొందరు అనుమతి లేకుండానే పని కానిచ్చేస్తున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉద్దేశమేంటి?: అధికారిక లేఅవుట్‌లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్‌ ల్యాండ్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి అనధికార లేఅవుట్‌లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్యోద్దేశం. కానీ.. జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద రూ.100కోట్లకుపైగా రుసుము వసులు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు.

మినహాయింపులు ఉండాల్సిందే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారికంగా 1,500 మురికివాడలు ఉన్నాయి. మరో వెయ్యికిపైగా పాత కాలం కాలనీలు, శివారు గ్రామాలు ఉన్నాయి. కొన్ని బస్తీల్లో 50 గజాలు, 60గజాల స్థలాల్లో ఐదారంతస్తుల భవనాలుంటాయి. అద్దెల కోసమో, అన్నదమ్ముల వాటాగానో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఆయా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా.. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని నగరం మొత్తానికి వర్తింపజేసిందనే విమర్శలొస్తున్నాయి. జన సాంద్రత అధికంగా ఉన్న చోట, అరకొరగా మిగిలిన ఖాళీ స్థలాలకు, పాత ఇళ్లను కూల్చి కొత్తగా నిర్మించే ఇళ్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని వర్తింపజేయడంలో ఉద్దేశమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఖైరతాబాద్‌ చింతల బస్తీలో లేదా సికింద్రాబాద్‌ అడ్డగుట్టలో, జూబ్లిహిల్స్‌లోని షేక్‌పేట బస్తీలో, లేదంటే పాతబస్తీలోని గల్లీల్లో కట్టే ఇళ్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము ఏ లెక్కన వసూలు చేస్తారని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని