logo

మామూలు రాళ్లు కాదు.. రామాయణ ఆనవాళ్లు!

లక్ష్మణ గుట్ట. సీతారాములవారు సంచరించిన ప్రాంతమిది. లక్ష్మణుడు పహారా కాసిన ప్రదేశమని భక్తుల నమ్మిక.

Updated : 17 Apr 2024 08:28 IST

లక్ష్మణ గుట్ట

భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, న్యూస్‌టుడే: లక్ష్మణ గుట్ట. సీతారాములవారు సంచరించిన ప్రాంతమిది. లక్ష్మణుడు పహారా కాసిన ప్రదేశమని భక్తుల నమ్మిక. ఈ గుట్టలోని పసుపు, కుంకుమ వర్ణం రాళ్లను దంచి సీతమ్మవారు నుదుట బొట్టు పెట్టుకునేవారని ప్రతీతి. త్రేతాయుగంలో సీతారాములవారు వనవాసం చేస్తున్నప్పుడు పర్ణశాలలో నివాసమున్నారు. దీనికి సమీపంలో లక్ష్మణ గుట్ట ఉంది. దీనిపై పరిశోధనలు చేస్తే ఇతిహాస అంశాలు మరిన్ని వెలుగులోకి వస్తాయి. ‘న్యూస్‌టుడే’ బృందం ఈప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించింది.

పర్ణశాల నుంచి 10 కి.మీ...

దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు సీతవాగు   కి.మీ. దూరంలో ఉంటుంది. సీతవాగు లక్ష్మణగుట్టకు మధ్య దూరం 9 కి.మీ. సీతవాగును దర్శించుకునే భక్తులు అక్కడ విక్రయించే సీతమ్మవారి పసుపు, కుంకుమ రాళ్లను తీసుకోవటం శుభసూచకంగా భావిస్తారు. ఈ రాళ్లు లభించే ప్రాంతమే    లక్ష్మణగుట్ట. చిన్నరాళ్ల నుంచి బండలు వరకు కొన్ని పసుపు రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉండటం వీటి ప్రత్యేకత. 200 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. రాళ్లను పగలగొట్టి చూస్తే మరింత ముదురు రంగు కనిపిస్తుంది. వీటినే చిన్న ముక్కలుగా చేసి సీతవాగు వద్ద భక్తులకు ఇస్తున్నారు.

  • రామాయణ కాలంలో పద్మ సరస్సు ఉండేదని, కాలక్రమేణా సీతవాగుగా మారిందని పేర్కొంటారు. ప్రత్యేక సందర్భాల్లో సీతమ్మ తల్లి ఈ వాగులో స్నానమాచరించేవారన్న ప్రచారం ఉంది. అనంతరం లక్ష్మణ గుట్టలోని పసుపు, కుంకుమ వర్ణం రాళ్లను అరగదీసి నుదుట బొట్టు  ధరించేవారని ఉవాచ. సీతారాములవారు పర్ణశాలలో నివాసం ఉండగా లక్ష్మణుడు ఈగుట్ట పైనుంచి పహారా కాసేవాడని, అందుకే దీనికి లక్ష్మణగుట్టగా పేరొచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

ఎలా వెళ్లాలంటే..?

దుమ్ముగూడెం మండలం చిన్నగుబ్బల మంగి వంతెన వరకు ప్రధాన రహదారి ఉంది. దీనికి సమీపం నుంచి అంతర్గత రహదారిలోకి ప్రవేశించాలి. అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలో ములకనాపల్లి వస్తుంది. ములకనాపల్లి నుంచి లక్ష్మణగుట్టకు 2 కి.మీ. మేర కాలినడకన మోళ్లు, రాళ్లు, గుంతలను దాటుకుని చేరుకోవాలి. ఇది రిజర్వ్‌ ఫారెస్ట్‌. లక్ష్మణ గుట్టకు వెళ్లగానే చిన్నపాకలో ఇటీవల ఏర్పాటుచేసిన సమ్మక్క, సారలమ్మ దేవతల గద్దెలు కనిపిస్తాయి. అక్కడ ఉండే రాళ్లను పరిశీలిస్తే మనసు పులకిస్తుంది. నడక మార్గంలో వెళ్లిన శ్రమంతా మాయమై  దేవతలు పర్యటించిన ప్రదేశంలో ఉన్నామనే భావన కలగకమానదు.

ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లే అవకాశం

సీతవాగు వద్ద పసుపు కుంకుమ రాళ్లు

భద్రాచలానికి సమీపంలోని పర్ణశాలలో సీతారామలక్ష్మణులు రెండున్నరేళ్లపాటు నివసించారు. రామాయణ ఇతిహాసానికి సంబంధించిన ముఖ్యఘట్టాలకు వేదిక ఇది. సీతమ్మవారు నీర చీరలను ఆరేసుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. సీతవాగు ప్రవహిస్తుంది. శూర్పణఖ ముక్కు, చెవ్వులు కోసింది ఇక్కడే. లక్ష్మణరేఖ గీసిందీ పర్ణశాల వద్దనే. మారీశుడు మాయలేడిగా వచ్చింది ఈ అరణ్యంలోకే. సీతాదేవిని రావణుడు అపహరించిందీ ఈ పంచవటి వద్దనే. పర్ణశాలలో రాముడు నివాసం ఉండటం వల్లే ఎటపాక, ఉష్ణగుండాల, శబరి, శ్రీరామగిరి, లింగాల వద్ద రామపాదుకల గుర్తుల ప్రాంతాలన్నీ పుణ్యక్షేత్రాలుగా గుర్తింపు పొందాయి. లక్ష్మణ గుట్ట విశిష్టతపై దేవాదాయ, అటవీ, పర్యాటక, పురావస్తుశాఖలు దృష్టిసారించాలి. ఈ గుట్టను భక్తులు దర్శించుకునేందుకు అనుమతులిస్తే ఇదో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లే అవకాశముంది.


దేవతలంతా వచ్చి దీవెనలివ్వాలని..!

అగ్ని మథనం చేస్తున్న అర్చకులు

భద్రాచలం, న్యూస్‌టుడే: ఒకే మాట.. ఒకటే బాణం.. నింగే విరిగిపడినా వ్రతభంగమ్ము కానివ్వడమ్మా..! సందేహించకమ్మా రఘురామ ప్రేమను అంటూ శ్రీరాముడి గుణాల గురించి భక్తులు భజనలు చేశారు. సోమవారం ఎక్కడ చూసినా రామా రామా అంటూ భగవన్నామ సంకీర్తనలే. భద్రాద్రి భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. జగదేక వీరుడి బ్రహ్మోత్సవాల సందడి గగనాన్ని తాకింది. ఈ వేడుకలను వీక్షించేందుకు వచ్చిన భక్తజనంతో మాడవీధులు కిక్కిరిపోయాయి. అనుబంధంగా ఉన్న ఆంజనేయ,   లక్ష్మీతాయారు కోవెళ్లలోనూ రద్దీ నెలకొంది.

మార్మోగిన శ్రీరామ నామాలు

మాదేవుడంటే నువ్వేలే రామయ్యతండ్రి అంటూ భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి రామకోటిని సమర్పించారు. హనుమాన్‌ చాలీసాను పారాయణం చేశారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామ నామాలు మిన్నంటుతుండగా అగ్నిమథనం పరమానంద భరితం చేసింది. శాస్త్రం ప్రకారం రెండు రకాల చెట్ల చెక్కలను కవ్వంలా రాపిడి చేయగా అగ్ని ప్రత్యక్షమైంది. రెండు కర్రల మధ్యలో పుట్టిన అగ్నిని అర్చకులు హోమంలో వేసి అగ్ని ప్రతిష్ఠాపన చేశారు. యాగశాలలోని గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ధ్వజస్తంభం వద్దకు తీసుకెళ్లి ధ్వజారోహణ జరిపారు. ధ్వజ పటాన్ని ధ్వజస్తంభంపైన ఎగురవేసి బ్రహ్మోత్సవ శోభను పెంచారు. గరుడమూర్తి ఆరగింపుతో ప్రసాదానికి ఎంతో విశిష్టత ఏర్పడింది. దీన్ని స్వీకరించేందుకు మహిళలు అమితాసక్తి కనబరిచారు. ప్రసాదం తింటే సత్‌ సంతానం కలుగుతుందన్నది నమ్మకం. దేవతలంతా ఒక్కటై వచ్చి సీతారాములవారిని దీవించాలని దేవతాహ్వానం పలికారు. సూర్య, చంద్ర, ఇంద్ర దేవతలు ఈ కల్యాణోత్సవానికి రావాలని వైదిక పెద్దలు మంత్రోచ్చారణ రూపంలో పిలిచారు. భేరీపూజ నిర్వహించారు.

పూజలు అందుకుంటున్న స్వామివారు


నేడు ఎదుర్కోలు ఉత్సవం

ఎదుర్కోలు ఉత్సవం మంగళవారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు జరగనుంది. వేలాదిమంది భక్తులు తిలకించి, పులకించే సంబరం ఇది. కల్యాణానికి కొద్ది ఘడియల ముందు అత్యంత ఘనంగా ఎదుర్కోలు వేడుక ఉంటుంది. సీతారాములవారి గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. సీతమ్మవారి వైపు ఒకరు, రామయ్యతండ్రి వైపు ఇంకొకరు ఉండి ఇరు వంశాల గొప్పలను సుభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారి తిరువీధి సేవ ఉంటుంది. ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొనే సంబరం కావటంతో అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని