logo

పక్క వీధిలో ఉన్నా.. పట్టుకోలేక!

‘ఒంగోలు బిలాల్‌నగర్‌కు చెందిన బాలిక అదృశ్యం ఉదంతంలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆమెకు తండ్రి లేరు. తల్లి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లారు. సోదరుడితో కలిసి ఇంట్లో ఉంటోంది.

Updated : 05 Jul 2023 09:45 IST

సమ్మతితోనే అంటూ సమర్థింపు
బాలిక ‘అదృశ్యం’లో బేతాళ ప్రశ్నలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘ఒంగోలు బిలాల్‌నగర్‌కు చెందిన బాలిక అదృశ్యం ఉదంతంలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆమెకు తండ్రి లేరు. తల్లి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లారు. సోదరుడితో కలిసి ఇంట్లో ఉంటోంది. సమీపంలో నివసించే ఖలీల్‌ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి జూన్‌ 15న ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. బాలిక సోదరుడు జూన్‌ 16న అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తితో కలిసి వాహనంపై వెళ్లినట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాం. చుట్టుపక్కల వారిని విచారించాం. కుటుంబ సభ్యుల ఫోన్‌ కాల్స్‌ వివరాలు, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించాం. దర్యాప్తు చేస్తుండగానే జూన్‌ 30వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాలిక, కుటుంబ సభ్యులు స్టేషన్‌కి వచ్చారు. ఖలీల్‌ అనే వ్యక్తి తన ఇంట్లో నిర్బంధించి 13 రోజులపాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసును అత్యాచారం, పోక్సో చట్టం కిందకి మార్చి నమోదు చేశాం. నిందితుడు ఖలీల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. మైనర్‌ కావడంతో చట్టప్రరకారం చర్యలు తీసుకుంటున్నాం. కేసు విచారణ త్వరగా పూర్తిచేసి నిందితుడికి శిక్షపడేలా చర్యలు చేపడుతున్నాం..’ ఇదీ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ మలికా గార్గ్‌ పేరుతో మంగళవారం విడుదల చేసిన ప్రకటన.

ఆచూకీ కనిపెట్టడంలో  ఘోర వైఫల్యం...

ప్రకటనలో పోలీసుల వాదన పూర్తిగా అసంబద్ధంగా అనిపిస్తోంది. బాలిక ఆచూకీని కనిపెట్టడంలో వైఫల్యం చెందారు. చివరికి ఇదంతా ఆమె సమ్మతితోనే సాగిందంటూ ప్రకటించారు. చట్టం ప్రకారం బాధితురాలు మేజర్‌ అయితే వారి ప్రకటనను సమర్థించే వీలుంది. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నం. బాధితురాలు మైనర్‌. ఆమె అతన్ని నమ్మి తానంతట తానే వెళ్లినా అది నేరమే అవుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సత్వరం స్పందించి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించాల్సి ఉంది. సుదూర, గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లి ఉంటే అది వేరే విషయం. ఈ కేసులో బాధితురాలైన బాలిక కేవలం తన నివాసానికి పక్క వీధిలోనే ఉంది. అదృశ్యమైన ప్రాంతానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉన్నా ఆచూకీ కనిపెట్టలేకపోవడం వైఫల్యం. బాలిక సమ్మతితోనే అయినా నేరంగా పరిగణించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పులే చెబుతున్నాయి. పదమూడు రోజులపాటు ఆమె ఆచూకీ కనుగొనడంలో విఫలమైన పోలీసులు.. అంతా ఆమె అనుమతితోనే అంటూ తమ ప్రకటనలో పేర్కొనడం అభ్యంతరకరం.


ఈ సందేహాల మాటేమిటో మరి..

పోలీసుల ప్రకటన...

  • బాలికను జూన్‌ 15వ తేదీ సాయంత్రం అయిదు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లాడు. 16వ తేదీ సాయంత్రం అయిదు గంటల సమయంలో బాలిక సోదరుడు ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో అద్యశ్యంపై ఫిర్యాదు చేశాడు. 15వ తేదీ ఉదయం పది గంటల నుంచి తన సోదరి కనిపించటం లేదని అందులో పేర్కొన్నాడు.

  •  ఫిర్యాదులో ఆమె ఎవరో కొత్త వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై చుట్టుపక్కల వారిని విచారించాం. కాల్‌ వివరాలు, సీసీ కెమెరా ఫుటేజీలూ పరిశీలించాం.
  • జూన్‌ 30వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో అదృశ్యమైన బాలిక తన కుటుంబీకులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసును అత్యాచారం, పోక్సోగా మార్చాం.

సందేహం

  • బాలిక 15వ తేదీ సాయంత్రం అయిదు గంటల నుంచి కనిపించడం లేదని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం 15వ తేదీ ఉదయం పది గంటల నుంచి అదృశ్యమైనట్లు తెలిపారు. వీటిలో ఏది వాస్తవం.
  • ఎవరా కొత్త వ్యక్తి. అతను ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయాలు పోలీసులు ఏమైనా ఆరా తీశారా..? చుట్టుపక్కల వారిని విచారించినప్పటికీ.. సుమారు వంద అడుగుల దూరంలోనే పక్క వీధిలో ఉన్న బాలిక ఆచూకీని 13 రోజులుగా గుర్తించలేకపోయారా..? ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరనే విషయాన్ని కనీసం పసిగట్టలేకపోయారా..?
  • బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు 16న అదృశ్యం కేసు నమోదైంది. 30న ఆమె తన కుటుంబీకులతో కలిసి స్టేషన్‌కు వచ్చే వరకు పోలీసులు దర్యాప్తు విషయాన్ని ఏం చేసినట్లు..? చుట్టుపక్కల విచారించినా ఆచూకీ తెలియలేదా..?

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని