logo

జగనన్నా.. పేదలంటే ఎందుకంత పగ..!

ఉపాధి కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. పని ప్రదేశాల్లో కనీస వసతులు లేక తల్లడిల్లుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ సొమ్మ పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై చిన్న చూపు చూస్తోంది.

Published : 13 Apr 2024 02:09 IST

పని ప్రాంతంలో వసతులు కరవు
ఎండలకు తాళలేక పోతున్న కూలీలు
కంభం, అర్థవీడు, త్రిపురాంతకం, న్యూస్‌టుడే

కాకర్ల గ్రామంలో ఉపాధి పని వద్ద సృహ తప్పి పడిపోయిన  మహిళకు సపర్యలు చేస్తున్న తోటి కూలీలు

ఉపాధి కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. పని ప్రదేశాల్లో కనీస వసతులు లేక తల్లడిల్లుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ సొమ్మ పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై చిన్న చూపు చూస్తోంది. పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స పెట్టెలు కానీ..నీడ వసతి కానీ కల్పించ లేక పోయింది. పేరుకు ప్రజల ప్రభుత్వమని..నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ ప్రతి సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప...పనికి వెళ్లేది పేదలన్న సంగతి జగనన్న మరిచారు.

వేసవి వచ్చిందంటే గ్రామాల్లో పనులు ఉండవు. ఉపాధి హామీ పనులే ఆధారం. ప్రస్తుతం రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉపాధి పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోజనం చేసి, కొంత సమయం సేద తీరేందుకు నీడ కరవవుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స పెట్టెలు అందుబాటులో లేవు. తాగేందుకు మంచినీరు సైతం ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లమల్ల అటవీ పరిధి గ్రామాల్లో సగటున పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైనే ఉండటంతో ఉపాధి హామీ పని ప్రమాదాలకు నెలవుగా మారాయి.

అప్పుడు అలా..: తెలుగుదేశం హయాంలో  పట్టాలు సరఫరా చేశారు. ప్రథమ చికిత్స పెట్టెలు అందుబాటులో పెట్టారు. కూలీలకు మజ్జిగ ఇచ్చారు. గడ్డపార సరఫరా చేశారు. కూలీలే నీళ్లు తెచ్చుకున్నందుకు ఒక్కో వ్యక్తికి రూ.5, తట్టకు రూ.3 అందజేశారు. వేసవి అలవెన్స్‌ కింద ఫిబ్రవరి నెలకు రూ.20, మార్చి 25, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం చొప్పున అలవెన్స్‌ ఇచ్చే వారు. మేట్లకు అలవెన్స్‌ ఇచ్చేవారు.  వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పట్టాలు, నీళ్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స పెట్టెలు, గడ్డపార వంటివి ఇవ్వలేదు.

వేతనం జమకాలేదు

త్రిపురాంతకం మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి పనులకు సంబంధించి పనికి తగిన వేతనం జమకాలేదని ఉపాధి కూలీలు శుక్రవారం స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రానికి చెందిన ఓ గ్రూపు వారం రోజులు పనికి వెళ్లారని అయితే వారికి కేవలం రూ.220లు మాత్రమే జమ అయ్యాయని ఏపీవో సుజాతను కలిసి తమ సమస్యను వివరించారు.

ఇదీ పరిస్థితి

పశ్చిమ ప్రకాశం రాచర్ల మండలం అనుములపల్లిలో గురువారం ఉపాధి పనికి వెళ్లిన ఆంజనేయులు గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అర్థవీడు మండలం కాకర్ల గ్రామంలోనూ బాలమ్మ అనే మహిళ ఉపాధి పని చేస్తుండగా ఎండకు తాళలేక సృహ తప్పి పడిపోయింది. పని ప్రదేశంలో ఎటువంటి ప్రథమ చికిత్స వసతులు లేకపోవడంతో హుటాహుటిన కంభం ప్రభుత్వ వైద్యశాలకు ఆటోలో తరలించారు.

జిల్లాలో పని చేస్తున్న కుటుంబాలు : 3.06 లక్షలు
పని చేస్తున్న కూలీలు : 5.36 లక్షలు
ప్రభుత్వం ఇచ్చిన జాబ్‌ కార్డులు : 4.35 లక్షలు


నీడ కరవు

తెలుగుదేశం హయాంలో ఉపాధి హామీ పథకంలో మెరుగైన వసతులు ఉండేవి. వైకాపా వచ్చిన తర్వాత పని ప్రదేశంలో కనీసం నీడ కరవైంది. గతంలో నీడ కోసం పట్టాలు ఇచ్చేవారు. వాటి కింద కూర్చొని భోజనాలు చేసి, కొంత సమయం సేద తీరేవాళ్లం. పనిచేసే సమయంలో దెబ్బలు తగలితే ప్రథమ చికిత్స పెట్టెలు మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వద్ద ఉండేవి, ఈ అయిదేళ్లలో వాటి ఊసే లేదు. అప్పట్లో మంచినీరుకు సైతం డబ్బులు ఇచ్చే వారు. ఎండలు ఎక్కువగా ఉండే మజ్జిగ ఇచ్చేవారు, ఇతర అలవెన్సులు ఉండేవి. వైకాపా పాలనలో అన్నీ తీసేశారు. పని చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

నందిగం శేషగిరిరావు, ఉపాధి కూలీ, కలగొట్ల, బేస్తవారపేట మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని