logo

రూ. 9 కోట్లు వాగులో పోశారు..!

అధికారుల్లో చిత్తశుద్ధి, ముందుచూపు కొరవడటంతో తొమ్మిది కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారాయి. వందలాది ఎకరాల బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.

Published : 13 Apr 2024 03:39 IST

పూడికతో నిండిన ఎత్తిపోతల పథకం బావి

అశ్వారావుపేట, ములకలపల్లి, న్యూస్‌టుడే: అధికారుల్లో చిత్తశుద్ధి, ముందుచూపు కొరవడటంతో తొమ్మిది కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారాయి. వందలాది ఎకరాల బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ములకలపల్లి మండలంలో పాములేరు వాగుపై తిమ్మంపేట వద్ద ఎత్తిపోతల పథకాన్ని రూ.9కోట్లుతో నిర్మించారు. ఈ పథకానికి కోట్లు ఖర్చయినా రైతుల భూములకు సాగునీరందించలేక ఎందుకూ కొరగాకుండా పోయినట్లైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నీటిపారుదల శాఖాధికారులు ఇప్పుడు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసిన ప్రదేశం ఆకృతి(డిజైన్‌) సక్రమంగా లేదంటూ సెలవిస్తున్నారు. ఎత్తిపోతల ఏర్పాటు చేసిన ప్రదేశం వాగునుంచి నీరు తోడేందుకు అనువుగా లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

  • ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట, రాజీవ్‌నగర్‌, పుట్టతోగు గ్రామాల్లో సుమారు 900 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు పాములేరు వాగుపై ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం 2016లో రూ.9కోట్లు మంజూరు చేయగా 2019లో పనులు పూర్తిచేశారు. నాటి నుంచి ట్రయల్‌ రన్‌లోనూ తీవ్ర జాప్యం చేశారు. ఎట్టకేలకు గతేడాది జులైలో ట్రైల్‌రన్‌ వేశారు. వర్షాకాలం వరదలొస్తే మినహా మిగిలిన రోజుల్లో ఈ పథకానికి నీరందే పరిస్థితిలేదని నీటిపారుదల అధికారులే తేల్చేశారు. ఆనాడు ఈ పథకాన్ని మంజూరు చేసింది, డిజైన్‌ చేసిందీ నీటిపారుదల శాఖాధికారులే. నేడు డిజైన్‌ సక్రమంగా లేదంటూ సెలవిస్తోందీ ఆ అధికారులే. ఇదీ అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. వాగుపై చెక్‌డ్యాం(అడ్డంగా కట్ట) కట్టాలన్నా భారీ ఖర్చు, పైగా అనువుగా లేని ప్రాంతం కావడంతో తిమ్మంపేట ఎత్తిపోతల నుంచి నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి నెలకొంది. అనువుకాని ప్రాంతంలో రూ.9కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఎత్తిపోతల ఎవరిని ఉద్ధరించేందుకో అధికారులే సెలవియ్యాలి.

గుత్తేదారుకు సొమ్ములు.. రైతులకు ఎదురుచూపులు..

పాములేరు ఎత్తిపోతల నిర్మాణంతో గుత్తేదారు జేబుల్లోకి బిల్లులు వచ్చాయి. రైతుల పొలాల్లోకి మాత్రం నీళ్లు రాలేదు. ఆరేళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నా రైతులకు నిరాశ, నిస్పృహలే మిగిలాయి. వాగు మధ్యలో నీటి ప్రవాహం కంటే ఎక్కువ ఎత్తుఉండే విధంగా బావి నిర్మిస్తే అందులోకి వచ్చే నీటిని మోటార్లు ద్వారా తోడొచ్చు అని తన పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని ఓ ఇంజినీరింగ్‌ అధికారి పేర్కొన్నారు.

ఎత్తిపోతల డిజైన్‌ సక్రమంగా లేదు:

సురేష్‌, ఐబీ ఈఈ

పాములేరుపై ఎత్తిపోతల పథకం డిజైన్‌ సక్రమంగా లేదు. వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో నీటి సేకరణ చేయలేని పరిస్థితి. ఎత్తిపోతల ఏర్పాటు చేసిన ప్రాంతం చెక్‌డ్యాం కట్టేందుకు అనువుగా లేదు. వరదలు వచ్చినప్పుడే చెరువులను నింపేలా డిజైన్‌చేశారు. పనులన్నీ పూర్తయ్యాయి. వచ్చే వర్షాకాలం పూర్తిస్థాయిలో మోటార్లు ఆన్‌చేసి చెరువులకు, వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు