logo

పటిష్ఠమయ్యేలా.. పనులు జరిగేదెలా?

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ లైనింగ్‌ పనులకు నిధులు మంజూరు చేసి చాలాకాలం అవుతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి.

Published : 22 May 2024 02:35 IST

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ లైనింగ్‌ పనులకు నిధులు మంజూరు చేసి చాలాకాలం అవుతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. ఓ సంస్థ ఈ పనుల టెండర్లు దక్కించుకుంది. తడకమళ్ల నుంచి మునగాల వరకు (70వ కిలోమీటర్‌ నుంచి 115 వరకు) రూ.29 కోట్లతో లైనింగ్‌ పనులు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.30 లక్షల విలువైన పనులు మాత్రమే చేయడం గమనార్హం.

మొదలుకాని పనులు..

గత వానాకాలం, యాసంగి సీజన్‌లలో సాగర్‌ డ్యామ్‌లో నీరు లేనందున నీటి విడుదల జరపలేదు. ఆ సమయంలో లైనింగ్‌ చేసి ఉంటే ఆటంకం లేకుండా పనులు జరిగేవి. అప్పుడు చేయలేదు. కనీసం ఇప్పటి వరకు ఈ లైనింగ్‌ పనులు మొదలు పెట్టనేలేదు. ఈ ఏడాది ముందే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండటం గమనార్హం. సాగర్‌ ఎడమ కాల్వ లైనింగ్‌ పనులు, ముక్త్యాల, జాన్‌పహాడ్‌ మేజర్‌ల లైనింగ్‌ పనులు, కృష్ణానదిపై జాన్‌పహాడ్‌ ఎత్తిపోతల పథకం పనులు సైతం ఒకే ప్యాకేజీలో చేపట్టారు. జాన్‌పహాడ్‌ మేజర్‌ పనులు ఇంత వరకు చేయలేదు. ముక్త్యాల బ్రాంచి కెనాల్‌ పరిధిలోనూ నామమాత్రంగానే జరిగాయి. ఎత్తిపోతల పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి. 

దెబ్బతిన్న లైనింగ్‌..

నేరేడుచర్ల మండలంలో మేడారం, ఫత్తేపురం తదితర గ్రామాల పరిధిలో పలుచోట్ల సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతింది. కొన్ని చోట్ల గతంలో వేసిన నాపరాళ్ల లైనింగ్‌ దెబ్బతిని రాళ్లు పూర్తిగా కాల్వలోకి జారిపోయాయి. ఈ ప్యాకేజీలో ఆ లైనింగ్‌ పనులు సైతం ఉన్నాయి. వచ్చే ఏడాది పనుల గడువు పూర్తి కానుంది. లైనింగ్‌ దెబ్బతినడం వల్ల కొన్నిచోట్ల కాల్వ భారీగా కోతకు గురవుతోంది. దీంతో కాల్వకు గండ్ల ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తయితే కాల్వ మరింత పటిష్ఠమవుతుంది. నీటి వృథా తగ్గుతుంది. గండ్ల ముప్పు ఉండని రాతి ప్రదేశంలో మాత్రం లైనింగ్‌ ప్రతిపాదించలేదు. అలా ప్రతిపాదించని ఏరియా 20 శాతం దాకా ఉండవచ్చు. 


గుత్తేదారు జాప్యం చేస్తున్నారు 

- రఘు, డీఈ, సాగర్‌ ఎడమకాల్వ

సాగర్‌ ఎడమ కాల్వ లైనింగ్‌ పనులు చేయడంలో గుత్తేదారు జాప్యం చేస్తున్నారు. రూ.29 కోట్లతో లైనింగ్‌ పనులు చేయాల్సి ఉండగా కేవలం రూ.30 లక్షల విలువైన పనులు మాత్రమే చేశారు. ఉన్నతాధికారుల ద్వారా పనులు చేయాలని గుత్తేదారుపై ఒత్తిడి తెస్తున్నాం. కాల్వకు నీటి విడుదల లేని సమయంలో పనులు చేసి ఉంటే బాగుండేది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని