logo

ఇటు అవగాహన.. అటు తనిఖీలు

అధిక ఫలసాయం కోసం హైబ్రిడ్‌ వంగడాల వైపు పరుగులు తీసిన రైతులు చీడపీడల నుంచి రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జెనెటిక్‌ విత్తనాలవైపు అడుగులు వేస్తున్నారు.

Published : 28 May 2024 04:04 IST

అనుమతి లేని విత్తనాలపై వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం
న్యూస్‌టుడే, పెద్దపల్లి

పెద్దపల్లి మండలంలో రైతులకు అవగాహన కార్యక్రమం 

అధిక ఫలసాయం కోసం హైబ్రిడ్‌ వంగడాల వైపు పరుగులు తీసిన రైతులు చీడపీడల నుంచి రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జెనెటిక్‌ విత్తనాలవైపు అడుగులు వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే జన్యుమార్పిడి విత్తనాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఏకరీతి చట్టాలు లేకపోవడమే ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. నకిలీ లేదా అనుమతి లేని విత్తనాలు పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉండడం, అనుభవం కలిగిన రైతులే అనధికారిక ఏజెంట్లుగా మారడంతో జిల్లాలో జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతం నుంచి నకిలీ విత్తనాలు సరఫరా అవుతుండేవి. తాజాగా మహారాష్ట్ర నుంచి జన్యుమార్పిడి విత్తనాలు సరఫరా అవుతుండడమే ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో నకిలీ విత్తనాలను నియంత్రించడంతో పాటు అనుమతి లేని విత్తనాలను నిలువరించడం కూడా అధికారులకు సవాల్‌గా మారింది. దీంతో రైతులు, వ్యాపారులకు అవగాహన కలిగించడంతో పాటు నకిలీలను పట్టుకునేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు.

వ్యయం తగ్గుతుందనే..

సాగు వ్యయం తగ్గుతుందనే ఉద్దేశంతోనే రైతులు బీటీ విత్తనాలవైపు అడుగులు వేస్తున్నారు. 2003లో అందుబాటులోకి వచ్చిన బీటీ-1 విత్తనాలు శనగపచ్చపురుగును తట్టుకునేలా జన్యుమార్పిడి జరిగింది. 2006లో అందుబాటులోకి వచ్చిన బీటీ-2తో పొగాకులద్దెపురుగు బెడద కూడా రైతులకు తొలగిపోయింది. గులాబీ రంగు పురుగును తుదముట్టించే బీటీ-3 విత్తనాలు అందుబాటులోకి వస్తాయనుకునే తరుణంలో పర్యావరణానికి అతి ప్రమాదకరమైన హెచ్‌టీ పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. 2012లో నుంచి అందుబాటులోకి వచ్చిన హెర్బిసైడ్‌ టాలరెంట్‌ కాటన్‌(హెచ్‌టీ) కలుపు మొక్కలను నిలువరిస్తుంది. ఈ విత్తనాలు భూమి నాణ్యతను దెబ్బతీయడంతో పాటు పర్యావరణానికి హాని చేస్తాయనే ఉద్దేశంతో మనదేశంలో అనుమతించలేదు. కానీ 2013లో మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో దేశంలోకి ఈ హెచ్‌టీ విత్తనాలు ప్రవేశించాయి. మరుసటి ఏడు నుంచి మహారాష్ట్రలో సైతం ఈ విత్తనాలు నిషేధించినప్పటికి మనదేశంలో రహస్య ప్రాంతాల్లో ఈ విత్తనాలను అభివృద్ధి చేసి, రైతులకు చేరవేస్తున్నారు. మన జిల్లాలోని అంతర్గాం ప్రాంతంలోని రైతులు రెండేళ్లుగా ఈ విత్తనాలను వినియోగిస్తున్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి దళారుల ద్వారా విత్తనాలను సదరు కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ విత్తనాలు కలుపు నివారణకు వినియోగించే గ్లైకోసిల్‌ మందును కూడా తట్టుకుంటుంది. సాగు వ్యయం తగ్గుతుందని బీటీ విత్తనాలవైపు అడుగులు వేసిన రైతులు తాజాగా హెచ్‌టీ విత్తనాలవైపు దృష్టి సారించడమే ప్రమాదకరంగా మారింది.

రైతులతోనే విక్రయాలు

జిన్నింగ్‌ మిల్లులో సేకరించిన విత్తనాలకు రంగులు వేసి, అందమైన బ్రాండెడ్‌ కవర్లలో ప్యాక్‌ చేసి, ఏజెంట్ల ద్వారా రైతులకు విక్రయించే వ్యవస్థను తలదన్నే రీతిలో హెర్బిసైడ్‌ టాలరెంట్‌ కాటన్‌ విత్తనాలను విక్రయించే ముఠా పనిచేస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని రహస్య ప్రాంతాలలో హెచ్‌టీ విత్తనాలను సిద్ధం చేసిన విత్తన తయారీ మాఫియా రైతులకు నేరుగా సరఫరా చేసేందుకు ఆయా గ్రామాల్లోని రైతులనే ఏజెంట్లుగా పెట్టుకొంది. ఈ విధంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి ఈ హెచ్‌టీ విత్తనాలు గొలుసు మాదిరిగా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో హెచ్‌టీ విత్తనాల వల్ల భూమి పొరకు జరిగే నష్టంపై అవగాహన కలిగిస్తున్నారు. ఒకసారి హెచ్‌టీ పత్తి విత్తనాలు పెట్టిన నేలలో రెండోసారి అవే విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. పంటమార్పిడి సాధ్యపడదు. పంట మార్పిడి కోసం విత్తుకునే విత్తులు భూమిలో మిగిలిపోయిన హెచ్‌టీ విత్తనాలలోని విషపూరితమైన బ్యాక్టీరియాలు ఇతర విత్తనాలు మొలకెత్తకుండా చేయడంతో పాటు భూమిని గుల్లబరిచి, గడ్డితో పాటు ఎలాంటి మొక్కలు పెరగకుండా చేస్తుందని అధికారులు ప్రచారం చేస్తున్నారు. మరి వీరి ప్రచారం ఏమేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.  

హెచ్‌టీ విత్తనాల నియంత్రణకే..

పర్యావరణానికి హాని కలిగించే హెచ్‌టీ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. కానీ కొందరు రైతులకు నేరుగా సరఫరా చేస్తున్నారనే సమాచారంతోనే రైతులను జాగృతం చేసేందుకు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోలీసుల సహకారంతో తనిఖీలు జరుపుతున్నాం. బ్రాండెడ్‌ ప్యాకెట్లు కూడా చిరిగిపోతే వాటిపై కేసులు నమోదయ్యే అవకాశముంది. రైతులకు, పర్యావరణానికి నష్టం కలిగించే అన్నిరకాల విత్తనాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం.

 ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని