logo

కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు

ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్‌ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.

Published : 20 May 2024 04:09 IST

ప్రాజెక్టుల ఆధునికీకరణ, నిర్వహణ దూరం
12వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం 
న్యూస్‌టుడే, పాచిపెంట 

గోగాడవలస వద్ద పెద్దగెడ్డ ప్రధాన కాలువ గట్టుకు పడిన గండి ఇలా 

టా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్‌ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.  పాచిపెంట ప్రాంతంలో పెద్దగెడ్డ జలాశయం ప్రధానకాలువ, కర్రివలస వద్ద వేగావతి ఆనకట్ట కుడి, ఎడమ కాలువలు నిర్వహణకు నోచుకోలేదు. వీటి ద్వారా 12 వేల ఎకరాలకు నీరందాల్సి ఉన్నా.. సగం ఆయకట్టుకూ అందని పరిస్థితి. పటిష్ఠ పనులు చేపట్టక కాలువ గట్లు బలహీనపడ్డాయి. పలుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

  • పాచిపెంట మండలంలో కర్రివలస వద్ద వేగావతి ఆనకట్ట ద్వారా 4,500 ఎకరాలకు నీరందాల్సి ఉంది. కుడి, ఎడమ కాలువలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. మిగ్‌జాం తుపానుతో గట్లు దెబ్బతిన్నా ఇంతవరకు బాగుచేయలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల గట్లు బలహీన పడుతున్నాయి. అమ్మవలస వద్ద కాలువ గట్టుకు భారీ గండి పడింది. దీంతో కాలువకు నీరు విడుదల చేసినా ఆయకట్టుకు చేరే పరిస్థితి కనిపించడం లేదు. 
  • పెద్దగెడ్డ జలాశయం ప్రధాన కాలువ ద్వారా 7500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇటీవల వర్షాలకు గట్టు కోతకు గురవ్వగా కొన్నిచోట్ల గండ్లు పడ్డాయి. గోగాడవలసలో 2.5 కి.మీ. వద్ద గట్టుకు గండి పడటమే కాకుండా  మట్టిజారి కాలువలోకి చేరింది. దీంతో ప్రవాహానికి అడ్డంకిగా మారిందని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి పనుల గురించి గుత్తేదారుకు నోటీసులు ఇచ్చామని, వెంటనే మిగిలినవి చేపట్టేలా చర్యలు తీసుకుంటామని పెద్దగెడ్డ ప్రాజెక్టు డీఈ కనకారావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

నిధులున్నా సాగని పనులు

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలోని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న పెద్దగెడ్డ, వేగావతి సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు నిధులున్నా పనులు జరగని పరిస్థితి. రెండున్నర ఏళ్ల కిందట జైకా నిధులు రూ.28.18 కోట్లు మంజూరుకాగా, ఇప్పటికీ కేవలం రూ.3కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. గతేడాది ఖరీఫ్‌ సాగుకు కాలువలకు నీరు విడుదల చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత అడుగులు పడలేదు.


వనరులు అపారం.. అందని జలం

భామిని వద్ద ములగమాను గెడ్డలో తుప్పలు 

భామిని, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సీజన్‌కు ముందే జలవనరుల నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉన్నా.. ఈ ఏడాది ఇంతవరకు భామిని మండలంలోని చెరువులు, గెడ్డల్లో పూడికతీత పనులు చేపట్టనేలేదు. భామిని మండలంలో బత్తిలి వద్ద వెర్రిగెడ్డ, వడ్డంగిలో ములగమాను గెడ్డ, కొరమ వద్ద బగ్గామర్రిపాడు గెడ్డ, దిమ్మిడిజోలలో మినీ జలాశయం, భామిని వద్ద కొండలోయగెడ్డ జలాశయంతో పాటు నులకజోడులో కర్ర చెరువు, సతివాడలో పెద్దసాగరం, బైరాగినాయుడు చెరువు తదితర చిన్నతరహా జలవనరుల ఆధునికీకరణ గాలికి వదిలేశారు. వీటి నిర్వహణ పనులపై యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని