logo

అప్పు పుడితేనే జీతమట

రైతులకు సేంద్రియ వ్యవసాయం చేరువ చేసేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.  క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు  సిబ్బంది వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Published : 28 May 2024 03:52 IST

ప్రకృతి వ్యవసాయ విభాగంలో వేతన సమస్య
15 నెలలుగా ఎదురుచూస్తున్న సిబ్బంది 

 సేంద్రియ వ్యవసాయ విభాగం అధికారి షణ్ముఖరాజుకు వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు (పాతచిత్రం) 

రైతులకు సేంద్రియ వ్యవసాయం చేరువ చేసేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.  క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు  సిబ్బంది వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 15 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు అర్ధాకలితో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ బ్యాంకు నుంచైనా అప్పు పుడితేనే చెల్లిస్తామని అధికారులు చెబుతుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 

పార్వతీపురం, న్యూస్‌టుడే : రైతు సాధికారిత సంస్థకు అనుబంధంగా జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రాజెక్టు అధికారిగా వ్యవసాయ శాఖ నుంచి ఒక సీనియర్‌ను నియమించారు. ఆయన ఆధీనంలో కొందరు పరిమిత వేతనంతో పనిచేస్తున్నారు. వీరిలో డివిజన్‌ స్థాయిలో మాస్టర్‌ ట్రైనీలు, మండల స్థాయిలో యూనిట్‌ ఇన్‌ఛార్జులు, గ్రామాల్లో సీఆర్పీలు, ఐసీఆర్పీలు పని చేస్తారు. వీరి స్థాయిని బట్టి ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3లుగా విభజించి వేతనాలు చెల్లిస్తారు. జిల్లాలో 107 యూనిట్ల పరిధిలో గరిష్ఠంగా 3 వేల మంది రైతులకు 450 మంది క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేలు నుంచి రూ.40 వేల వరకు వేతనాలు ఇవ్వాలి. జిల్లాలో ఉద్యోగులందరికీ నెలకు రూ.30 లక్షల వరకు అందాల్సి ఉంది.  

ఒక్కోసారి.. ఒక్కో మాట: జీతాల కోసం సిబ్బంది ప్రశ్నిస్తే అధికారులు ఏదో ఒక కథ చెబుతున్నారు. మార్చిలో జీతం ఇస్తారో, ఇవ్వరో చెప్పండంటూ నిలదీస్తే.. ‘దారిద్య్ర నిర్మూలన సంస్థ’ ఆధ్వర్యంలో స్త్రీనిధి నుంచి రుణం తీసుకుంటున్నామని, వచ్చిన వెంటనే చెల్లిస్తామని చెప్పారు. తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడేమో ఎస్‌బీఐ అప్పు ఇస్తుందని, దీని కోసం ఖాతాలు తెరిపించామని అధికారులు చెప్పడంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. జీతాల కోసం ఇంకెన్ని నెలలు ఎదురుచూడాల్సి వస్తుందోనని వారు వాపోతున్నారు. 

రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులే 

ఈ విభాగంలో కొందరు స్థానికంగా ఉన్న గ్రామాల్లో పని చేస్తున్నారు. మరికొందరు వేర్వేరు గ్రామాలకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు 30 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తున్నారు. వీరికి రవాణాకు రోజుకు రూ.150 వరకు ఖర్చు అవుతోంది. వేతనాలు అందకపోవడంతో ఈ ఖర్చులకు సైతం సిబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జీతాలు సక్రమంగా రాని ఉద్యోగాలు చేస్తూ భార్యాపిల్లలను ఆకలితో చంపేస్తారా అని కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలా బతకాలి.. 

2018 నుంచి పనిచేస్తున్నా. ఇప్పుడు వేరే పని చేసుకోలేక దీనిలోనే కొనసాగుతున్నా. కొన్ని నెలలు చూడండి.. వేతనాలు రాకపోతే మానేయొచ్చని కొందరు సలహా ఇస్తున్నారు. పదిహేను నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకగలం.  

- నాగార్జున, సీఆర్పీ, లిడికివలస, పార్వతీపురం మండలం

త్వరలోనే చెల్లింపులు 

ఈ నెలాఖరులోపు ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకొని వేతనాలు చెల్లిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఖాతాలు తెరవాలని సూచనలు వచ్చాయి. తొలి అంచెగా ఆరు నెలల వేతనం జమ చేస్తారు. మిగిలినది మరో రెండు నెలల్లో చెల్లిస్తారు. 

- షణ్ముఖరాజు, ప్రకృతి వ్యవసాయం జిల్లా పథక అధికారి   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని