logo

అమ్మో పిడుగు..!

ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

Published : 25 May 2024 05:59 IST

న్యూస్‌టుడే-మక్తల్‌ టౌన్, నారాయణపేట(పాతబస్టాండ్‌) : ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు, పశువులు పిడుగుల బారినపడి చనిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఊట్కూరు మండలం అవుసలోనిపల్లి పిడుగుపాటుకు గురై ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెంది, ఏడుగురు గాయాలపాలైన ఘటన గుర్తుండే ఉంటుంది. ఈనెలలో కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో మనుషులు, పశువులు ప్రాణాలు   వదిలిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పిడుగుపాటుపై అవగాహన పెంచుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఎలా సంభవిస్తుంది?

మేఘాల నుంచి భూ ఉపరితలాన్ని తాకే శక్తిమంతమైన ప్రవాహం పిడుగు. వాతావరణం చల్లబడినప్పుడు మేఘాలలో  ద్రవ, ఘన పదార్థాలు ఉత్పన్నమవుతాయి. వీటికి బలమైన గాలి తోడైనప్పుడు నీరు, మంచు బిందువులు మధ్య రాపిడి ఏర్పడుతుంది. ఫలితంగా మేఘాలలో  కొన్ని వేల కోట్ల పాజిటివ్, నెగటివ్‌ ఛార్జిలు ఏర్పడతాయి. ఇవి ఒకదానికొకటి ఆకర్షించుకున్నప్పుడు అమితమైన విద్యుచ్ఛక్తి, వేడి పుడుతుంది. ఒక పిడుగు సుమారు 30 కోట్ల వోల్టుల విద్యుత్తు శక్తిని కలిగి ఉంటుంది. పిడుగులు చుట్టూ ఉన్న గాలిని రెప్పపాటులో వేడెక్కించి భయంకరమైన శబ్దాన్ని సృష్టిస్తాయి. వర్షం కురిసే సమయంలో కేవలం మేఘాలలోనే కాదు నేలపై ఉండే ఎతైన ప్రదేశాలు, చెట్లు, లోహాలవంటి వాటిపై కూడా పిడుగులు పడుతుంటాయి. ఎతైన చెట్లు, అపార్టుమెంట్లు, విశాల మైదానాలు, భవనాలు, డాబాలు, కరెంటు స్తంభాలు వంటి లోహాలు పిడుగులను ఆకర్షిస్తుంటాయి. పిడుగుపాటుకు గురై గాయపడిన వాళ్లు తర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, పక్షవాతం వంటి శారీరక సమస్యలకు గురవుతున్నారు. 

ముందే తెలుస్తుంది

ఇప్పుడున్న అధునాతన పరిజ్ఞానం ద్వారా 30 నుంచి 40నిమిషాల ముందే పిడుగు పడే ప్రదేశాన్ని గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.

పరిహారం

2015లో విడుదల చేసిన జీవో నంబరు 2 ప్రకారం పిడుగుపాటుకు గురై మనిషి మృతి చెందితే రూ.6లక్షలు, పశువులు మృతి చెందితే రూ.30వేలు ఎక్స్‌గ్రేషియా(పరిహారం) ఇవ్వాలి. 

ఇంటికి ఎర్తింగ్‌ తప్పనిసరి

పిడుగుపడే వాతావరణం ఉందన్నప్పుడు ఇంట్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయాలి. ఆ సమయంలో ఓల్టేజీ వచ్చి విద్యుత్తు ఉపకరణాలు దెబ్బతింటాయి. నివారణకు తప్పనిసరి ప్రతి ఇంటికీ ఎర్తింగ్‌ చేయించాలి. ప్యూజులకు సరైన రేటింగ్‌ కలిగిన తీగను ఉపయోగించాలి. విద్యుత్తు  బోర్డు నుంచి ప్లగ్‌ను తొలగిస్తే పూర్తి రక్షణగా ఉంటుంది. 
జాగ్రత్తలే రక్ష:  ఉరుములు, మెరుపులు ఉండేటప్పుడు చాలామంది  బయట తిరగడం ఆపరు. ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వస్తువులకు భద్రత ముఖ్యం. పిడుగుపాటుకు గురైతే తక్షణం ఆస్పత్రికి తరలించాలి. 
మల్లికార్జున్, అగ్నిమాపకశాఖ అధికారి, నారాయణపేట.


  • వర్షం పడుతున్న సమయంలో ఎత్తయిన చెట్లు, సెల్‌టవర్లు, స్తంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు. విద్యుత్తు నియంత్రికలకు దూరంగా ఉండాలి. 
  • కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌ సిస్టమ్‌లు, విద్యుత్తు స్టవ్‌లు, ఇతర విద్యుత్తు పరికరాలు ఉపయోగించవద్దు. వర్షం కురిసినప్పుడు విద్యుత్తు సరఫరా హెచ్చుతగ్గుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఏం చేయకూడదు?

  • గుంపులుగా కాకుండా దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపుల సమయంలో స్నానాలు చేయడం, పాత్రలు కడగటం వంటివి చేయరాదు. ఇనుప కడ్డీలు ఉన్న గొడుగులు వాడరాదు. 
  • పొలాల్లో పని చేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం వంటివి చేయొద్దు. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. చెరువుకుంటలు, ఈత కొలనులు వంటి బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
  • తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తనకు తానుగా మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా బంతిలా ముడుచుకొని కూర్చోవాలి. దీని వల్ల విద్యుత్తు ప్రవాహం ముప్పు తక్కువగా ఉంటుంది. చెవులు మూసుకోవడం ద్వారా తరంగాలు లోపలికి వెళ్లకుండా చూసుకోవచ్చు.
  • భూమిపై అరికాళ్లు పూర్తిగా ఆనించకుండా వేళ్లపై నిలుచోవాలి. నీటిలో ఉంటే సాధ్యమైనంత వరకు తొందరగా బయటకు రావాలి. 
  • అటవీ ప్రాంతంలో ఉంటే మరుగజ్జు, చిన్న చెట్ల కింద ఆశ్రయం పొందాలి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని