logo

మధుర ఫలం.. సమస్యలతో సతమతం

మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు.

Published : 19 May 2024 03:16 IST

ధరాఘాతం, వేలం అమలుకాక అన్నదాతలకు ఆర్థిక నష్టం

జగిత్యాల చల్‌గల్‌ మండీలో కాయలు 

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు: మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. ఇటీవల కొందరు మామిడి చెట్లను నరికివేసి ఇతర పంటలకు మళ్లుతున్నారు.

పరిష్కరించాల్సిన సమస్యలు

  • దిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల మామిడి కొనుగోలుదారులు జగిత్యాలకు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోకపోవటం. జగిత్యాల బ్రాండ్‌పేరిట ఎగుమతి చేస్తామని, ఉద్యానశాఖ, అపెడ, ఎఫ్‌పీవోలు, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వహామీ అమలుగాకపోవటం. ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తుండగా వీటి అమలుపై దృష్టిసారించాలి.
  • ఈ సంవత్సరం మామిడి పూత బాగావచ్చినా పూత, కాతను నిలుపుకునేలా రైతులకు అవగాహన కల్పించకపోవటం, చీడపీడలతో కాయలపై మంగు ఏర్పడకుండా శాస్త్రవేత్తలు, అధికారులు నివారణను తెలపకపోవటంతో తెంపిన కాయలకు ఆశించిన ధర రావటంలేదు. దీనికిగాను కనీసం వచ్చేసీజనుకైనా ముందస్తు చర్యలను రైతులకు తెలపాలి. స్థానికంగా ధరలు తగ్గినపుడు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా మామిడి కొనుగోలు కేంద్రాల్లో దేశవ్యాప్త మామిడి మార్కెట్ల ధరలను ప్రదర్శించాలి. కాయల గ్రేడింగ్, ప్యాకింగ్‌ తదుపరి కిసాన్‌ రైలు ద్వారా దిల్లీ కేంద్రంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతిని పెంచటం ధరల్లో స్థిరత్వాన్ని తేనుంది.
  • సాధారణంగా మే 20 వరకు కనీసం 40 వేల మెట్రిక్‌ టన్నుల కాయలు తరలాల్సి ఉండగా ఇప్పటివరకు జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, రాయికల్‌లలో కేవలం 18 వేల టన్నుల కాయలను మాత్రమే కొనుగోలు చేయటం కాపుతగ్గటాన్ని, ఇతర ప్రాంతాలకు కాయలు తరలటాన్ని ఉదహరిస్తోంది. పలువురు రైతులు స్థానికంగా ధరలు లభించక నాగ్‌పూర్, నిజామాబాద్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు కాయలను తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
  • జగిత్యాల మామిడి మండీ పాతస్థలంలో 4 భారీషెడ్లుండగా వాలంతరి నుంచి అదనంగా తీసుకున్న 10 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. సదుపాయాలు ఏర్పడగా నిబంధనల మేరకు రైతుల నుంచి కొనుగోలు కమీషన్‌ తీసుకున్న వ్యాపారులు తప్పనిసరిగా వేలం పద్ధతినే కాయలను కొనాలి. వేలాన్ని అనుసరిస్తే ఎక్కువమంది వ్యాపారులు పోటీపడి ధరలు పెరుగుతాయి. కానీ ఈ సీజన్‌లో కొందరు వ్యాపారులు మాత్రమే వేలం ద్వారా కాయలను కొంటుండగా వ్యాపారులందరూ వేలం పద్ధతినే కాయలను కొనేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

మాది జగిత్యాల మండలం చల్‌గల్‌. స్థానికంగా ధరలు తక్కువగా ఉండడంతో తోటలోని మామిడి కాయలను ఇతర రాష్ట్రాల వ్యాపారులకు నేరుగా విక్రయించా. జిల్లాకు చెందిన  చాలా మంది  రైతులు ఇతర ప్రాంతాల వ్యాపారులకు కాయలను నేరుగా విక్రయిస్తున్నారు. 

మల్లయ్య, రైతు

నా తోటలోని మామిడి కాయలను విక్రయానికి తేగా కాయలు అతిపెద్దగా ఉన్నాయంటూ(ఓవర్‌సైజ్‌) ధరను భారీగా తగ్గించారు. తరుగు, చిన్నకాయలు, మంగు తదితరాల పేరిట కోతలు, ధరాఘాతంతో రైతులు, తోటల గుత్తేదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 

రాంరెడ్డి, కొడిమ్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు