logo

అడ్డగోలుగా ఇసుక రవాణా

అధికారుల చర్యలు లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. గతంలో రాత్రి వేళల్లోనే అక్రమ రవాణా చేస్తుండగా.. ప్రస్తుతం పట్టపగలే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎన్నికల విధుల్లో అధికారులు ఉంటారని భావించి అక్రమానికి ఒడిగట్టారు.

Published : 26 May 2024 03:02 IST

జిల్లెలమూడి వద్ద పాలేరులో పొక్లెయిన్‌తో తవ్వకాలు

న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం : అధికారుల చర్యలు లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. గతంలో రాత్రి వేళల్లోనే అక్రమ రవాణా చేస్తుండగా.. ప్రస్తుతం పట్టపగలే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎన్నికల విధుల్లో అధికారులు ఉంటారని భావించి అక్రమానికి ఒడిగట్టారు. అనుమతుల్లేకుండానే నిత్యం ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఇదంతా పోలీసు, సెబ్‌ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

జిల్లెలమూడి కేంద్రంగా.. కందుకూరు మండలం జిల్లెలమూడి సమీపంలో పాలేరు వద్ద భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. గతంలో ఇక్కడ ఇసుక రీచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినా.. చుట్టుపక్కల ఎనిమిది  గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని భావించి అనుమతులు రద్దు చేశారు. ఇదే అదనుగా కొంతమంది అక్రమార్కులు విచ్చలవిడిగా తవ్వి తరలిస్తున్నారు. జేసీబీ సాయంతో ప్రతిరోజూ 30 ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతుండగా.. కొద్దిరోజులుగా పట్ట పగలే తరలిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్‌ను కూడా పట్టుకున్న దాఖలాలు లేవు.

మన్నేరు పొడవునా.. నియోజకవర్గంలో మన్నేరు కీలకమైంది. లింగసముద్రం మండలంలో ప్రారంభమై వలేటివారిపాలెం, గుడ్లూరు, కందుకూరు, ఉలవపాడు మండలాల్లోని పలు గ్రామాల సమీపంగా వెళుతోంది. మన్నేరు పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవు. అయినా తరలిస్తున్నారు. కందుకూరు మండలం పాలూరు, శ్రీరంగరాజపురం, వెంకన్నపాలెం, ఉలవపాడు మండలం భీమవరం, కుమ్మరిపాలెం, మన్నేటికోట ప్రాంతాల నుంచి, లింగసముద్రం మండలం వీఆర్‌ కోట, అన్నెబోయినపల్లి, అంగిరేకులపాడు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ 50కి పైగా ట్రాక్టర్లలో తరలిపోతోంది.

చర్యలు తీసుకుంటాం

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందిని పంపి జిల్లెలమూడిలో తవ్వకాలు జరగకుండా చూస్తాం. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతాం. 

 డి.వెంకటేశ్వర్లు, సెబ్‌ సీఐ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని