logo

కాజేసి.. ఖతర్నాక్‌గా ప్లాన్‌ వేసి!.. జూబ్లీహిల్స్‌లో వీడిన చోరీ మిస్టరీ

జూబ్లీహిల్స్‌లో వ్యాపారి డీవీఎస్‌ సోమరాజు నివాసంలో జరిగిన చోరీ మిస్టరీ వీడింది. పనిమనిషే బంగారు వజ్రాభరణాలను కాజేసినట్లు గుర్తించి జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 21 Apr 2024 08:02 IST

సొత్తును చూపుతున్న అదనపు ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌, ఎస్సై రాజశేఖర్‌, సిబ్బంది

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌లో వ్యాపారి డీవీఎస్‌ సోమరాజు నివాసంలో జరిగిన చోరీ మిస్టరీ వీడింది. పనిమనిషే బంగారు వజ్రాభరణాలను కాజేసినట్లు గుర్తించి జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆమెతోపాటు మరో అయిదుగురిని అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, అదనపు ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌, డీఎస్సై రాజశేఖర్‌తో కలిసి శనివారం వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.62లో ఉన్న వ్యాపారి సోమరాజు నివాసంలో దాదాపు రూ.70 లక్షల బంగారు వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు ఈనెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నెలల క్రితం ఆ ఇంట్లో పనికి కుదిరిన పోకల నాగేంద్ర అలియాస్‌ స్వాతి(29) చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్‌ జిల్లా పురుషోత్తమయ్యగూడేనికి చెందిన ఆమె కొంతకాలంగా జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. సోమరాజు తల్లి ఆభరణాలను అల్మారాలో పెట్టడం గమనించిన స్వాతి ఈనెల 11న వాటిని తస్కరించింది. 4 గాజులను వెంకటగిరి ప్రాంతంలో తొలుత విక్రయించి ఫోను కొన్నది. తర్వాత మరో రూ.80 వేలతో బంగారు గొలుసు కొని, తన వద్ద ఉన్న కొన్ని ఆభరణాలను ధరించి టిప్‌టాప్‌గా తయారై కొనుగోలుదారులకు అనుమానం రాకుండా నేరుగా ఆటో మాట్లాడుకొని పలు నగల దుకాణాలకు వెళ్లి కొన్ని ఆభరణాలను విక్రయించి, దాదాపు రూ.8 లక్షల వరకు సొమ్ము చేసుకొంది. మిగిలిన ఆభరణాలను ఇంట్లోనే దాచింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. బోరబండ పర్వత్‌నగర్‌లో బంగారు వ్యాపారి రూప్‌ సింగ్‌, వెంకటగిరిలో వ్యాపారి రమాకాంత్‌శర్మ, దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురికి చెందిన వ్యాపారి జగదీశ్వరచారి, సైదాబాద్‌ వ్యాపారి రేవన్‌ మధుకర్‌ బాబర్‌, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వ్యాపారి వికాస్‌ ఆనంద్‌ కోడేకర్‌ ఆ ఆభరణాలను కొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరిని శనివారం అరెస్ట్‌చేసి 20 బంగారు గాజులు, 49 గ్రా వజ్రపు గొలుసు, 4 బంగారు గొలుసులు, 35 గ్రా బంగారు ముక్కలు, రూ.8 లక్షల నగదు, చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితుల్ని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన అదనపు ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌, డీఎస్సై రాజశేఖర్‌, సిబ్బందిని పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని