logo

పనుల్లో జాప్యం.. పెరగాలి వేగం

అయిదేళ్లకు ఒకసారి జరిగే శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు నెలలుగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌ మూడు రోజుల కిందట ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎప్పటిలాగే యథావిధిగా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.

Published : 08 Dec 2023 04:51 IST

హుస్సేనీపురలో అసంపూర్తిగా మురుగుకాలువ

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌ : అయిదేళ్లకు ఒకసారి జరిగే శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు నెలలుగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌ మూడు రోజుల కిందట ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎప్పటిలాగే యథావిధిగా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని నగర, పురపాలికల్లో పరిధిలో అభివృద్ధి పనుల వేగం పెంచాలంటూ ‘న్యూస్‌టుడే’ కథనం.

రెండు నెలలుగా కదలిక లేక...

రెండు నెలలుగా ఎన్నికల కారణంగా పనుల్లో పురోగతి లేకపోగా, ఎన్నికల సంఘం పలువురు అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల విధులను అప్పగించడంతో కార్యాలయాలు బోసిపోయాయి. అత్యవసర దస్త్రాలు, పనులు మినహాయిస్తే ఏ ఒక్కటీ ముందుకు కదలలేదు. మరో ఆరు నెలల వరకు నగరాలు, పట్టణాల్లో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఆ లోపు పూర్తి చేసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో స్మార్ట్‌సిటీ, సీఎంఏ నిధులు, జనరల్‌ ఫండ్‌, సుడాకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

ఆగుతూ.. సాగుతూ

ఎన్నికలను కారణంగా చూపించడంతో అభివృద్ధి పనులకు అంతరాయం కలిగింది. ప్రధానంగా కూడళ్ల సుందరీకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్‌ రాకముందు హడావుడిగా రూ.132 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని డివిజన్లలో ఒకటెండ్రు చోట్ల ప్రారంభించి పూర్తి చేయగా మిగతా చోట్ల నత్తను మించి పోటీ పడుతున్నట్లుగా తయారైంది. పలు వీధుల్లో తవ్వి మురుగుకాలువలు, రహదారులు అసంపూర్తిగా వదిలేశారు. కొన్ని చోట్ల అయితే 20 రోజులుగా రాకపోకలు సాగించకుండా మారడంతో ఆయా ప్రాంతవాసులు అవస్థలు పడుతున్నారు. ఒక వైపు పూర్తి చేయడం, మిగతా వైపు వదిలేయడంతోనే సమస్యలు వస్తున్నాయి. వర్షం చినుకులతో బురదగా మారిందని ఆ ప్రాంతవాసులు ఆగ్రహిస్తున్నారు.

సమీక్షలతో ముందుకు సాగాలి

అభివృద్ధి పనులతోపాటు ప్రజలకు సంబంధించిన దస్త్రాలు, ఫిర్యాదులు పరిష్కరించేందుకు విభాగాల వారీగా మేయర్‌, కమిషనర్‌తోపాటు విభాగాల అధికారులు వరుస సమీక్షలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపడితే ప్రజలకు సౌకర్యంగా మారనుంది.

రూ.37 కోట్ల పనులకు టెండర్లు

నగర పాలక సంస్థ పరిధిలో రహదారులు, మురుగుకాలువలు, తాగునీటి పైపులైన్లు, కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం సాధారణ నిధులు సుమారు రూ.20 కోట్లకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కొన్నింటిని పిలవగా మిగతావి ఆన్‌లైన్‌ చేసే లోపే ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. టెండర్లు పూర్తయిన వాటికి ఖరారు చేసి, మిగతా పనులకు తిరిగి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. సుడా పరిధిలోని గ్రామాల్లో సెంట్రల్‌ లైట్లు బిగించేందుకు, మానకొండూర్‌ చెరువు అభివృద్ధి, ఇతర పనులు చేసేందుకు రూ.17 కోట్లతో టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది.

దస్త్రాల పరిశీలనలో..

కార్యాలయంలో గత కొన్ని రోజులుగా విభాగాల్లో పని చేస్తున్న పర్యవేక్షకులు, అధికారులు, ఉద్యోగులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రెవెన్యూ విభాగంలో పేరు మార్పిడి, ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తి పనుల సవరణ, జనన, మరణాల ధ్రువీకరణల విచారణ, భవన అనుమతుల జారీ, ఇంటి నిర్మాణాలు, పట్టణ ప్రణాళికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాలు, కొత్త నల్లా కనెక్షన్ల జారీ, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జీతాభత్యాలు, ఉద్యోగుల ప్రయోజనాలు, పారిశుద్ధ్య విభాగంలో వాహనాల మరమ్మతులు వంటివి దస్త్రాలు పెండింగ్‌లో పడ్డాయి. జాప్యం లేకుండా త్వరతిగతిన పూర్తి చేయాల్సిన అవసరముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని