logo

Hyd News: ‘కారు’లోనే ఉండండి.. స్టీరింగ్‌ మా ‘చేతి’కివ్వండి!

రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో గెలిచేందుకు కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

Updated : 30 Mar 2024 07:25 IST

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో గెలిచేందుకు కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొందరు ప్రజాప్రతినిధులతో అనధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రధానంగా భారాస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అగ్రనేతలు సమావేశమవుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికిప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా లేరు. అటువంటి వారితో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడి ఒక ఒప్పందానికి వస్తున్నారు. భారాస తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సరే.. కాంగ్రెస్‌ విజయానికి సహకరించాలని కోరుతున్నారు. దీనికి పలువురు ఎమ్మెల్యేలు సమ్మతి తెలిపారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడు చేరకపోయినా..  

గ్రేటర్‌లో 29 అసెంబ్లీ సీట్లకుగాను మూడింటిలోనే కాంగ్రెస్‌ గెలిచింది. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేల బలం అవసరమని, లేనిపక్షంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కష్టమనే భావనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. దీనికోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను కొందరు సీనియర్‌ నేతలకు అప్పగించారు. వీరు సదరు ఎమ్మెల్యేలతో మాట్లాడి.. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డితో కూడా ఫోన్‌లో మాట్లాడిస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని, ఎన్నికలకు ముందు వీరు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.  మరో పదిమంది ఎమ్మెల్యేలతోనూ కాంగ్రెస్‌ అగ్రనేతలు మాట్లాడారు. వీరిలో సగం మంది  ఇప్పటికే సీఎంతో మాట్లాడారు. వీరంతా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌లో చేరకపోయినా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు పరోక్షంగా తోడ్పాటు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలు భారాస అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. పోలింగ్‌కు  ముందు ఈ ఎమ్మెల్యేలే కాకుండా వారి అనుచరులు కూడా పరోక్షంగా కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు  చెబుతున్నారు.

కార్పొరేటర్లు.. పురపాలక సంఘాలు..

బల్దియా పరిధిలోని కార్పొరేటర్లను సైతం దారికి తెచ్చుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల లోపు దాదాపు 30 మందిని  చేర్చుకోవాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం ఎన్నికల లోపు పూర్తికాకపోయినా ఎమ్మెల్యేల తరహాలో కార్పొరేటర్లతో అంతర్గత ఒప్పందం చేసుకుని కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పది మంది కార్పొరేటర్లతో మాట్లాడితే వారంతా సుముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లోని ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్‌ నేతలు ముందుకెళ్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని