logo

ఇంటి వద్దకే ఓటు.. సద్వినియోగానికి చోటు

ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది.  పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు వంద శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది.

Published : 03 Apr 2024 02:30 IST

దివ్యాంగులకు, వృద్ధులకు సహకారం

దివ్యాంగుడిని ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి తీసుకొస్తున్న యువకుడు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, వికారాబాద్‌: ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది.  పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు వంద శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఈసారి దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి పట్టునే ఉండి ఓటు వేసేలా కార్యాచరణ ముమ్మరం చేసింది. గత శాసనసభ ఎన్నికల్లో ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడంతో సత్ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది మే 13న జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ దీన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా దివ్యాంగులు, వయోవృద్ధుల ఓటర్లను గుర్తిస్తున్నారు.

గతంలో ర్యాంపులు, మూడు చక్రాల కుర్చీలు

దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు వినియోగించుకునేందుకు గతంలో ఇబ్బంది పడేవారు. కొన్నేళ్లుగా ఈ సమస్యపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రాల్లో పలు సౌకర్యాలను ఏర్పాటు చేసింది. మూడు చక్రాల కుర్చీలు, ఇంటి దగ్గర నుంచి వాహనంలో తీసుకురావడం, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ర్యాంపులు నిర్మించడం ద్వారా వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రతి ఎన్నికలకు ప్రత్యేక వసతులు కల్పించారు. అయితే మంచానికే పరిమితమైన వారు ఓటుకు దూరంగా ఉన్నారు.

కొత్త విధానం ఇలా..

ఇటీవల ప్రకటించిన ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం జిల్లాలో మొత్తం 9,79,166 ఓటర్లు ఉండగా, వీరిలో మహిళలు 4,95,779, పురుషులు 4,83,354 ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 33 మంది ఉన్నారు. దివ్యాంగులు 14,576, వయోవృద్ధులు 24,165 ఓట్లు ఉన్నాయి.  ః మంచానికి పరిమితమైన దివ్యాంగులు, వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఓటు వేసేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. ఓటర్ల చెంతకే ఎన్నికల అధికారులు ఈవీఎంలతో వెళ్లి ఓటు వేయిస్తారు. ఈ ప్రక్రియను పూర్తిగా వీడియోలో చిత్రీకరించనున్నారు. కొత్త విధానం ద్వారా కదల్లేని దివ్యాంగులు, వయోవృద్ధులు, అనారోగ్యానికి గురైన వారికి ఓటు వేసే కల నెరవేరనుంది. దీంతో ఓటింగ్‌ శాతం భారీగా పెరగడానికి ఆస్కారం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో కదల్లేని స్థితిలో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని