logo

సిద్ధమా.. రామయ్యా..!

వారం రోజుల కిందట ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం బాలారిష్టాలన్నీ దాదాపు అధిగమించినట్లే. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా సేవలకు ఉపక్రమించింది.

Updated : 29 May 2023 08:42 IST

కొత్త సర్కారుకు సవాళ్లు
పథకాల అమలే పెద్ద బాధ్యత

శివరామయ్యల నడుమ సమన్వయం కుదిరేనా

ఈనాడు, బెంగళూరు: వారం రోజుల కిందట ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం బాలారిష్టాలన్నీ దాదాపు అధిగమించినట్లే. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా సేవలకు ఉపక్రమించింది. నేడో రేపో మంత్రులందరికీ శాఖలూ కేటాయిస్తారు. బంపర్‌ మెజార్టీతో కొలువైన సిద్ధరామయ్య సర్కారుకు అసమ్మతి భయం కూడా అంతంత మాత్రమే. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఒకరిద్దరు సీనియర్లు, యువ నేతలు మినహా పార్టీలో అసమ్మతిని చాటింది లేదు. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల నియామకాలన్నీ అధిష్ఠానం పర్యవేక్షణలో చేపట్టిన కారణంగా రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తగ్గినట్లే. పైగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాష్ట్రవాసి కావటంతో పార్టీపరమైన ఇక్కట్లను సులువుగా పరిష్కరించగలరు. ఇంతటి వెసలుబాటు పొందిన సిద్ధరామయ్య సర్కారు చేయాల్సిందల్లా సజావుగా పాలన అందించటం. ఇంతకీ సిద్ధు సర్కారు నెరవేర్చాల్సిన బాధ్యతలేవంటే!

గ్యారెంటీ గొడవ తీర్చాలి

కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ దక్కేందుకు బలమైన కారణాల్లో 5 గ్యారెంటీ పథకాలు కీలకమైనవి. అన్నభాగ్య, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు, నిరుద్యోగ భృతి, గృహిణులకు రూ.2వేల ఆర్థిక సాయం..ఈ పథకాలెప్పుడు ఇంటి తలుపు తట్టుతాయోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచార వేడిలో కాంగ్రెస్‌ నేతలు చేసిన ఉద్వేగపూరిత ప్రకటనలు ప్రభుత్వం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. తొలి మంత్రివర్గంలోనే 5 గ్యారెంటీల ఆదేశాలు వెల్లడిస్తామన్న సర్కారు తీరా అధికారంలో రాగానే ఖర్చులు లెక్కగడుతోంది. నోటి లెక్కల ప్రకారమే రూ.60వేల కోట్లను ‘ఉచితాల’ కోసం వ్యయం చేయాల్సి ఉంది. ప్రతిపక్షాలు కూడా ఈ గ్యారెంటీ పథకాలపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపడేస్తున్నాయి. ఎవరేమన్నా, ఎన్ని కష్టాలెదురైనా ఇచ్చిన గ్యారెంటీ పథకాల హామీ నెరవేరుస్తామని చెబుతున్న సర్కారు వీటి సక్రమ అమలుతోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలదు. ఈ పథకాలకు తోడు ఇందిరా క్యాంటీన్‌, గతంలో అమలు చేసిన ‘భాగ్య’ పథకాలనూ సవరించి కొత్తగా అమలు చేయాలి.

సుస్థిర ఆర్థికత

భాజపా సర్కారు కరోనా విసిరిన సవాళ్ల కారణంగా ఆర్థిక వ్యవస్థను అదుపు చేయలేకపోయింది. ఆ పార్టీ పాలనాకాలంలో రూ.3లక్షల కోట్ల రుణాలను బహిరంగ విఫణి నుంచి పొందింది. గత రుణాలు, కొత్తగా చేసిన రుణాలు కలిపి ప్రస్తుతం రాష్ట్రంపై రూ.5.40లక్షల కోట్ల రుణాలున్నాయి. అసలు, వడ్డీల రూపంలోనే ఏటా రూ.56వేల కోట్లను రాష్ట్రం చెల్లించాలి. ఈ లెక్కలన్నీ ప్రతి శాసనసభ సమావేశాల్లో వెల్లడించే సిద్ధరామయ్య నేడు అధికారంలోనికి వచ్చాక వాటిని సుస్థిరం చేయాల్సిందే. లేదంటా విపక్షాలు ఊరుకోవు. విపక్షంలో ఓమాట, అధికారంలోకి వచ్చాక మరోమాటలా కాకుండా బాధ్యతతో సుస్థిర ఆర్థికతను కొనసాగించాలి. ఓ వైపు సంక్షేమ పథకాలు, మరో వైపు అభివృద్ధి పనులు, కట్టుబడి వ్యయానికి నిధులు సమకూర్చటం ఆర్థిక శాఖ (ఇంకా నిర్ధరించలేదు)ను నిర్వహించే సిద్ధరామయ్యకు అంత సులువైతే కాదు.

ఎన్నికల ఏడాది

విధానసభ ఎన్నికల కారణంగా స్థానిక ఎన్నికలను పదే పదే వాయిదా వేస్తూ వచ్చిన సర్కారు ఈ ఏడాది వాటిని దాటవేసే వీలులేదు. రెండేళ్ల కిందట కాలపరిమితి ముగిసిన జిల్లా, తాలూకా పంచాయతీ, బీబీఎంపీ ఎన్నికలను అనివార్యంగా ఈ ఏడాది నిర్వహించాలి. సుప్రీం కోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్‌ కూడా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన విజయనగర జిల్లా, నాలుగు అదనపు తాలూకా పంచాయతీలు, తాలూకా పంచాయతీలుగా మారే గ్రామాలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వారీగా పునర్విభజన పనులు జూన్‌లోగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఈ మూడు స్థాయిల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలి. విపక్షంలో ఉండి కూడా గ్రామ పంచాయతీల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌..ఈసారి అన్ని స్థాయి ఎన్నికల్లోనూ పట్టు సాధించాలి.

లోక్‌సభ సమరం

సిద్ధరామయ్య సర్కారు పనితీరును లెక్కగట్టే అతి కీలకమైన పరీక్ష లోక్‌సభ ఎన్నికలు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాధించే స్థానాలు కేంద్ర నాయకత్వానికే కాదు రాష్ట్ర నాయకత్వానికి కూడా అగ్ని పరీక్షే. 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి కనీసం 20స్థానాలపై గురి పెట్టింది. అసలే అధికార పంపిణీ కత్తి సిద్ధరామయ్య మెడపై వేలాడుతుండగా, లోక్‌సభ ఎన్నికల్లో సాధించే విజయమే ఆయనను పూర్తికాల ముఖ్యమంత్రి కలను కూడా నెరవేర్చగలదు. లేదంటే అధికారాన్ని అనివార్యంగా ఇతరులకు అందించాల్సిందే.

ఇంకొన్ని..

ఎంత కాదన్నా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌..సిద్ధరామయ్య పక్కలో బల్లెంలాంటి వారు. ఎన్నికల ముందు కుదిరిన సమన్వయం అధికారంలోనికి వచ్చాక సాధ్యపడకపోవచ్చు. ముఖ్యమంత్రి స్థానాన్ని అందించేందుకు సుతరామూ ఇష్టపడని డీకే శివకుమార్‌ అధిష్ఠానం ఆదేశాలకు తలొంచినా సిద్ధరామయ్య సర్కారుపై ఓ వైపు కన్నేసే ఉన్నారు. అంతా సవ్యంగా ఉంటే నా అవసరం ఏముంటుందన్న లాజిక్‌ డీకే మనసులో లేదని చెప్పలేం. తనదైన వర్గాన్ని పార్టీలో సృష్టించుకున్న డీకే శివకుమార్‌తో సమన్వయాన్ని సాధించటం సిద్ధుకు సవాలే.

* భాజపా సర్కారుపై 40 శాతం అవినీతి అస్త్రాన్ని ఎక్కుపెట్టి విజయం సాధించిన కాంగ్రెస్‌..ఆ మరక తమకు అంటకుండా జాగ్రత్త పడాలి. సిద్ధరామయ్య, డీకేలు మాత్రమే పారదర్శకంగా ఉంటే చాలదు. మంత్రివర్గం, ఎమ్మెల్యేల బృందమంతా అవినీతి జాఢ్యానికి బలికాకుండా చూసుకోవాలి. లేదంటే విపక్షాల దాకా ఎందుకు సామాజిక మాధ్యమం చాలు కాంగ్రెస్‌ సర్కారు విరుచుపడటానికి. ఇప్పటికే భాజపా హయాంలో అనుమతించిన కాంట్రాక్టులను రద్దు చేసిన సిద్ధు సర్కారు ఇకపై పాలనలో పారదర్శకత పాటించాలి.

ఎన్నికల ముందు ప్రణాళికను విడుదల చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని