logo

నకిలీ చెలా‘మనీ’.. ముఠా అరెస్టు

నకిలీ నోట్లు ముద్రించి బహిరంగ మార్కెట్‌లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం అరెస్టు చేసింది.

Published : 03 Apr 2024 02:26 IST

స్వాధీనం చేసుకున్న రూ.500 నకిలీ నోట్ల కట్టలు

బేగంబజార్‌, న్యూస్‌టుడే: నకిలీ నోట్లు ముద్రించి బహిరంగ మార్కెట్‌లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం అరెస్టు చేసింది. వారి నుంచి రూ.36,35,500 నకిలీ రూ.500 నోట్లు, అసలైన నగదు రూ.28వేలు, 8 చరవాణులు, ద్విచక్రవాహనం, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని తదుపరి విచారణ నిమిత్తం బేగంబజార్‌ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్‌ నగర టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరుకు చెందిన పి.మురళీకృష్ణ(38) పాతనేరస్థుడు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని తిరుమల థియేటర్‌ సమీపంలో నివాసముంటున్నాడు. కిచెన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నాడు. అతనిపై నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేయడంపై గుంటూరు, తెనాలి, కావలి తదితర ఠాణాల్లో 3 కేసులు నమోదయ్యాయి. అతనికి గతేడాది తమిళనాడులోని కర్రూరు ప్రాంతానికి చెందిన గృహాలంకరణ సామగ్రి విక్రయించే ఖాదర్‌ మైదేన్‌(30)తో పరిచయం ఏర్పడింది. పటాన్‌చెరు వద్ద అద్దె గదిలో ఉంటున్నాడు. అతనితో కలిసి కంప్యూటర్‌, ప్రింటర్లు, ఇతర ముడిసరకు సాయంతో రూ.500 నకిలీ నోట్లు ముద్రిస్తున్నాడు. అతని సాయంతో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్న హితేశ్‌(30), దశరథ్‌కుమార్‌(27) రాజస్థాన్‌లోని జాలార్‌ గ్రామవాసులు. గుజరాత్‌కు చెందిన మాలి రాజురాం(25) జుమ్మేరాత్‌బజార్‌లో అద్దెకుంటున్నాడు. బేగంబజార్‌ ఫీల్‌ఖానాకు చెందిన టైలరింగ్‌ సామగ్రి విక్రయించే ప్రవీణ్‌కుమార్‌(29)లతో కలిసి వీరంతా బహిరంగ మార్కెట్‌లో కొంతకాలంగా రూ.500 నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌, ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బేగంబజార్‌ పోలీసులతో కలిసి మంగళవారం బేగంబజార్‌ ఫీల్‌ఖానాలోని వీరి స్థావరంపై దాడి చేశారు. ప్రజలు రిజర్వు బ్యాంకు ముద్రించే నోట్లను గుర్తించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని