logo

నేను బతికే ఉన్నా..!

నేను ఒతికే ఉన్నానన్న విషయాన్ని ఇప్పటికైనా అధికారులు, సమాజం గుర్తించాలని ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Published : 27 May 2024 03:48 IST

చట్టపరమైన వారసత్వం కోసం ఓ వృద్ధురాలి ఆరాటం
రెండు వారాలుగా తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయింపు

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్వతి  

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: నేను ఒతికే ఉన్నానన్న విషయాన్ని ఇప్పటికైనా అధికారులు, సమాజం గుర్తించాలని ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త చనిపోయి దాదాపు నాలుగు దశాబ్దాలు కావస్తున్నా ఇంతవరకు చట్టపరమైన వారసత్వం (లీగల్‌ హైర్‌) దక్కకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తనకు న్యాయం దక్కేంతవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు రెండు వారాలుగా ఆ పండుటాకు మౌనపోరాటం చేస్తోంది. వివరాల్లోకి వెళితే... స్థానిక పిట్టలవీధికి చెందిన కె.పార్వతి పట్నాయక్‌ (80) భర్త శంకరరావు పట్నాయక్‌ 1985లో మరణించారు. ఆ నాటి నుంచి పార్వతికి ఎలాంటి చట్టపరమైన వారసత్వం దక్కలేదు. గతంలోనూ ఎన్నోసార్లు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం లభించలేదని ఆమె వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కార్యాలయం ముందు బైఠాయించాల్సి వచ్చిందని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం దొరికేంతవరకు కదిలేది లేదని ఆమె భీష్మించుక్కూర్చున్నారు. తుదిశ్వాస విడిచేలోగా చట్టపరమైన వారసత్వం లభించాలని పార్వతి నిట్టూరుస్తున్నారు.
ఏమీ దక్కలేదు: ఈ విషయమై పార్వతి మాట్లాడుతూ భర్త మరణాంతరం తనకు ఏమీ దక్కలేదన్నారు. తనకు మురళీప్రసాద్‌ పట్నాయక్, గోవింద్‌ పట్నాయక్‌ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారని  వెల్లడించారు. తల్లి దీనావస్థ చూసి మురళీ ప్రసాద్‌ ఆమెతో మధ్య మధ్యలో నీళ్లు, ఇతర పానీయాలు తాగిస్తున్నారు. ఈ సందర్భంగా మురళీ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ పదిహేను రోజులుగా తన తల్లి న్యాయం కోసం పోరాడుతోందన్నారు. ఈ విషయమై విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించాలని తహసీల్దార్‌కు, సబ్‌కలెక్టర్‌ దిశానిర్దేశం చేసినట్లు లేఖ పంపారని ఆయన పేర్కొన్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని