logo

భూములిస్తే.. మా సంగతేంటి?

రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ సమస్యగా మారింది.

Published : 29 Nov 2022 01:47 IST

ప్రత్యేక ఉపకలెక్టరు పద్మావతిని చుట్టుముట్టిన గ్రామస్థులు

కందుకూరు, న్యూస్‌టుడే: రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఓడరేవును గుడ్లూరు మండలం మొండివారిపాలెం, ఆవులవారిపాలెం పరిధిలోని 832 ఎకరాల్లో నిర్మిస్తుండగా- ఈ రెండు గ్రామాల్లో భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. పరిశ్రమల కోసం చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో 1545 ఎకరాలు సేకరించనున్నట్లు 15 రోజుల కిందట ప్రకటన ఇవ్వగా.. అప్పటి నుంచి సమస్య మొదలైంది. పరిశ్రమలకు సేకరించనున్న భూముల్లో చేవూరులోని మాగాణి ఉంది. ఇక్కడ చిన్న, సన్నకారు రైతులే అధికం. తమకున్న కొద్దిపాటి పొలాన్ని తీసుకుంటే.. జీవనోపాధి ఎలా అనేది వారి ప్రశ్న. దీనికితోడు సుమారు 200 మంది ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు 60 ఏళ్లకుపైగా ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు సాగు చేసుకుంటున్నారు. రావూరులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి భూములకు రిజిస్ట్రేషన్‌ విలువ సుమారు రూ. 7.20 లక్షలు ఉండగా- పరిహారం కింద రూ. 22 లక్షలు ఇస్తున్నారు. రావూరులో రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2.70 లక్షలు ఉండగా.. ఇక్కడి రైతులకు రూ. పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇదే సమస్యకు ఆజ్యం పోసింది. రెండు గ్రామాల్లో ఒకే రీతిన పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. చేవూరు పరిధిలో సుమారు 500 ఎకరాలకుపైగా చుక్కల భూములు ఉన్నాయి. వాటి క్రయ విక్రయాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తే మా బాధలు తీరే అవకాశం ఉందంటున్నారు.


సర్వే అడ్డగింత

గుడ్లూరు, న్యూస్‌టుడే: రామాయపట్నం ఓడరేవు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన పరిశ్రమలకు భూసేకరణ నిమిత్తం వెళ్లిన అధికారులకు గ్రామస్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో 1545 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. రెండు రోజులుగా గ్రామాల్లో భూముల సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామస్థులు సర్వేను అడ్డుకున్నారు.  సోమవారం భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్‌ పద్మావతి ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే సిబ్బంది చేరుకోగా- అక్కడ గ్రామస్థులు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. పరిశ్రమలకు భూములిస్తే జీవనాధారం కోల్పోతామన్నారు. కూలీలుగా మారి.. పనుల కోసం వలసబాట పట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రావూరు గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం ఎదుట పందిరి వేసి.. భూములిచ్చే ప్రసక్తే లేదని.. రైతుల పొట్ట కొట్టొద్దంటూ నినాదాలు చేశారు. మా భూములు తీసుకోవద్దంటూ.. రావూరు గ్రామస్థులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో సర్వే సిబ్బంది చేసేదేమీ లేక వెనుదిరిగారు.


ఆ పరిస్థితే వస్తే...

ఓడరేవు భూసేకరణ సమయంలో అసైన్డ్‌, ప్రభుత్వ భూములకు.. పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని మొదట్లో ప్రకటించారు. చివరకు కేవలం రూ.2 లక్షలే ఇస్తామనడంతో బాధితులు అడ్డుకున్నారు. అనేక చర్చల అనంతరం ఎకరాకు రూ.5లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే వస్తే.. తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు అంటున్నారు.  


ఉన్నతాధికారులకు తెలియజేస్తాం..

లావణ్య, తహసీల్దారు,గుడ్లూరు

రావూరు, చేవూరులో భూసేకరణకు గ్రామస్థులు అడ్డుపడిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. భూసేకరణ సర్వేకు వచ్చిన ప్రత్యేక ఉపకలెక్టరు పద్మావతి ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని