logo

ప్రజ్వల్‌.. లొంగిపో : కుమారస్వామి హితవు

నాపైనా, హెచ్‌డీ దేవేగౌడపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని- హాసన సెక్స్‌స్కాండల్‌లో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్‌కు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

Updated : 21 May 2024 09:46 IST

ప్రజ్వల్‌ రేవణ్ణ

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : నాపైనా, హెచ్‌డీ దేవేగౌడపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని- హాసన సెక్స్‌స్కాండల్‌లో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్‌కు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. అశ్లీల వీడియోల కేసు అందరినీ తల దించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఈ కేసులో తమకు సంబంధం లేకపోయినా దేవేగౌడ, తన పేరును ముడిపెట్టారని ఆక్రోశించారు. రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తానని దేవేగౌడ ప్రకటించగా, తామంతా అడ్డుకున్నామని చెప్పారు.

సోమవారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజ్వల్‌ ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లాడని తెలిపారు. ఒక వారంలో వచ్చి విచారణకు హాజరవుతానని ప్రకటించిన అనంతరం అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో భారత్‌కు వచ్చేందుకు వెనకడుగు వేసి ఉండవచ్చని పేర్కొన్నారు. పద్మనాభనగరలో తాను రేవణ్ణను భేటీ అయ్యేందుకు వెళ్లానని వచ్చిన వార్తలలో నిజం లేదన్నారు. తన తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని విచారించేందుకే వెళ్లానని స్పష్టం చేశారు. ‘చట్ట ప్రకారం కేసు విచారణకు హాజరవ్వు. ఎన్ని రోజులు దొంగా పోలీసు ఆట ఆడతావు? విదేశం నుంచి వచ్చి విచారణకు సహకరించు’ అని ప్రజ్వల్‌కు హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని