logo

నన్నే తప్పిస్తారా.. తేల్చుకుంటా!

పోలీసు శాఖలో అత్యంత కీలకం స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ). జిల్లాలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. పోలీస్‌ స్టేషన్లలో ఏం జరుగుతోందనే సమాచారం ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారానే జిల్లా పోలీస్‌ బాస్‌కు చేరుతాయి.

Updated : 24 Jul 2023 06:01 IST

నిఘా వైఫల్యంపై ఎస్పీ ఆగ్రహం
తాలూకా ఎస్‌బీ హెచ్‌సీకి ఉద్వాసన
సిమ్‌ కార్డు ఇవ్వకుండా ధిక్కారస్వరం

న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం : పోలీసు శాఖలో అత్యంత కీలకం స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ). జిల్లాలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. పోలీస్‌ స్టేషన్లలో ఏం జరుగుతోందనే సమాచారం ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారానే జిల్లా పోలీస్‌ బాస్‌కు చేరుతాయి. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఏఎస్సై లేదంటే హెడ్‌ కానిస్టేబుల్‌ పనిచేస్తుంటారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పోలీసింగ్‌లోని లోపాలు, వాస్తవ పరిస్థితులు ఉన్నతస్థాయికి చేరటం లేదు. అవి రాష్ట్ర వ్యాప్త సంచలనాలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇటీవల ఈ తరహాలో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీలో కొందరు సిబ్బంది తీరుపై ఎస్పీ మలికా గార్గ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు తాలూకా పరిధిలో ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంగళరెడ్డిని తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెనువెంటనే ఆ స్థానంలో మరొకరిని నియమించారు. అయితే ఎస్పీ ఆదేశాలను వెంగళరెడ్డి ధిక్కరించారు. తనకు శాఖాపరంగా కేటాయించిన అధికారిక సిమ్‌ను అధికారులకు అప్పగించలేదు. తన తొలగింపు విషయాన్ని నాయకులు వద్ద తేల్చుకుంటానంటూ నిరసన స్వరం వినిపించారు. ఈ పరిణామం ఇప్పుడు జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

తెలియదు.. గుర్తించలేదు.. చెప్పలేదు...

* ఒంగోలు శివారులో నేరగాళ్లు కొందరు జూన్‌ 19న ఘర్షణ పడ్డారు. ఓ గిరిజన యువకుడి పట్ల పైశాచికంగా వ్యవహరించారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో మద్యం తాగుదామని తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడిచేశారు. అంతటితో ఆగకుండా నోట్లో మూత్రం పోశారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వైనాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇంత జరుగుతున్నా ఈ విషయాన్ని ఎస్‌బీ గుర్తించలేకపోయింది.

* ఒంగోలులో బీసీ వర్గానికి చెందిన పదిహేనేళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమె అదృశ్యంపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా ఆచూకీ కోసం పెద్దగా ప్రయత్నించలేదు. పదిహేను రోజులపాటు ఆమెను తన ఇంట్లోనే ఉంచుకున్న యువకుడు చివరకు తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలే వరకు పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ కేసులో ఏం జరుగుతుందనే విషయాన్ని సైతం ఎస్‌బీ సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదించలేదు.

* మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి వద్ద పీఏగా పనిచేసిన ఓ వ్యక్తిని ఆర్థిక అవకతవకల ఆరోపణలపై మద్దిపాడులో పోలీసులు నిర్బంధించి విచారించారు. అనంతరం అతన్ని ఒంగోలు తాలూకా స్టేషన్‌కు తీసుకొచ్చి విశాఖకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి కుటుంబీకులు, బంధువులు ప్రతిఘటించారు. అర్ధరాత్రి వేళ పోలీసు స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ సీసాలతో ఆందోళన చేశారు. అక్కడ ఏం జరిగిందనే విషయం తెల్లారిన తర్వాత పత్రికల్లో వార్తలు చూస్తే తప్ప ఉన్నతాధికారులకు తెలియకుంది.

* కర్రపెత్తనం పైనే మక్కువ...: ఎస్‌బీలో పోస్టింగ్‌ కొందరికి ఒక క్రేజ్‌గా మారింది. యూనిఫాం వేయాల్సిన పనిలేదు. బందోబస్తులు, రాత్రి విధులుండవు. ప్రతి విషయాన్నీ నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో నివేదించగల సౌలభ్యం ఉంటుంది. దీంతో సహజంగానే ఎస్‌హెచ్‌వోలు ఎస్‌బీ సిబ్బంది పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ప్రత్యేక గౌరవమూ దక్కుతుంది. ఇదే అదనుగా కొందరు ఎస్‌బీ సిబ్బంది స్టేషన్లలో క్షేత్రస్థాయి సిబ్బందిపై కర్రపెత్తనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అసలు పనిని పక్కనబెట్టి డాబూదర్పం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సైతం కొందరు ఎదుర్కొంటున్నారు. ఎస్‌బీ విధుల్లో పాస్‌పోర్టు పరిశీలన ప్రధానం. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చివరకు ఈ విధులను సైతం కొందరు ఇతరులకు కాంట్రాక్టుకు అప్పగిస్తూ తమ వ్యక్తిగత పనులను చక్కబెట్టుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

* హెడ్‌ కానిస్టేబుల్‌పై వేటు...: జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను మానవ హక్కుల కమిషన్‌, ఎస్టీ కమిషన్లు తీవ్రంగా పరిగణించాయి. ఉన్నతాధికారులకు సైతం ఈ పరిణామాలు ఇబ్బందిగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీలో కొందరు సిబ్బంది పనితీరుపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహించినట్లు సమాచారం. ప్రత్యేకించి ఒంగోలు తాలూకా పరిధిలో ముందస్తు సమాచార సేకరణలో విఫలమైన హెడ్‌ కానిస్టేబుల్‌ వెంగళరెడ్డిని విధుల నుంచి తప్పించారు. ఆయన తక్షణం చీమకుర్తి స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించి ఆ స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఎస్పీ ఆదేశించినప్పటికీ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంగళరెడ్డి తన అధికారిక సిమ్‌ కార్డును అధికారులకు అప్పగించలేదు. తనను బాధ్యతల నుంచి ఎలా తప్పిస్తారని, ఈ విషయాన్ని నాయకుల వద్దే తేల్చుకుంటానని చెబుతున్నట్టు సమాచారం. అప్పటి వరకు సిమ్‌కార్డు అప్పగించే ప్రసక్తే లేదని భీష్మించినట్లు తెలిసింది. ఈ పరిణామాలు చర్చకు దారి తీశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని