logo

రామాలయ ధర్మకర్తల మండలిపై ఆశలు!

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశం చాలా కాలం తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈదఫా ఎలాగైనా చోటు దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Published : 08 Dec 2023 03:17 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు అంశం చాలా కాలం తర్వాత మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈదఫా ఎలాగైనా చోటు దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక ఛైర్మన్‌తోపాటు కనీసం పది మంది సభ్యులకు ఇందులో అవకాశం కల్పించే వీలు ఉండడంతో ఆశావహుల జాబితా పెద్దగానే ఉందని అంచనా. 1968లో ధర్మకర్తల మండలి నియామకం తొలిసారిగా ఇక్కడ చేపట్టారు. కొన్ని మండళ్లు ఏడాది ఉండగా ఇంకొన్ని రెండు నుంచి మూడేళ్లు పనిచేశాయి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆఖరి మండలి ఏర్పడింది. దీనికి కురిచేటి పాండురంగారావు అధ్యక్షులుగా పనిచేశారు. 2012 తర్వాత వీటి ఊసే లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నియామకాలు ఉంటాయా లేదా అన్నది తేలనప్పటికీ ఆశావహులు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

రెండు దఫాలు దరఖాస్తులకే పరిమితం..

తెలంగాణ ఏర్పడిన కొత్తలో ధర్మకర్తల మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇది ప్రొటోకాల్‌ పదవి కావడంతో ఎంతో మంది దరఖాస్తు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు ప్రతి దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి విచారణ చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపారు. ఆ ఐదేళ్లు ఎటూ తేల్చకుండా కాలయాపన చేశారు. తెరాస ప్రభుత్వం రెండో విడత వచ్చిన తర్వాత మళ్లీ  ప్రయత్నించినా ఈ దస్త్రం ముందుకు కదల్లేదు. ప్రస్తుత ఎన్నికలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడనుంది. నూతన ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవులకు అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని పెద్ద ఆలయాలలో ఎంతో ప్రముఖమైన భద్రాచలం ఆలయ అధ్యక్ష పదవిగాని, ధర్మకర్త హోదాగాని దక్కితే సముచితంగా ఉంటుందని కొందరు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.


అభివృద్ధి పనులపై చొరవ అవసరం

  • రామాలయంలో నిర్వహించే ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి పైసా రాదు. ఈ ఖర్చును ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేందుకు చొరవ కావాలి.
  • శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు రూ.15 వేలే ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ నిధి చాలదు. ఈ మొత్తాన్ని పెంచేలా చూడాలి.
  • రూ.50 కోట్ల వార్షిక బడ్జెట్‌ ఉన్న ఈ దేవస్థానానికి ఇటీవల ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాతలను ఆకట్టుకుని గోశాల విస్తరణతో పాటు వసతి సదుపాయాన్ని కల్పించాలి.
  • బంగారు వెండి ఆభరణాల లెక్కలను వెల్లడించి పారదర్శకత కల్పించాలి.
  • శ్రీరామ కోటి స్తూపాలను నిర్మించాలి. రామాలయ భూముల్లో ఆక్రమణలను తొలగించాలి.
  • కొత్త పూజలపై ప్రచారం కల్పించాలి. నూతన ప్రసాదాలన్నీ అందుబాటులో ఉంచాలి.
  • పర్యాటక అభివృద్ధికి రామాయణ వలయంపై ప్రచారం కల్పించాలి.
  • ప్రభుత్వానికి అధికారులకు మధ్య వారధిగా ఉండి భక్తుల సేవలో తరించాలి.
  • అన్నింటికీ మించి రాజకీయాలకు అతీతంగా ఉండాలి. వివాదాల జోలికి వెళ్లకుండా ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచాలి. రామాలయాన్ని అభివృద్ధి చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని