logo

మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు

ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం.

Updated : 20 Apr 2024 09:32 IST

న్యూస్‌టుడే, కొమరాడ: ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం. ఈ అయిదేళ్లలో ఒకసారి మాత్రమే మరమ్మతులు చేయడం గమనార్హం.

రాష్ట్ర రహదారి-36 విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.. విశాఖ నుంచి పార్వతీపురం, కొమరాడ మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌  వరకు ఉన్న ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో లారీలు ప్రయాణిస్తాయి. ఒడిశా వరకు వందల సంఖ్యలో నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు వెళ్తాయి. మన్యం పరిధిలో కూనేరు నుంచి పార్వతీపురం వరకు మార్గం గోతులతో నిండిపోయింది. ఎప్పుడు ఏ వాహనం ప్రమాదానికి గురవుతుందో, మరమ్మతులతో ఆగిపోతుందో తెలియని పరిస్థితి. మన పరిధిలో రోడ్డు దాటి ఒడిశాలో అడుగుపెడితే హమ్మయ్య బతికాం అనుకుంటారు. ఇదే మార్గంలో అయిదు కి.మీ పరిధిలో మూడు రైల్వే గేట్లు ఉన్నాయి. ఇక్కడ పై వంతెనల నిర్మాణం గురించి కనీసం పట్టించుకున్న నేతలే కరవయ్యారు.

కొమరాడ శివాలయం వద్ద గోతుల్లో చేరిన నీటిలో చోదకుల పాట్లు

వర్షాకాలంలో నరకమే

వర్షాకాలంలో రోడ్డంతా చెరువును తలపిస్తుంది. గోతుల మధ్యలో లారీలు ఇరుక్కుపోయి గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఆ సమయంలో ట్రాఫిక్‌ను సరిచేయడానికి, జేసీబీలను తీసుకొచ్చి వాహనాలను బయటకు తీయించడానికి పోలీసులకు తలకు మించిన భారమవుతోంది.

ఈ పాపం సర్కార్‌దే

  • 2017 డిసెంబరు 7న పూడేసుకు చెందిన గర్భిణి ఊర్మిళ ఆటోలో ప్రసవించింది. బిడ్డ సగం వరకు బయటకు వచ్చి అలా ఉండిపోవడంతో పార్వతీపురం ఆసుపత్రికి తరలించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సూచించారు. అదే ఆటోలో పార్వతీపురం తరలిస్తుండగా అర్తాం రైల్వే గేటు అడ్డుపడింది. అప్పుడు ఆమె ప్రసవవేదనతో బాధపడింది. ప్రాంతీయ ఆసుపత్రికి చేరిన వెంటనే చికిత్స అందించడంతో తల్లి బిడ్డ ఆరోగ్యంగా బయటపడ్డారు.
  • పూడేసుకు చెందిన ఓ గర్భిణి భర్తతో ద్విచక్ర వాహనంపై ఏరియా ఆసుపత్రికి వస్తుండగా బంగారంపేట గొయ్యి తప్పించే ప్రయత్నంలో ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో లారీ రావడంతో గర్భిణిపై నుంచి వెళ్లిపోవడంతో చనిపోయింది.
  • గతేడాది జనవరి 2న జాకూరు సరుగుగూడ మధ్యలో ట్రక్కర్‌ బోల్తా పడింది. సంఘటన స్థలంలో ఒకరు చనిపోగా, కొన ఊపిరితో ఉన్న ఇంకొకరిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. అదే రహదారి బాగుంటే ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాడని బంధువులు అన్నారు.
  • జనవరి 23న చోళపదం శివాలయం మలుపు వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, జిల్లా ఆసుపత్రికి తీసుకొస్తున్న సమయంలో మరొకరు ప్రాణాలు విడిచారు. గతుకుల రహదారి కావడంతో అత్యవసర వాహనాలు వేగంగా రాలేని పరిస్థితితో చనిపోయాడు.
  • ఫిబ్రవరి 17న కొమరాడ వద్ద రెండు లారీలు ఢీకొని ఒక వాహనంలో చోదకుడు ఇరుక్కుపోయాడు. ఆయన్ని బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు విశ్వప్రయత్నం చేయగా  చివరికి తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. గోతులే ఈ ప్రమాదానికి కారణం.
  • మార్చి 1న అర్తాం వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి గుంతలో దిగి ఒక లారీ బోల్తా పడింది.

ఇక్కడి వారికి చేతకాక..

గతంలో రాయగడ ఒడిశా లారీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొండబాబు, జానకి రామయ్య ఆధ్వర్యంలో కొమరాడ మండలం ఇందిరానగర్‌ వద్ద గోతులను నాలుగు లారీలతో రాళ్లు, డస్ట్‌, మట్టి తీసుకొచ్చి కప్పారు.ఇందుకు రూ.50 వేలు ఖర్చు చేశారు.

  • కొమరాడ శివాలయం, జూనియర్‌ కళాశాల దిగువన, గుమడ వద్ద తెదేపా, సీపీఎం నాయకులు బత్తుల శ్రీను, కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో సొంత నిధులతో లారీల్లో డస్ట్‌ను తీసుకొచ్చి పెద్దపెద్ద గుంతలను కప్పారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు