logo

పాడికి ప్రోత్సాహం కొరవడి

వ్యవసాయంపై ఆధారపడే రైతులు అదనపు ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాన్ని మెరుగుపర్చుకొనేందుకు పాడి పరిశ్రమను ఎంచుకుంటారు. ప్రస్తుతం పాడి పశువులను పెంచుకునే రైతులు ఎలాంటి ప్రోత్సాహకాలు లేక, రావాల్సిన పాల బిల్లులు సకాలంలో అందక ఇబ్బందిపడుతున్నారు.

Published : 16 Apr 2024 01:59 IST

నాలుగేళ్లుగా చెల్లించని ప్రభుత్వం

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: వ్యవసాయంపై ఆధారపడే రైతులు అదనపు ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాన్ని మెరుగుపర్చుకొనేందుకు పాడి పరిశ్రమను ఎంచుకుంటారు. ప్రస్తుతం పాడి పశువులను పెంచుకునే రైతులు ఎలాంటి ప్రోత్సాహకాలు లేక, రావాల్సిన పాల బిల్లులు సకాలంలో అందక ఇబ్బందిపడుతున్నారు. పాడి రైతులకు ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ప్రతి లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ప్రకటించింది. విజయ పాల కేంద్రాల్లో పాలు విక్రయించే రైతులకు ఇవ్వాల్సి ఉండగా.. 2020 మార్చి వరకు ఇచ్చిన ఆ తర్వాత పెండింగ్‌లో పెట్టింది. నాలుగేళ్లుగా ఈ ప్రోత్సాహం కోసం రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు.  

తగ్గుతున్న పాల సేకరణ

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 బీఎంసీల ద్వారా ప్రతి రోజు 1700 మంది రైతుల నుంచి 3500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఇలా పాలు పోస్తున్న రైతులకు గత 2020 ఏప్రిల్‌ నుంచి సుమారు రూ.కోటి ప్రోత్సాహకం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ విసుగు చెందిన రైతులు విజయ డెయిరీకి కాకుండా ప్రైవేట్‌ సంస్థలకు పాలు పోస్తున్నారు. ప్రైవేటులో ధర అధికంగా ఉన్నప్పటికీ సకాలంలో డబ్బులు ఇవ్వరని ప్రభుత్వ రంగ డెయిరీల వైపు రైతులు మొగ్గుచూపారు. కానీ ప్రభుత్వ డెయిరీలో సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పాటు ప్రోత్సాహం సైతం లేకపోవడంతో ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విజయ డెయిరీలకు వచ్చే పాలు రోజు రోజుకు తగ్గుతోంది. గత భారాస ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోగా.. ప్రోత్సాహకాన్ని రూ.5కు పెంచుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాడి రైతులకు హామీ ఇచ్చింది. పాత బకాయిలు, పెంచి ఇస్తామన్న ప్రోత్సాహకం తమకు మంజూరు చేయాలని పాడి రైతులు కోరుతున్నారు.

పాల బిల్లు ఆలస్యమే....

పాల కేంద్రాల్లో రోజూ వారిగా పాలు విక్రయించుకునే రైతులకు వారు పోసే పాలలో వెన్నశాతం ప్రకారం ధర చెల్లిస్తుంటారు. పాలలో వెన్నశాతం 5.0 వస్తే లీటరుకు రూ.40.45, గరిష్ఠంగా 10.0 శాతం వస్తే లీటరుకు రూ.80.10 వరకు చెల్లిస్తారు. ఇలా రోజు కేంద్రాలకు పాలు పోసే రైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించాలి. కానీ గత 2-3 నెలల నుంచి సకాలంలో డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

-శ్రీనివాస్‌, విజయ డెయిరీ డీడీ

పాడి రైతులకు లీటరుపై అదనంగా ఇస్తామన్న రూ.4 గత నాలుగేళ్లుగా రావడం లేదు. మెదక్‌ జిల్లాకు సంబంధించి రూ.కోటి వరకు రావాల్సి ఉంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో పాటు పాడి రైతులు ప్రైవేట్‌ డెయిరీల వైపు మొగ్గు చూపడంతో పాల సేకరణ తగ్గుతోంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని